ఓఎన్‌జీసీ లాభం 44% అప్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2013-14) (జనవరి-మార్చి)క్యూ4లో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ 44% అధికంగా రూ. 4,889 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 3,387 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ కాలంలో డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటం వల్ల రూ. 3,098 కోట్లమేర మారకపు లాభాలు నమోదైనట్లు కంపెనీ చైర్మన్ దినేష్ కె.సరఫ్ చెప్పారు. దీంతోపాటు బావుల తవ్వకాలకు సంబంధించి రూ. 1,906 కోట్లను మాత్రమే రైటాఫ్ చేసినట్లు తెలిపారు. గతంలో ఇవి రూ. 4,127 కోట్లుగా నమోదయ్యాయి. ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వాటిల్లే ఆదాయ న ష్టాల భర్తీకిగాను రూ. 16,202 కోట్ల సబ్సిడీలు చెల్లించినట్లు చెప్పారు. గతంలో ఇవి రూ. 12,312 కోట్లు మాత్రమే. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి కంపెనీలకు డీజిల్, వంటగ్యాస్ విక్రయాలపై ఆదాయ నష్టాలు సంభవించే సంగతి తెలిసిందే.
32.78 డాలర్లు మాత్రమే: క్యూ4లో సబ్సిడీ చెల్లింపుల తరువాత బ్యారల్ ముడిచ మురు విక్రయాలపై 32.78 డాలర్లు మాత్రమే లభించినట్లు కంపెనీ తెలిపింది. ఇది అత్యంత కనిష్టంకాగా, స్థూలంగా 106.65 డాలర్ల చొప్పున బిల్లింగ్ చేసినట్లు వివరించింది. దీనిలో 73.87 డాలర్ల వరకూ సబ్సిడీ ఇచ్చినట్లు వెల్లడించింది. 2012-13 క్యూ4లో 40.97 డాలర్లు ఆర్జించినట్లు తెలిపింది. కాగా, పూర్తి ఏడాదికి నికర లాభం 6% పుంజుకుని రూ. 22,095 కోట్లను తాకింది. ఈ కాలంలో రికార్డు స్థాయిలో రూ. 56,384 కోట్ల సబ్సిడీలను చెల్లించినట్లు సరఫ్ చెప్పారు. ఈ కాలంలో చమురు ఉత్పత్తి 22.56 మిలియన్ టన్నుల నుంచి నామమాత్రంగా తగ్గి 22.25 మిలియన్ టన్నులుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు 2.7% క్షీణించి రూ. 375 వద్ద ముగిసింది.