![ONGC debt mobilization to buy HPCL - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/25/HPONGC-1516459631.jpg.webp?itok=2Hc8ZRUs)
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.4,000 కోట్ల రుణాన్ని తీసుకుంది. హెచ్‌పీసీఎల్‌లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 51.11 వాటాను ఓఎన్‌జీసీ కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.36,915 కోట్లు ఓఎన్‌జీసీకి అవసరమవుతాయి. ఇప్పటికే మూడు బ్యాంకుల నుంచి రూ.18,060 కోట్లను ఓఎన్‌జీసీ రుణాలుగా తీసుకునేందుకు ఒప్పందాలు చేసుకుంది. పీఎన్‌బీ నుంచి రూ.10,600 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 4,460 కోట్లు తీసుకుంటుండగా, యాక్సిస్ బ్యాంకు మరో రూ.3,000 కోట్ల మేర సమకూర్చనుంది. రూ.25,000 కోట్ల నుంచి రూ.35,000 కోట్ల వరకు రుణాలు తీసుకునేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్టు ఓఎన్‌జీసీ చైర్మన్, ఎండీ శశి శేఖర్ రెండు రోజుల క్రితమే తెలిపారు.
తమ దగ్గరున్న రూ.12,000–13,000 కోట్ల నగదు నిల్వల్ని వినియోగించిన తర్వాత లిక్విడ్ ఆస్తుల గురించి ఆలోచిస్తామని, ఆ తర్వాతే రుణం రూపంలో అవసరమైన మేర తీసుకోవడం ఉంటుందన్నారు. హెచ్‌పీసీఎల్ కొనుగోలుతో ఓఎన్‌జీసీ సమగ్ర చమురు కంపెనీగా అవతరించనుంది. అంతేకాదు, ఈ సంస్థకు ఇదే అతిపెద్ద కొనుగోలు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్‌కు కేజీ బేసిన్‌లో ఉన్న 80 శాతం వాటాను ఓఎన్‌జీసీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఓఎన్‌జీసీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 13.77 శాతం వాటా ఉండగా, దీని మార్కెట్ విలువ రూ.26,000 కోట్లు. గెయిల్ ఇండియాలోనూ 4.86 శాతం వాటా ఉంది. దీని మార్కెట్ విలువ రూ.3,800 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment