35 ఏళ్ల లోపే సొంతిల్లు
సాక్షి, హైదరాబాద్: ‘‘మంచి చదువు.. ఆపైన ఉద్యోగం.. తర్వాత పెళ్లి, పిల్లలు.. ఆ తర్వాతే సొంతిల్లు’’.. సాధారణంగా ప్రతి మధ్యతరగతిది ఇదే ఫార్ములా! కానీ, ఇది గతం. నేటి యువత దీన్ని ముందు సొంతిల్లు ఆ తర్వాతే ఏదైనా అంటోంది. దేశంలోని మిలీనియల్స్ (35 ఏళ్ల లోపు వయస్సు వాళ్లు) సొంతింటి ఎంపికలో కీలకంగా మారారని పుణెకు చెందిన నిర్మాణ సంస్థ పరాండే స్పేస్ చైర్మన్ అనిల్ పరాండే ‘సాక్షి రియల్టీ’కి ఈ–మెయిల్‌లో పంపిన కథనంలో తెలిపారు. అందుకే నిర్మాణ సంస్థలు కూడా యువతను.. మరీ ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని తెలిపారు.
⇒ మిలీనియల్స్ క్యాంపస్ ఉద్యోగాలు కొట్టేస్తున్నారు. ఉద్యోగరీత్యా పలు నగరాల్లో ఉండాల్సిన పరిస్థితి. ఏటేటా పెరుగుతున్న అద్దెలు.. దీంతో అద్దెకుండటం కంటే సొంతిల్లు కొనడమనే భావన పెరుగుతోంది. పైపెచ్చు కెరీర్‌లో వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేయటం, రకరకాల మనస్తత్వాల సహోద్యోగులతో కలిసి పనిచేయడం వంటివి కూడా వారి ఆలోచనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. పోటీ మార్కెట్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం కూడా సొంతింటి ఎంపికలో కీలకంగా మారుతోంది.
⇒ ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్, బ్యాంకర్ లేదా ప్రభుత్వ ఉద్యోగం వంటి సంప్రదాయ ఉద్యోగాలకే నేటి యువత పరిమితం కావట్లేదు. సొంత కంపెనీలు, స్టార్టప్స్ పెట్టేసి వారితో పాటూ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. అందుకే ముందు నుంచే ఆర్ధిక ప్రణాళికలకు పెద్ద పీట వేస్తున్నారు.
ఎంపికలో ప్రాధామ్యాలివే: ప్రాజెక్ట్ ఉండే చోట కనెక్టివిటీ బాగుండాలి. మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ ఉంటే ప్రాజెక్ట్‌తో పాటూ పర్యావరణం కూడా బాగుంటుంది.
⇒ ఇంట్లో ఇద్దరు ఉద్యోగస్తులు కావటంతో 2 కార్లుండటం సాధారణం. అందుకే పార్కింగ్‌లో రెండింటికీ చోటివ్వాలి.
⇒ చాలా మంది యువత ఇంటినే ఆఫీసుగా మార్చేస్తున్నారు. అంటే వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. అందుకే అపార్ట్‌మెంట్‌లో స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, వైఫై సదుపాయాలుండాలి. ఆధునిక వసతులే కాదు పర్యావరణహితమైన ప్రాజెక్ట్‌లను నిర్మించాలి.
⇒ ప్రాజెక్ట్‌లోనే పాఠశాల, ఆసుపత్రి, షాపింగ్ మాల్స్ లేదా వినోద కేంద్రాలుండే ప్రాజెక్ట్‌లకు మొదటి ప్రాధాన్యమిస్తున్నారు. వాక్ టు వర్క్ లేదా సైకిల్ టు వర్క్ ప్రాజెక్ట్‌లకు ఐటీ, తయారీ రంగాలకు చేరువలో ఉండే ప్రాజెక్ట్‌లను కూడా ఎంచుకుంటున్నారు.