వచ్చే ఏడాది మెరుగ్గా అమ్మకాలు
♦ 7.3 మిలియన్ టన్నులకు ఉత్పత్తి
♦ వైజాగ్ స్టీల్ సీఎండీ మధుసూదన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గణనీయంగా క్షీణించిన ఉక్కు ధరలు స్థిరపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో అమ్మకాలు కొంత మెరుగవుతాయని, 2017-18లో మరింత పుంజుకుంటాయని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్) సీఎండీ పి.మధుసూదన్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.1,450 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 1,600 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారాయన. వైజాగ్ స్టీల్ గత ఆర్థిక సంవత్సరం రూ.1,421 కోట్ల నష్టం నమోదు చేసింది.
కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును ప్రకటించేందుకు శనివారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విషయాలు చెప్పారు. ‘చైనా దిగుమతుల ప్రభావం గతేడాది ద్వితీయార్థంలో చాలా పడింది. అయితే, కనీస దిగుమతి ధర నిబంధనలతో దిగుమతులు సుమారు 30 % మేర తగ్గాయి. మేం అంతర్గత వ్య యాలు తగ్గించుకుని నిర్వహణ సామర్ధ్యాలు మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారిస్తున్నాం’ అని తెలిపారు.
ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ఉత్పత్తి సామర్ధ్యం 6.3 మిలియన్ టన్నుల మేర ఉండగా.. ప్లాంటు ఆధునికీకరణతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.3 మిలియన్ టన్నులకు చేరగలదన్నారు. ప్రభుత్వం చేపడుతున్న హౌసింగ్, స్మార్ట్ సిటీలు వంటి ప్రాజెక్టులతో ఉక్కుకు మరింత డిమాండ్‌పెరుగుతుందన్నారు. విజయవాడ, అమరావ తి మొదలైన చోట్ల నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సమీపంగా ఉన్నందున వ్యాపార అవకాశాల రీత్యా తమకు లాభించగలదని చెప్పారు. జాతీయ స్థాయిలో విస్తరించే దిశగా యూపీలో రాయ్‌బరేలీలో రెండో యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు మధుసూదన్ వివరించారు. 2018 సెప్టెంబర్ నాటికి ఇది అందుబాటులోకి రాగలదని చెప్పారు.
బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధు ..
ఈ కార్యక్రమంలో వైజాగ్ స్టీల్ తొలి బ్రాండ్ అంబాసిడర్‌గా సింధును ప్రకటించారు.