ఈ ఏడాదే హెచ్‌పీసీఎల్‌లో డిజిన్వెస్ట్‌మెంట్
♦ ఓఎన్‌జీసీకి 51.1 శాతం వాటాల విక్రయం
♦ విలువ సుమారు రూ. 28,770 కోట్లు
ముంబై: అంతర్జాతీయ స్థాయి చమురు దిగ్గజానికి రూపకల్పన చేసే దిశగా కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. హెచ్‌పీసీఎల్‌లో డిజిన్వెస్ట్‌మెంట్‌ని ఈ ఏడాదే పూర్తి చేయాలని యోచిస్తోంది. మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్‌జీసీ)కి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో (హెచ్‌పీసీఎల్)లో 51.1 శాతం వాటాల విక్రయ విధివిధానాలపై మరికొద్ది నెలల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హెచ్‌పీసీఎల్ షేరు ధర ప్రకారం ఈ వాటాల విలువ సుమారు రూ. 28,770 కోట్ల మేర ఉండనుంది. రెండు కంపెనీలను విలీనం చేయడానికి బదులుగా హెచ్‌పీసీఎల్‌ని ఓఎన్‌జీసీలో భాగమైన యూనిట్‌గా మాత్రమే ఉంచాలని కేంద్ర చమురు శాఖ భావిస్తున్నట్లు సమాచారం.
రెండూ ప్రభుత్వ రంగ సంస్థలే కావడంతో యాజమాన్యంలో మార్పులేమీ ఉండనందున ఓపెన్ ఆఫర్ అవసరం రాకపోవచ్చని పరిశీలకులు తెలిపారు. దేశీయంగా టేకోవర్ నిబంధనల ప్రకారం ఏదైనా కంపెనీ మరో లిస్టెడ్ కంపెనీలో 25 శాతం పైగా వాటాలు కొన్న పక్షంలో సదరు టార్గెట్ సంస్థలో కనీసం మరో 26 శాతం వాటాలను పబ్లిక్ నుంచి కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. హెచ్‌పీసీఎల్ దేశీయంగా మూడో అతి పెద్ద రిఫైనర్.
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యానికీ తోడ్పాటు..
చమురు ధరల హెచ్చుతగ్గులను తట్టుకోవడంతో పాటు ఆయిల్ కంపెనీల విలీనాల ద్వారా ప్రపంచ స్థాయి చమురు దిగ్గజాన్ని దేశీయంగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నట్లు కేంద్రం ఫిబ్రవరిలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓఎన్‌జీసీకి హెచ్‌పీసీఎల్‌లో వాటాలను విక్రయించడం ద్వారా భారీ సంస్థ ఆవిర్భావంతో పాటు ప్రభుత్వం నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం కూడా నెరవేరగలదు. గత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 46,247 కోట్లు సమీకరించిన కేంద్రం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 72,500 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకుంది. ఈ దిశలో 11 ప్రభుత్వ రంగ సంస్థల్లో 25 శాతం దాకా వాటా విక్రయాలు జరగనున్నాయి.