ఓఎన్‌జీసీ చేతికి హెచ్‌పీసీఎల్‌! | In bid to create integrated oil giant, ONGC may acquire HPCL in $6.6 bn deal | Sakshi
Sakshi News home page

ఓఎన్‌జీసీ చేతికి హెచ్‌పీసీఎల్‌!

Published Tue, Feb 28 2017 12:52 AM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

ఓఎన్‌జీసీ చేతికి హెచ్‌పీసీఎల్‌!

ఓఎన్‌జీసీ చేతికి హెచ్‌పీసీఎల్‌!

మెగా చమురు పీఎస్‌యూ వచ్చేస్తోంది!
డీల్‌ విలువ రూ.44,000 కోట్లుగా అంచనా...
ప్రభుత్వానికి చెందిన 51.1 శాతం వాటా
కొనుగోలుకు త్వరలో కేబినెట్‌ నోట్‌...
మరో 26 శాతం ఓపెన్‌ ఆఫర్‌కు అవకాశం  


విలీన వార్తల నేపథ్యంలో సోమవారం హెచ్‌పీసీఎల్‌ షేరు ధర 2% క్షీణించి రూ.560 వద్ద ముగిసింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్‌ విలువ రూ.56,859 కోట్లుగా ఉంది. ఇక ఓఎన్‌జీసీ షేరు కూడా స్వల్పంగా 0.61% నష్టంతో రూ.194 వద్ద స్థిరపడింది. దీని మార్కెట్‌ విలువ రూ. 2,49,543 కోట్లు.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో మెగా చమురు దిగ్గజాన్ని నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం త్వరలోనే సాకారం కాబోతోంది. ఇందుకోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థ(ఆయిల్‌ పీఎస్‌యూ)ల విలీనాలు చేపడతామంటూ తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన ప్రకటన కార్యరూపం దాల్చనుంది. చమురు–గ్యాస్‌ ఉత్పత్తిలో అగ్రగామి ఓఎన్‌జీసీ.. చమురు మార్కెటింగ్‌ కంపెనీ హెచ్‌పీఎసీఎల్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందని సోమవారం విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఈ డీల్‌ విలువ దాదాపు రూ.44,000 కోట్లు(6.6 బిలియన్‌ డాలర్లు) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రానికి హెచ్‌పీసీఎల్‌లో 51.11 శాతం వాటా ఉంది. ఒప్పందంలో భాగంగా దీన్ని ఓఎన్‌జీసీ కొనుగోలు చేయనుంది. అయితే, సెబీ నిబంధనల ప్రకారం ఇతర హెచ్‌పీసీఎల్‌ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఓఎన్‌జీసీ ఓపెన్‌ఆఫర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది.

సిద్ధమవుతున్న కేబినెట్‌ నోట్‌...
ప్రతిపాదిత విలీనానికి సంబంధించి కేబినెట్‌ నోట్‌ సిద్ధం అవుతోందని సమాచారం. అయితే, దీనికి రెండు అంచెల్లో కేబినెట్‌ ఆమోదం అవసరమవుతుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ముందుగా ఓఎన్‌జీసీలో తనకున్న 51.11 శాతం వాటాను విక్రయించేందుకు, ఆతర్వాత ఓఎన్‌జీసీ ఈ వాటా కొనుగోలు కోసం నిధులను ఖర్చుచేసే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. సోమవారం నాటి హెచ్‌పీసీఎల్‌ షేరు ధర ప్రకారం ప్రభుత్వ వాటా 51.11 శాతానికి గాను ఓఎన్‌జీసీ రూ.29,128 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఇక మరో 26 శాతం ఓపెన్‌ ఆఫర్‌ కోసం రూ.14,817 కోట్లు వెచ్చించాలి. మొత్తంమీద ఈ డీల్‌ విలువ సుమారు రూ.44,000 కోట్లుగా లెక్కతేలుతోంది.

ఆప్షన్లు తక్కువే...
‘ఈ విలీనాలకు సంబంధించి ఆప్షన్లు తక్కువే. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌ను ఓఎన్‌జీసీతో విలీనం చేయడం ఇందులో ఒకటి. ఐఓసీ, ఆయిల్‌ ఇండియాలను కలిపేయడం రెండో ఆప్షన్‌. అయితే, దీనివల్ల చమురు మార్కెటింగ్‌ రంగంలో రెండే కంపెనీలు ఉన్నట్లవుతుంది. కస్టమర్లకు ఇంధనం కొనుగోలులో చాయిస్‌ ఉండదు. అందుకే హెచ్‌పీసీఎల్‌ను ఓఎన్‌జీసీతో విలీనం చేసి.. బీపీసీఎల్‌ను ప్రత్యేకంగానే కొనసాగించడం మంచిది. బీపీసీఎల్‌ అనుబంధ సంస్థ భారత్‌ పెట్రోరిసోర్సెస్‌ లిమిటెడ్‌ను పటిష్టం చేసే వీలుంటుంది. ఈ ప్రణాళిక ప్రకారమైతే ఐఓసీ, ఓఎన్‌జీసీ–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌ ఇలా 3 చమురు రిటైలర్ల సేవలు లభిస్తాయి’ అని సంబంధిత ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.

మూడో అతిపెద్ద రిఫైనరీగా...
హెచ్‌పీసీఎల్‌ను విలీనం చేసుకోవడం ద్వారా ఓఎన్‌జీసీకి 23.8 మిలియన్‌ టన్నుల వార్షిక చమురు రిఫైనింగ్‌ సామర్థ్యం జతవుతుంది. దీనిద్వారా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌), ఐఓసీ తర్వాత దేశంలో మూడో అతిపెద్ద రిఫైనరీగా ఓఎన్‌జీసీ–హెచ్‌పీసీఎల్‌ అవతరిస్తుంది. దేశంలో చమురు–గ్యాస్‌ రంగంలో ప్రస్తుతం ప్రధానంగా ఆరు పీఎస్‌యూలు ఉన్నాయి. ఇందులో ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా(ఓఐఎల్‌)లు చమురు ఉత్పత్తిని చేపడుతున్నాయి. ఇండియన్‌ ఆయిల్‌(ఐఓసీ), హిందుస్థాన్‌ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్‌), భారత్‌ పెట్రోలియం(బీపీసీఎల్‌)లు పెట్రోఉత్పత్తుల మార్కెటింగ్‌లో ఉన్నాయి. ఇక గెయిల్‌ గ్యాస్‌ రవాణా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.

ఇవికాకుండా ఓఎన్‌జీసీ విదేశ్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌(సీపీసీఎల్‌), నుమాలిగఢ్‌ రిఫైనరీ లిమిటెడ్, మంగళూరు రిఫైనరీ(ఎంఆర్‌పీఎల్‌)లు కూడా ఉన్నాయి. ఇవి ప్రధాన చమురు పీఎస్‌యూలకు అనుబంధ సంస్థలుగా కొనసాగుతున్నాయి. ఎంఆర్‌పీఎల్‌లో మెజారిటీ వాటా ఇప్పటికే ఓఎన్‌జీసీ చేతిలో ఉంది. ఎంఆర్‌పీఎల్‌ రిఫైరింగ్‌ సామర్థ్యం 15 మిలియన్‌ టన్నులు. ఈ డీల్‌ద్వారా విదేశీ చమురు–గ్యాస్‌ నిక్షేపాలు, ఆస్తుల కొనుగోలు విషయంలో ప్రపంచ దిగ్గజాలతో పోటీపడేందుకు దోహదం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుల ప్రభావాన్ని కూడా తట్టుకోవడానికి వీలవుతుందనేది వారి అభిప్రాయం. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద చమురు–గ్యాస్‌ ఉత్పత్తి సంస్థగా, అత్యధిక లాభాలను నమోచేస్తున్న కంపెనీగా ఓఎన్‌జీసీ నిలుస్తోంది.

12 ఏళ్ల క్రితమే బీజం...
వాస్తవానికి పీఎస్‌యూ ఆయిల్‌ కంపెనీల విలీనాలకు 12 ఏళ్ల క్రితం బీజం పడింది. అప్పటి యూపీఏ సర్కారు హయాంలో పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న మణిశంకర్‌ అయ్యర్‌ ఈ ప్రతిపాదనను 2004లో తెరపైకి తీసుకొచ్చారు. దీనిప్రకారం.. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌లను ఓఎన్‌జీసీతో విలీనం చేయడం... ఓఐఎల్‌ను ఐఓసీలో కలిపేసే ప్రణాళికలను రూపొందించారు. అదేవిధంగా ఆయిల్‌ పీఎస్‌యూల అనుబంధ సంస్థల్లో కోచి రిఫైనరీని బీపీసీఎల్‌తో, చెన్నై పెట్రోలియంను ఐఓసీతో విలీనం చేయాలని కూడా భావించారు.

అయితే, 2015 సెప్టెంబర్‌లో ఒక అత్యున్నత స్థాయి కమిటీ మాత్రం ఈ ప్రతిపాదనలకు మొగ్గుచూపలేదు. దీనికిబదులు చమురు పీఎస్‌యూల్లోని ప్రభుత్వ వాటాలను ఒక ప్రొఫెషనల్‌ ట్రస్ట్‌కు బదలాయింది... వాటికి మరింత స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలని సూచించింది. అయితే, మోదీ సర్కారు మాత్రం విలీనాలకే సై అంది. పీఎస్‌యూ ఆయిల్‌ కంపెనీలను విలీనం చేసి ప్రపంచ స్థాయి మెగా చమురు దిగ్గజాన్ని నెలకొల్పే ప్రతిపాదనను 2017–18 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement