పరాగ్ మిల్క్ ఐపీఓ పొడిగింపు
♦ తగ్గిన ధర శ్రేణి
న్యూఢిల్లీ: డైరీ ఉత్పత్తుల కంపెనీ పరాగ్ మిల్క్ ఫుడ్స్ తన ఐపీఓను మరో మూడు రోజుల పాటు పొడిగించింది. అంతేకాకుండా ధర శ్రేణిని కూడా సవరించింది. రూ.760 కోట్ల ఐపీఓ ఓవర్ సబ్‌స్క్రైబ్ అయినప్పటికీ, శుక్రవారం ముగియాల్సిన ఈ ఐపీఓ గడువును వచ్చే బుధవారం వరకూ పొడిగించామని కంపెనీ తెలిపింది. ధర శ్రేణిని రూ.220-227 నుంచి రూ.215-227కు తగ్గిస్తున్నామని తెలిపింది.
ఓవర్ సబ్‌స్క్రైబ్ అయినా పొడిగింపు..
ఈ వారంలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉన్న నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఐపీఓను పొడిగించాలని కోరడంతో మరో మూడు రోజుల పొడిగించామని కంపెనీ వివరించింది. బుధవారం ప్రారంభమైన ఈ ఐపీఓ 1.32 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించిన విభాగం 55 శాతం, సంస్థాగతం కాని ఇన్వెస్టర్లకు కేటాయించిన విభాగం 2.66 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 1.72 రెట్ల చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. కొన్ని కేటగిరిల ఇన్వెస్టర్లకు కేటాయించిన విభాగం తక్కువగా సబ్‌స్క్రైబ్ కావడంతో ఐపీఓను కంపెనీ పొడిగించిందని సమాచారం.