Jandhan Yojana Scheme
-
ఆర్థిక సేవల చేరువలో ‘జన్‌ధన్’ విప్లవం
న్యూఢిల్లీ: జన్‌ధన్ యోజన ఆధారిత చర్యలు, డిజిటల్ పరివర్తన దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే విషయంలో విప్లవాత్మకంగా పనిచేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. జన్‌ధన్ యోజన పథకం కింద 50 కోట్ల మందిని అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చామని, ఈ ఖాతాల్లో డిపాజిట్లు రూ.2 లక్షల కోట్లను మించాయని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) పథకం తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక సమ్మేళన చర్యల్లో ఇది కూడా ఒకటిగా పేర్కొన్నారు. జన్‌ధన్ ఖాతాల్లో 55.5 శాతం మహిళలు ప్రారంభించినవేనని, 67 శాతం గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో తెరుచుకున్నవేనని వెల్లడించారు. ఈ పథకం కింద 2015 మార్చి నాటికి 14.72 కోట్ల బ్యాంక్ ఖాతాలు ఉంటే, 2023 ఆగస్ట్ 16 నాటికి 50.09 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో డిపాజిట్లు రూ.15,670 కోట్ల నుంచి రూ.2.03 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. ఈ ఖాతాలకు సంబంధించి 34 కోట్ల రూపే కార్డులను కూడా బ్యాంకులు మంజూరు చేశాయి. ఈ కార్డుపై రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమా సైతం లభిస్తుంది. ఈ ఖాతాల్లో కనీస బ్యాలన్స్ ఉంచాల్సిన అవసరం కూడా లేదు. ‘‘భాగస్వాములు, బ్యాంక్‌లు, బీమా కంపెనీలు, ప్రభుత్వ అధికారుల సంయుక్త కృషితో పీఎంజేడీవై కీలక చొరవగా పనిచేసి, దేశంలో ఆర్థిక సేవల విస్తరణ ముఖచిత్రాన్ని మార్చేసింది’’అని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ మాట్లాడుతూ.. జన్‌ధన్–ఆధార్–మొబైల్ ఆర్కిటెక్చర్‌తో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా లబి్ధదారులకు బదిలీ చేయగలుగుతున్నట్టు చెప్పారు. -
జన్‌ధన్ ఖాతాల్లో రూ.లక్ష కోట్ల డిపాజిట్లు
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ఆరంభమైన జన్‌ధన్ యోజన పథకం ఓ రికార్డును చేరుకుంది. ఈ పథకం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో సామాన్యుల డిపాజిట్లు రూ.లక్ష కోట్ల మార్కును చేరాయి. జూలై 3 నాటికి ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) కింద 36.06 కోట్ల ఖాతాల్లోని మొత్తం డిపాజిట్లు రూ.1,00,495.94 కోట్లుగా ఉన్నట్టు ఆర్థిక శాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ 6 నాటికి ఈ డిపాజిట్లు రూ.99,649.84 కోట్లుగా ఉండగా, క్రమంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. పీఎంజేడీవై పథకాన్ని మోదీ సర్కారు తొలిసారి కేంద్రంలో కొలువు దీరిన సంవత్సరం 2014 ఆగస్ట్ 28న ప్రారంభించిన విషయం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ బ్యాంకు సేవలను అందించడమే దీని ఉద్దేశ్యం. ఇవన్నీ జీరో బ్యాలన్స్ సదుపాయంతో కూడిన బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలు. ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డుతోపాటు, బ్యాలన్స్ లేకపోయినా రూ.5 వేల ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. -
ప్రతి ఇంటికీ రెండు బ్యాంకు ఖాతాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రతి ఇంట్లో భర్తతోపాటు భార్యకూ బ్యాంకు ఖాతా ఉండేలా కేంద్రప్రభుత్వం జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ ఎన్.శ్రీధర్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్బీహెచ్లో జన్‌ధన్ యోజన ఖాతాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద, బలహీన వర్గాల అభ్యున్నతికి ఈ పథకం దోహదపడుతుందన్నారు. ఎలాంటి ప్రీమియం లేకుండా ఖాతాదారులకు రూ. లక్ష బీమాతో కూడిన జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరవడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్లోని ఎస్బీహెచ్ బ్రాంచ్‌లో 300 ఖాతాల లక్ష్యం త్వరలో పూర్తి కానున్నట్లు చెప్పారు. ఖాతాలు తెరిచిన వారికి కలెక్టర్ పాసుపుస్తకాలు అందజేశారు.