ఏప్రిల్లో కార్ల అమ్మకాలు రయ్! | Passenger car sales inch up two percent in April: SIAM | Sakshi
Sakshi News home page

ఏప్రిల్లో కార్ల అమ్మకాలు రయ్!

Published Tue, May 10 2016 1:27 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

ఏప్రిల్లో కార్ల అమ్మకాలు రయ్! - Sakshi

ఏప్రిల్లో కార్ల అమ్మకాలు రయ్!

కొత్త మోడళ్లతో పెరిగిన విక్రయాలు
పెళ్లిళ్ల సీజన్‌తో పెరిగిన బైక్‌ల అమ్మకాలు
సియామ్ వెల్లడి

 న్యూఢిల్లీ: ప్రయాణికుల కార్ల అమ్మకాలు మూడు నెలల క్షీణత తర్వాత ఏప్రిల్‌లో పుంజుకున్నాయి. మారుతీ బాలెనో, రెనో క్విడ్ వంటి కొత్త మోడళ్ల కారణంగా ఏప్రిల్‌లో కార్ల విక్రయాలు 1.87 శాతం పెరిగాయని సియామ్ పేర్కొంది. అయితే గ్రామీణ మార్కెట్లో విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, ఇంకా పుంజుకోలేదని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(సియామ్) డెరైక్టర్ జనరల్ విష్ణు మాధుర్ చెప్పారు. ఏప్రిల్‌లో అన్ని సెగ్మెంట్లలో వాహన విక్రయాలు పుంజుకోవడం భారత వాహన పరిశ్రమకు సానుకూలమని  ప్రైస్ వాటర్‌హౌస్ భాగస్వామి అబ్దుల్ మాజీద్ పేర్కొన్నారు.

డీజిల్ వాహనాలకు సంబంధించిన అనిశ్చితి త్వరలోనే తొలుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పాత వాహనాల మార్పిడికి ప్రభుత్వం ప్రోత్సాహాకాలు ఇస్తే డిమాండ్ మరింతగా పుంజుకుంటుందని సూచించారు.  వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోయినా, డీజిల్ వాహనాలపై అనిశ్చితి కొనసాగినా వాహన పరిశ్రమ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఏప్రిల్ వాహన విక్రయాలపై సియామ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం...,

 గత ఏడాది ఏప్రిల్‌లో 1,59,588గా ఉన్న ప్రయాణికుల కార్ల అమ్మకాలు(దేశీయ) ఈ ఏడాది ఏప్రిల్‌లో 1,62,566కు పెరిగాయి.

 మొత్తం ప్రయాణికుల వాహనాల సెగ్మెంట్ 11 శాతం వృద్ధి చెందింది. హ్యుందాయ్ క్రెటా, మారుతీ విటారా బ్రెజా, మహీంద్రా కేయూవీ100 వంటి వాహనాలు మంచి అమ్మకాలు సాధించాయి. గత ఏడాది ఏప్రిల్‌లో 2,17,989గా ఉన్న ప్రయాణికుల వాహనాల విక్రయాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో 2,42,060కు పెరిగాయి.

 యుటిలిటి వాహన విక్రయాలు 43 శాతం వృద్ధి చెందాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ వాహన విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయి.

 పెళ్లిళ్ల సీజన్ కారణంగా మోటార్ సైకిళ్ల అమ్మకాలు పెరిగాయి. వర్షాలు విస్తారంగా కురుస్తాయన్న అంచనాల వల్ల సెంటిమెంట్ మెరుగుపడినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంది.

 2011-12లో వివిధ కేటగిరి వాహన విక్రయాలు గరిష్ట స్థాయికి చేరాయి. ప్రస్తుతానికైతే ఏ కేటగిరి వాహనాలు కూడా ఈ స్థాయి దరిదాపుల్లో లేవు.

 వాణిజ్య వాహనాల విక్రయాలు 17 శాతం వృద్ధితో 53,835కు పెరిగాయి.

 మౌలిక, గనుల రంగాల జోరు పెరగడంతో భారీ వాణిజ్య వాహనాల సెగ్మెంట్‌కు డిమాండ్ బాగా పెరుగుతోంది.

గత ఏడాది ఏప్రిల్లో 15,83,582గా ఉన్న అన్ని కేటగిరిల వాహన విక్రయాలు  ఈ ఏడాది ఏప్రిల్‌లో 17 శాతం వృద్ధితో 19,00,879కు పెరిగాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement