ఆన్‌లైన్ కిరాణా వ్యాపారంలోకి ఓలా..
బెంగళూరులో పరీక్షిస్తున్న కంపెనీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ సర్వీసుల రంగంలో ఉన్న ఓలా (గతంలో ఓలా క్యాబ్స్) ఆన్‌లైన్ కిరాణా వ్యాపారంలోకి అడుగిడుతోంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే చాలు సరుకులు, నిత్యావసర వస్తువులను కస్టమర్ల ఇంటికే పంపనుంది. ప్రస్తుతం బెంగళూరులో ఈ కొత్త సర్వీసులను ‘ఓలా స్టోర్’ యాప్ ద్వారా పరీక్షిస్తోంది. నూతన యాప్‌ను ప్రయత్నించాల్సిందిగా కొద్ది మంది కస్టమర్లకు కంపెనీ ఈమెయిల్స్ పంపింది. ఇంటికి కావాల్సిన కిరాణా సరుకులను కొనుక్కోవచ్చంటూ ఆహ్వానిస్తోంది. ఓలా స్టోర్ విషయాన్ని కంపెనీ ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు ధ్రువీకరించారు. అయితే ఎంపిక చేసిన కస్టమర్లకు తొలి ఆర్డరులో 50 శాతం డిస్కౌంట్ కూడా ఉందని సమాచారం. రూ.300 లోపు బిల్లు అయ్యే ఆర్డర్లకు డెలివరీ చార్జీ రూ.50 చెల్లించాలి. ఇక ఓలా స్టోర్ ద్వారా కిరాణా సరుకులతోపాటు పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, మందులు, ఎలక్ట్రికల్ ఉపకరణాల వంటివి ఆర్డరు ఇవ్వొచ్చు.
ఆహార పదార్థాలు కూడా..
ఇటీవలే ఓలా కేఫ్ సర్వీసులను సైతం కంపెనీ ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్ నుంచి యాప్ ద్వారా నచ్చిన ఫుడ్ ఆర్డరు ఇవ్వడమే తరువాయి. 20 నిమిషాల్లోనే డెలివరీ ఇస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అది కూడా నిర్దిష్ట సమయంలో ఎంపిక చేసిన ప్రాంతాలకే సర్వీసులు పరిమితం. హైదరాబాద్‌లో హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, కేపీహెచ్‌బీ, కొండాపూర్‌లు ఇందులో ఉన్నాయి. ప్రముఖ రెస్టారెంట్ల నుంచి ప్రత్యేక, విభిన్న ఆహార పదార్థాలను కొనుగోలు చేసి కస్టమర్లకు పంపిస్తున్నట్టు కంపెనీ చెబుతోంది.