ఓరియంటల్ బ్యాంక్ లాభం 16% అప్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ (క్యూ2) కాలానికి రూ. 291 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 251 కోట్లతో పోలిస్తే ఇది 16% వృద్ధి. వడ్డీయేతర ఆదాయంతోపాటు, రికవరీలు పెరగడం ప్రధానంగా లాభాల్లో వృద్ధికి దోహదపడినట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ భూపిందర్ నయ్యర్ చెప్పారు. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.77% నుంచి 4.74%కు ఎగశాయి. ఇక నికర ఎన్‌పీఏలు సైతం 2.69% నుంచి 3.29%కు పెరగడంతో బీఎస్‌ఈలో షేరు 4.3% పతనమై రూ. 267 వద్ద ముగిసింది.
కాగా, రుణాల నాణ్యత సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ, సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలనూ చేపట్టినట్లు నయ్యర్ చెప్పారు. ఈ కాలంలో వడ్డీయేతర ఆదాయం 26% జంప్‌చేసి రూ. 393 కోట్లకు చేరింది. గతంలో రూ. 312 కోట్లుగా ఉంది. ఇక రికవరీలు సైతం రూ. 314 కోట్ల నుంచి రూ. 339 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం దాదాపు 7% పుంజుకుని రూ. 5,328 కోట్లను అధిగమించింది. గతంలో రూ. 4,988 కోట్ల ఆదాయం నమోదైంది.
తాజా బకాయిలు
ప్రస్తుత సమీక్షా కాలంలో ఎన్‌పీఏలలో భాగమైన తాజా బకాయిలు(స్లిప్పేజెస్) రూ. 978 కోట్లకు చేరాయి. గతంలో ఇవి రూ. 1,041 కోట్లుగా నమోదయ్యాయి. కేటాయింపులు, కంటింజెన్సీలు రూ. 550 కోట్ల నుంచి రూ. 641 కోట్లకు ఎగశాయి. కాగా, నిర్వహణ లాభం రూ. 825 కోట్ల నుంచి నామమాత్ర వృద్ధితో రూ. 855 కోట్లను తాకింది. ఇక 2.6% నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) సాధించగా, కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 10.88%గా నమోదైంది.