ముంబై: ఆన్‌లైన్ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) సన్నాహాలను మరో రెండేళ్లలో ప్రారంభించనున్నది. తమ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్‌కావడం తప్పనిసరి అని, అయితే ఇంతవరకూ దీనికి సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపొందించుకోలేదని పేటీఎమ్ సీఈఓ విజయ్ శేఖర్ శర్మవివరించారు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకముందే మరింతగా నగదు నిల్వలను ఆర్జించాల్సి ఉందని పేర్కొన్నారు. సింగపూర్‌లో జరిగిన హెచ్‌టీ-మింట్ ఏషియా లీడర్షిప్ సమిట్‌లో పేటీఎమ్ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఏడాది వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హతావే నుంచి 30 కోట్ల డాలర్ల నిధులను సమీకరించింది. పేటీఎమ్ విలువ 1,500 కోట్ల డాలర్లకు ఎగసిందని ఇటీవలనే విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు.
స్టార్టప్‌లకు స్వర్ణయుగం...
ఇప్పుడు భారత్‌లో ఎంటర్‌ప్రెన్యూర్షిప్‌కు స్వర్ణయుగమని విజయ్ శేఖర్ పేర్కొన్నారు. ఇలాంటి కాలంలో పుట్టినందుకు అదృష్టంగా భావిస్తున్నానని, చిన్న చిన్న వ్యవస్థాపకులు పెద్ద పెద్ద వ్యాపారాలను ఏర్పాటు చేయగలుగుతున్నారని వివరించారు. చిన్న చిన్న కంపెనీలు, తమ వాటాదారులకు భారీ విలువను చేకూర్చిపెట్టాయని పేర్కొన్నారు.
ఆర్నెళ్లలో 390 కోట్ల డాలర్లు....
భారత్‌లో స్టార్టప్‌ల జోరు పెరుగుతోంది. దేశీ, విదేశీ సంస్థలు ఈ స్టార్టప్‌ల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో భారత స్టార్టప్‌లు 390 కోట్ల డాలర్ల నిధులను సమీకరించాయని వెంచర్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. 2016, 2017 సంవత్సరాల్లో వచ్చిన నిధుల కంటే కూడా ఇది అధికం.
Comments
Please login to add a commentAdd a comment