
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చైనా మొబైల్స్ తయారీ కంపెనీ ఒపో హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. కంపెనీకి ఇది భారత్‌లో తొలి సెంటర్ కాగా, ప్రపంచవ్యాప్తంగా ఏడవది. చైనాలో 4, జపాన్, యూఎస్‌లో ఒక్కో ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఈ సంస్థ నిర్వహిస్తోంది. భారత కస్టమర్లను లక్ష్యం గా చేసుకుని ఉపకరణాల అభివృద్ధిలో హైదరాబాద్ సెంటర్ నిమగ్నం కానుంది.
శామ్‌సంగ్ మేక్ ఫర్ ఇండియా ఇన్నోవేషన్స్(ఆర్‌అండ్‌డీ) హెడ్‌గా పనిచేసిన తస్లీమ్ ఆరిఫ్... ఒపో ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఆర్‌అండ్‌డీ హెడ్‌గా నియమితులయ్యారు. మొబైల్ సాఫ్ట్‌వేర్, డిజైన్, డెవలప్‌మెంట్‌లో ఆయనకు 15 ఏళ్ల అనుభవం ఉంది. చైనా తర్వాత రెండో అతిపెద్ద ఆర్‌అండ్‌డీ కేంద్రంగా హైదరాబాద్ సెంటర్‌ను తీర్చిదిద్దనున్నట్టు ఒపో వెల్లడించింది. ఏప్రిల్–జూన్ కాలంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 10% వాటాతో కంపెనీ 4వ స్థానంలో ఉంది.