Online payment
-
ఆరు నెలల్లో 7897 కోట్ల లావాదేవీలు
తక్షణ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీల సంఖ్య 2024 జనవరి–జూన్ మధ్య దేశవ్యాప్తంగా 78.97 బిలియన్ల(7897 కోట్లు)కు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే లావాదేవీలు 52 శాతం పెరిగాయని పేమెంట్ టెక్నాలజీ సర్వీసులు అందిస్తున్న వరల్డ్‌లైన్ నివేదిక వెల్లడించింది.‘గతేడాదితో పోలిస్తే జనవరి–జూన్ మధ్య లావాదేవీల విలువ రూ.83.16 లక్షల కోట్లు నుంచి రూ.116.63 లక్షల కోట్లకు చేరింది. 2023 జనవరిలో యూపీఐ లావాదేవీల సంఖ్య 803 కోట్లుగా ఉంది. 2024 జూన్‌కు ఇది 1300 కోట్లకు చేరింది. లావాదేవీల విలువ రూ.12.98 లక్షల కోట్ల నుంచి రూ.20.07 లక్షల కోట్లకు చేరింది. విలువ, పరిమాణం పరంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వరుసగా మూడు స్థానాలను ఆక్రమించాయి. సగటు లావాదేవీ విలువ 2023 జనవరి–జూన్ మధ్య రూ.1,603 నమోదైంది. 2024 జూన్‌తో ముగిసిన ఆరు నెలల్లో ఇది రూ.1,478కి చేరింది. ఆన్లైన్ పరిశ్రమలో ఈ–కామర్స్, గేమింగ్, యుటిలిటీస్, ప్రభుత్వ సేవలు, ఆర్థిక సేవలు మొత్తం లావాదేవీల పరిమాణంలో 81 శాతం, విలువలో 74 శాతం కైవసం చేసుకున్నాయి’ అని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: ఒకే నెలలో రూ.24,509 కోట్లు రాక! -
ఐదు నెలల్లో యూపీఐ లావాదేవీలు ఎంతంటే..
దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) డిజిటల్ చెల్లింపుల విలువ రూ.1,669 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థికశాఖ చెప్పింది. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుందని పేర్కొంది.మొత్తం డిజిటల్ చెల్లింపు లావాదేవీల సంఖ్య 2017-18 ఆర్థిక సంవత్సరంలో 2,071 కోట్ల నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 18,737 కోట్లకు పెరిగాయి. ఇది ఏటా 44 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఈ ఏడాది కేవలం ఐదు నెలల్లోనే యూపీఐ లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుంది. ఇదిలాఉండగా, కేవలం భారతదేశంలోనే కాకుండా దుబాయ్, ఖతార్, కువైట్, మారిషస్.. వంటి ఇతర దేశాల్లోనూ ఎన్పీసీఐ యూపీఐ సేవలను అమలు చేస్తోంది. దాంతో అంతర్జాతీయంగా యూపీఐ లావాదేవీలు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ఇదీ చదవండి: ఇంక్రిమెంట్లు, బోనస్‌ల పవర్ తెలుసా..?ఫిజికల్‌గా డబ్బు ఉంచుకోవడం కంటే డిజిటల్ లావాదేవీలు చేయడం మేలని యూపీఐ వినియోగదారులు నమ్ముతున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం సులభమవుతోంది. కానీ కొన్ని థర్డ్‌పార్టీ యూపీఐ యాప్‌లనే యూజర్లు ఎక్కువగా వినియోగిస్తుండడంపట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఏదైనా భద్రతా వైఫల్యాలు తలెత్తితే తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతోంది. ఈ థర్డ్‌పార్టీ యూపీఐ కంపెనీలు వినియోగదారులకు అధిక వడ్డీలోన్లను ఆశచూపి భారీగానే లాభపడుతున్నాయని కొందరు చెబుతున్నారు. -
మూడు నెలల్లో రూ.60 లక్షల కోట్లు లావాదేవీలు
ప్రస్తుతం ఏ చిన్న వస్తువు కొనాలన్నా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ స్కానర్లు దర్శనమిస్తున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం..వంటి థర్డ్‌పార్టీ యూపీఐ యాప్స్‌తో చెల్లింపులు సాగిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో యూపీఐ లావాదేవీలు 36% పెరిగి రూ.60 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈమేరకు సోమవారం పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘2024-25లో ఏప్రిల్, జూన్ మధ్య కాలంలో రూ.60 లక్షల కోట్ల విలువైన 4,122 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో 2,762 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వాటి విలువ రూ.44 లక్షల కోట్లుగా ఉంది. గతంలో కంటే ఈసారి ఇవి 36 శాతం పెరిగాయి. 2023-24లో మొత్తం 13,113 కోట్ల యూపీఐ లావాదేవీలు చేశారు. వాటి మొత్తం విలువ రూ.200 లక్షల కోట్లు’ అని మంత్రి చెప్పారు.ఇదీ చదవండి: భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థఆర్థిక సంవత్సరం వారీగా యూపీఐ లావాదేవీల వివరాలు..2024-25(ఏప్రిల్-జూన్ వరకు) 4,122 కోట్ల లావాదేవీలు రూ.60 లక్షల కోట్లు2023-24లో 13,113 కోట్లు లావాదేవీలు, రూ.200 లక్షల కోట్లు2022-23లో 8,371 కోట్ల లావాదేవీలు, రూ.139 లక్షల కోట్లు2021-22లో 4,596 కోట్ల లావాదేవీలు, రూ.84 లక్షల కోట్లు -
ఖతార్‌లో యూపీఐ సేవలు..!
దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను ఖతార్‌కు విస్తరిస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్(ఎన్ఐపీఎల్) తెలిపింది. ఈమేరకు ఖతార్ నేషనల్ బ్యాంక్(క్యూఎన్బీ)తో ఒప్పందం జరిగినట్లు పేర్కొంది. ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులు, ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయని ఎన్ఐపీఎల్ చెప్పింది.ఈ సందర్భంగా ఎన్పీసీఐ పార్ట్నర్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డిప్యూటీ చీఫ్ అనుభవ్ శర్మ మాట్లాడుతూ..‘ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఖతార్‌లోని భారత వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ ఖతార్ నేషనల్ బ్యాంక్(క్యూఎన్బీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఖతార్‌లోని భారతీయులు, ప్రయాణికులు, టూరిస్టులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు’ అని తెలిపారు.ఇదీ చదవండి: రూ.61 కోట్లు రికవరీ చేసిన ఈపీఎఫ్ఓ2024లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 98 లక్షలుగా ఉంటుందని అంచనా. అందులో యూఏఈ ద్వారానే 52.9 లక్షల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. ఇటీవల యూఏఈలో యూపీఐ సేవలు ప్రారంభిస్తున్నట్లు ఎన్పీసీఐ ప్రకటించింది. -
ఆల్-ఇన్-వన్ పేమెంట్ డివైజ్‌ను ఏర్పాటు చేసిన ఫిన్‌టెక్ సంస్థ
దేశీయ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే తన వినియోగదారులకు మరింత సౌకర్యాలు అందించేలా కొత్త పరికరాన్ని తయారుచేసింది. ఇందులో భాగంగా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్), క్యూఆర్ కోడ్, స్పీకర్.. అన్నీ ఒకే పరికరంలో అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసింది. ఈ ఆల్-ఇన్-ఒన్ చెల్లింపు పరికరం ‘భారత్‌పే వన్’ను తాజాగా ఆవిష్కరించారు.మొదటి దశలో దాదాపు 100 నగరాల్లో దీన్ని పరిచయం చేసి, రానున్న ఆరు నెలల్లో 450 నగరాలకు విస్తరించాలన్నది కంపెనీ యోచిస్తోంది. హైడెఫినిషన్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే, 4జీ, వైఫై కనెక్టివిటీ, తాజా ఆండ్రాయిడ్ ఓఎస్‌తో భారత్‌పే వన్ పనిచేస్తుందని సంస్థ వర్గాలు తెలిపాయి. పోర్టబుల్ డిజైన్, లావాదేవీల డాష్‌బోర్డ్‌లతో భారత్‌పే ఆఫ్‌లైన్ వ్యాపారులకు మరింత సేవలిందించేలా దీన్ని రూపొందించినట్లు తెలిపింది. డైనమిక్, స్టాటిక్ క్యూఆర్ కోడ్, ట్యాప్ అండ్ పే, డెబిడ్, క్రెడిట్ కార్డు చెల్లింపులు.. ఇలా విభిన్న మార్గాల్లో లావాదేవీలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు.ఇదీ చదవండి: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీఫిన్టెక్ దిగ్గజ సంస్థ పేటీఎం ఇటీవల తమ వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు, క్రెడిట్‌కార్డుల కోసం కొత్త సౌండ్‌బాక్స్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పరికరాలు మేడ్ఇన్ఇండియా దృక్పథంతో తయారైనట్లు కంపెనీ తెలిపింది. ఈ సౌండ్‌బాక్స్‌లు 4జీ నెట్వర్క్ కనెక్టివిటీతో పాటు మెరుగైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
నేపాల్‌లోని భారతీయుల కోసం ప్రముఖ సేవలు ప్రారంభం
నేపాల్‌లో భారత్‌కు చెందిన యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలు అందుబాటులోకి వచ్చినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తాజాగా ప్రకటించింది. నేపాల్ వ్యాపారుల వద్ద ఇకపై క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి యూపీఐ వినియోగదారులు చెల్లింపులు చేయొచ్చని తెలిపింది. గతేడాది సెప్టెంబరులో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్ఐపీఎల్), నేపాల్ అతిపెద్ద చెల్లింపు నెట్వర్క్ ఫోన్‌పే పేమెంట్ సర్వీస్‌ల మధ్య భాగస్వామ్యం కుదరగా, తాజాగా ఈ సేవలు ప్రారంభమయ్యాయి. మొదటి దశలో యూపీఐ ఆధారిత యాప్‌ల ద్వారా భారత వినియోగదారులు నేపాల్‌లోని వ్యాపార కేంద్రాల వద్ద యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. ఫోన్‌పే నెట్‌వర్క్‌పైన ఉన్న వ్యాపారులకు భారత వినియోగదారులు యూపీఐ ద్వారా చెల్లించొచ్చు. ఇదీ చదవండి: ఐటీ పరిశ్రమకు భారీ షాక్.. ‘70 శాతం ఉద్యోగాలు పోనున్నాయ్’ ఇరు దేశాల పౌరుల మధ్య లావాదేవీల్లో ఈ సేవలు విప్లవాత్మక మార్పులు తెస్తాయని ఎన్ఐపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రితేశ్ శుక్లా పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో రెండు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని, డిజిటల్ చెల్లింపుల్లో మార్పునకు కట్టుబడి ఉన్నామని అన్నారు. భారత్, నేపాల్ మధ్య ఆర్థిక సంబంధాలు, వాణిజ్య, పర్యాటకం గణనీయంగా మెరుగుపడటానికి యూపీఐ సేవలు ఉపకరిస్తాయని ఫోన్‌పే చీఫ్ ఎగ్జిక్యూటివ్ దివాస్ కుమార్ వెల్లడించారు. -
జూన్ 4 నుంచి 'గూగుల్ పే' బంద్!
ఆన్లైన్ పేమెంట్ యాప్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన 'గూగుల్ పే' (Google Pay) చాలా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే 2024 జూన్ 4 నుంచి అమెరికాలో గూగుల్ పే సేవలు నిలిపివేసేందుకు గూగుల్ సిద్ధమవుతోంది. అమెరికాలో ఎక్కువమంది గూగుల్ పే కంటే 'గూగుల్ వాలెట్' ఉపయోగిస్తున్న కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్ వాలెట్ ద్వారా పేమెంట్ కార్డులను యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తరువాత షాపింగ్ లేదా ఇతరత్రా ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు ట్యాప్ అండ్ పే పద్దతిలో పని సులభంగా పూర్తయిపోతుంది. కేవలం ఆన్లైన్ పేమెంట్ కోసం మాత్రమే కాకుండా.. ట్రాన్సిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ఐడీ కార్డ్స్ వంటి డాక్యుమెంట్ కూడా ఇందులో భద్రపరుచుకోవచ్చు. ఈ కారణంగానే అమెరికాలో గూగుల్ పే కంటే గూగుల్ వాలెట్ ఎక్కువ ఆదరణ పొందింది. గూగుల్ పేలో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా గూగుల్ వాలెట్లో లభిస్తాయి. 2024 జూన్ 4 వరకు వినియోగదారులు గూగుల్ పే ఉపయోగించుకోవచ్చు, గడువు తీరిన తరువాత అమెరికన్ యూజర్లు అమౌంట్ సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికిగానీ అవకాశం లేదు. కాబట్టి యూఎస్ఏలోని గూగుల్ పే యూజర్స్ దీనిని తప్పకుండా గమనించాలి. ఇదీ చదవండి: జెరోధా సీఈఓపై మండిపడుతున్న నెటిజెన్స్!.. కారణం ఇదే.. ఇండియా, సింగపూర్ వంటి దేశాల్లో గూగుల్ పే యధావిధిగా సేవలను అందిస్తుంది. అంతే కాకుండా ఆయా దేశాల్లోని యూజర్లకు కావలసిన మరిన్ని సేవలను అందించడానికి సంస్థ ఈ యాప్‌ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. కాబట్టి ఇండియాలోని గూగుల్ పే యూజర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
Paytm: భారీగా తగ్గుతున్న పేటీఎం షేర్
పేటీఎం షేర్ రోజురోజుకు దారుణంగా పడిపోతుంది. వరుసగా కేవలం నాలుగు రోజుల్లో దాదాపు 45 శాతం నష్టాలపాలయింది. తాజాగా సోమవారం 10 శాతం కంపెనీ షేర్లు నష్టపోయాయి. ఈరోజు 48.70 పాయింట్లు నష్టపోయి ప్రస్తుతం షేర్ ధర రూ.438.50 వద్దకు చేరింది. ఐదు రోజులకింద ఈ ధర రూ.760.65గా ఉండేది. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదు. వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్అప్లు కూడా అప్పటి నుంచి చేయకూడదు’ అని ఆర్బీఐ తెలిపింది. పీపీబీఎల్ కార్యకలాపాలపై బయటి ఆడిటర్లు పూర్తి స్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని ఆడిట్లో తేలినందునే ఆర్బీఐ చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై విజయ్‌శేఖర్‌శర్మ స్పందిస్తూ పేటీఎం సేవలు ఈ నెల (ఫిబ్రవరి) 29 తర్వాత కూడా యథావిధిగానే కొనసాగుతాయని తెలిపారు. నిబంధనలను పూర్తిగా పాటిస్తూ దేశానికి సేవలందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో శర్మ పోస్ట్ చేశారు. మరోవైపు, పేటీఎం సౌండ్‌బాక్స్ వంటి సర్వీసులు అందించే ఆఫ్‌లైన్ వ్యాపారులపై ఆర్బీఐ ఆదేశాల ప్రభావం ఉండబోదని పేటీఎం తెలిపింది. 2021లో రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.2,150 ఇష్యూ ధరతో పేటీఎం పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. రూ.18,300 కోట్లను సమీకరించింది. ఇందులో రూ.8,300 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా, రూ.10,000 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) పద్ధతిలో సేకరించింది. నవంబరు 18న ఎన్ఎస్ఈలో రూ.రూ.1,950 వద్ద, బీఎస్ఈలో రూ.1,955 వద్ద నమోదైంది. అదే రోజున రూ.1,560 కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు షేరు సుమారు 77 శాతం నష్టపోయినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ఎయిరిండియా మాజీ సీఎండీ, ఐబీఎం, ఎస్ఏపీ కంపెనీలపై సీబీఐ కొరడా.. కారణం.. విజయ్ శేఖర్ శర్మ 2009లో ప్రారంభించిన పేటీఎంకు మొదటినుంచి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. విజయ్ అలీబాబా గ్రూప్‌నకు చెందిన జాక్‌మా, సాఫ్ట్‌బ్యాంక్ నుంచి నిధులు సేకరించారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు ప్రకటించినప్పటి నుంచి పేటీఎంకు కొంత లాభాలు వచ్చాయి. ఎక్కువ మంది డిజిటల్ చెల్లింపులకు మారి, పేటీఎంను అధికంగా వినియోగించారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో విజయ్‌కు 51 శాతం ఉండగా, మిగతాది ఒన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అధీనంలో ఉంది. -
చిల్లర లేకపొతేనేం.. క్యూఆర్ ఉందిగా!
ఆధునిక సాంకేతికత అంతటా యమ వేగంగా అల్లుకుపోతూ ఉంది. ప్రస్తుతం ఆన్లైన్ చెల్లింపుల యుగం నడుస్తోంది. అందులో భాగంగా ఫోన్ పే, గుగూల్ పే, పేటీఎం తదితర పద్దతుల్లో ప్రజలు సొమ్ము చెల్లింపు, ఇతర లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు క్యూఆర్ కోడ్‌ను కూడా అనుసరిస్తున్నారు. ఈ పద్ధతిని ఓ ఆలయ నిర్వాహకులు కూడా అందిపుచ్చుకున్నారు. భక్తులు నగదు అందుబాటులో లేదని సరిపుచ్చుకొని వెళ్లిపోకుండా క్యూ ఆర్ స్కానింగ్ పద్ధతి కూడా అందుబాటులో ఉందని తెలుపుతూ హుండీపై స్టిక్కర్‌ను ఏర్పాటు చేశారు. హుండీలో కానుకగా వేసేందుకు నగదు అందుబాటులో లేని భక్తుల కోసం ఈ క్యూర్ కోడ్‌ను ‘కానుక’గా ఏర్పాటుచేశారు. –కడప కల్చరల్ -
గూగుల్‌పేలో రీఛార్జిపై ఫీజు.. ఎంతంటే..?
గూగుల్ ఆధ్వర్యంలోని పేమెంట్ యాప్ గూగుల్‌పే మొబైల్ రీఛార్జీలపై అదనంగా ఫీజు వసూలు చేయనుంది. ఏ విధానంలో పేమెంట్ చేసినా కన్వీనియన్స్ ఛార్జీల రూపంలో ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఫోన్‌పే, పేటీఎం సంస్థలు ఇదే మాదిరి ప్రత్యేక ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఉచితంగా సేవలందించిన గూగుల్‌పే ప్రస్తుతం ఛార్జీలు వసూలు చేయనుందనే వార్తలు వస్తున్నాయి. అయితే రూ.100లోపు రీఛార్జిపై గూగుల్‌పే ఎలాంటి ఫీజూ వసూలు చేయబోదని కొన్ని మీడియాలో వస్తున్న కథనాల ద్వారా తెలుస్తోంది. రూ.100 నుంచి రూ.200 వరకు రీఛార్జిపై ఒక రూపాయి, రూ.200 నుంచి రూ.300 వరకు రూ.2, రూ.300 కంటే ఎక్కువ రీఛార్జి చేస్తే రూ.3 చొప్పున కన్వీనియన్స్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు సమాచారం. కొత్తగా కన్వీనియన్స్ ఫీజు వసూలు చేయనున్నట్లు గూగుల్ నిబంధనలు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
గూగుల్ పే 88 వేల క్యాష్ బ్యాక్...
-
అందుబాటులోకి కొత్త సేవలు.. ఈ క్రెడిట్ కార్డ్‌తో బోలెడు లాభాలు!
ఆన్లైన్ చెల్లింపులను మరింత ప్రోత్సాహించేందుకు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సేవలను పొందడం కోసం మీ రూపే క్రెడిట్ కార్డ్ (Rupay credit card)లను భీం యాప్ (BHIM UPI) యాప్‌కి లింక్ చేయాల్సి ఉంటుంది. తద్వారా.. ప్రజలు ఇకపై షాపుల్లో, మాల్స్‌లో షాపింగ్‌తో పాటు మరే ఇతర బిల్లుల చెల్లింపులకు మీ క్రెడిట్ కార్డులను స్వైపింగ్ మిషన్ల వద్ద స్వైప్ చేయాల్సిన అవసరం ఉండుదు. ఎలాగో తెలుసుకుందాం! క్రెడిట్ కార్డ్ లేకపోయినా ..ఈజీగా చెల్లింపులు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రతి రంగంలోనే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకింగ్లోనూ భారీగానే జరిగాయి. గతంలో ఏ లావాదేవీలకైన కస్టమర్ నేరుగా బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. అయితే క్రమంగా కాలం డిజిటల్ యుగం వైపు అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఏటీఎం, క్రెడిట్ కార్డ్, ఆన్లైన్ లావాదేవీలంటూ అంతా కూర్చున్న చోటే చెల్లింపులు జరిగిపోతున్నాయి. కరోనా నుంచి ఆన్లైన్ లావాదేవీలు మరింత పెరిగాయని నివేదికలు కూడా చెప్తున్నాయి. తాజాగా ఎన్పీసీఐ మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మీరు చేయల్సిందల్లా.. భీం యూపీఐలో మీ రూపే క్రెడిట్ కార్డ్‌ని లింక్ చేయడమే. తద్వారా ఏ చెల్లింపులకైన క్రెడిట్ కార్డు మీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. క్రెడిట్ కార్డు లేకుండానే కేవలం భీం యాప్‌కి లింక్ చేసిన మీ యూపీఐ అకౌంట్‌తో ఈజీగా చెల్లింపులు జరుపుకోవచ్చు. ఇటీవల గణనీయంగా పెరుగుతున్న క్రెడిట్ కార్డుల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని వల్ల క్రెడిట్ కార్డ్ పోగొట్టుకునే సమస్య ఇకపై ఉండదు. చెల్లింపులు కూడా చాలా సులభతరం కానున్నాయి. ఈ బ్యాంకులకు మాత్రమే.. కేవలం కొన్ని బ్యాంకులకు మాత్రమే భీమ్ యాప్ ద్వారా రూపే క్రెడిట్ కార్డు ఉపయోగానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ ఖాతాదారులకు మాత్రమే తొలుత భీం యాప్‌తో రూపె క్రెడిట్ కార్డు సేవలను ఉపయోగించగలరు. ఈ మేరకు గత సెప్టెంబర్ 20న ఎన్పీసీఐ సర్క్యులర్ జారీ చేసింది. చదవండి: ఎలాన్ మస్క్‌కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్! -
కార్డులతో చెల్లింపులు.. గూగుల్ కీలక ప్రకటన
Online Payments Google will NOT save your card details from 2022: స్మార్ట్ ఫోన్, ఇతర డివైజ్‌ల ద్వారా పేమెంట్లు చేసేవాళ్లకు గూగుల్ ముఖ్య గమనిక చేసింది. అదీ గూగుల్ బేస్డ్ మంత్లీ పేమెంట్లు చేసేవాళ్లకు. జనవరి 1,2022 నుంచి కస్టమర్ కార్డు వివరాలు సేవ్ చేయబోమని వెల్లడించింది. ఆన్లైన్ పేమెంట్, క్రెడిట్ కార్డ్, ఏటీఎం చెల్లింపుల విషయంలో ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. సాధారణంగా ఒక్కసారి పేమెంట్ చేశాక.. మంత్లీ పేమెంట్లు చేసే టైంలో కార్డు నెంబర్, ఎక్స్పైరీ డేట్ అనేవి ఆటోమేటిక్‌గా కనిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ వివరాలతో యూజర్ అవసరానికి తగ్గట్లు ఆటోమేటిక్‌గా పేమెంట్ కూడా జరిగిపోతుంటుంది. అయితే ఇకపై గూగుల్ సంబంధిత యాప్స్ విషయంలో ఇలాంటి ఫార్మట్ కనిపించదని పేర్కొంది గూగుల్. ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన కార్డు స్టోరేజ్ రెగ్యులేషన్స్‌ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ వెల్లడించింది. పేమెంట్ అగ్రిగ్రేటర్స్(PA), పేమెంట్ గేట్వేస్(PG) కొరకు ఆర్బీఐ ఈ కొత్త మార్గదర్శకం జారీ చేసింది. ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం.. కార్డ్ జారీచేసినవాళ్లు, సంబంధిత నెట్వర్స్క్ తప్ప కార్డు వివరాల్ని(Card-on-File) ఇతర ప్లాట్‌ఫామ్స్ ఏవీ సేకరించడానికి వీల్లేదు. గూగుల్ ప్లే అకౌంట్, గూగుల్ వర్క్ అకౌంట్, చివరికి గూగుల్‌క్లౌడ్‌లో రికార్డయిన వివరాలు సైతం పని చేయవు. కాబట్టి, వచ్చే ఏడాదిలోనూ అదే కార్డును ఉపయోగించుకోవాలనుకునేవాళ్లు ఎప్పటికప్పుడు కార్డు వివరాల్ని రీఎంటర్ చేయాల్సి ఉంటుందని గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. లేనిపక్షంలో పేమెంట్లు క్యాన్సిల్, డిక్లయిన్ అవుతాయని స్పష్టం చేసింది. అయితే మన దేశంలో ఎక్కువ మంది కార్డు పేమెంట్ల ద్వారా ఎక్కువగా ఉపయోగించేది వీసా, మాస్టర్‌కార్డులే. వీటి విషయంలో మాత్రం ఊరట ఇచ్చే విషయం చెప్పింది గూగుల్. వీసా, మాస్టర్ కార్డు సంబంధిత డెబిట్, క్రెడిట్ కార్డు పేమెంట్స్ చేయాలనుకుంటే.. డిసెంబర్ 31,2021లోపు కార్డు వివరాల్ని రీ-ఎంటర్ చేయాలని, తప్పనిసరిగా ఏదైనా కొనుగోలు లేదా పేమెంట్ చేస్తే ఆ వివరాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. లేనిపక్షంలో కార్డు వివరాలు ఆటోమేటిక్‌గా కనిపించవని, కాబట్టి.. వచ్చే ఏడాది నుంచి పేమెంట్లు చేసే టైంలో మళ్లీ ఆ వివరాల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక రూపే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డిస్కవర్, డైనర్స్ కార్డ్ వినియోగదారులు మాత్రం స్టోర్ కావని, పేమెంట్ చేసిన ప్రతీసారి వివరాలు సమర్పించాల్సిందేనని పేర్కొంది. చదవండి: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ..! -
ఆన్లైన్ పేమెంట్‌కు ఒప్పుకోని ఆస్పత్రి యాజమాన్యం
రాజాం సిటీ: శ్రీకాకుళం జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రి తీరు ఓ కరోనా రోగి పాలిట శాపంగా మారింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. రాజాం మండలంలోని పెంటఅగ్రహారం గ్రామానికి చెందిన ఓ మహిళ కరోనాతో బాధపడుతోంది. వైద్యం కోసం ఆమెను కుటుంబ సభ్యులు బుధవారం రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. రోగికి ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో ముందుగా డబ్బు చెల్లించాలని ఆస్పత్రి వారు చెప్పారు. అయితే డబ్బు రూపంలో మాత్రమే ఫీజు చెల్లించాలని, ఆన్లైన్ పేమెంట్లు అంగీకరించబోమని ఆస్పత్రి యాజమాన్యం తెగేసి చెప్పింది. దీంతో బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేయడం కోసం మూడు గంటల పాటు పట్టణమంతా తిరిగారు. అయినా ఫలితం లేకపోయింది. వారు తిరిగి వచ్చేసరికి మహిళ పరిస్థితి విషమించి ఆస్పత్రి ఎదుట రోడ్డుపైనే మృతి చెందింది. ఆస్పత్రి యాజమాన్యం వ్యాపారాత్మక ధోరణే తమ తల్లి మృతికి కారణమని బాధిత మహిళ కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదన్నారు. ముందు వైద్యం చేయాలి గానీ, డబ్బుల రూపంలో ఫీజు కడితేనే జాయిన్ చేసుకుంటామని అనడం ఎంత వరకు సమంజసమని వాపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది అక్కడకు చేరుకున్నా కానీ ఎలాంటి సహకారం అందించలేదని స్థానికులు తెలిపారు. రాజాం ప్రెస్‌క్లబ్ సభ్యులు, రెడ్‌క్రాస్ సభ్యులు ఏర్పాటు చేసిన వాహనంలో మృతదేహాన్ని తరలించారు. -
రెండేళ్లలో పేటీఎం ఐపీఓ!
ముంబై: ఆన్లైన్ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) సన్నాహాలను మరో రెండేళ్లలో ప్రారంభించనున్నది. తమ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్‌కావడం తప్పనిసరి అని, అయితే ఇంతవరకూ దీనికి సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపొందించుకోలేదని పేటీఎమ్ సీఈఓ విజయ్ శేఖర్ శర్మవివరించారు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకముందే మరింతగా నగదు నిల్వలను ఆర్జించాల్సి ఉందని పేర్కొన్నారు. సింగపూర్‌లో జరిగిన హెచ్‌టీ-మింట్ ఏషియా లీడర్షిప్ సమిట్‌లో పేటీఎమ్ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఏడాది వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హతావే నుంచి 30 కోట్ల డాలర్ల నిధులను సమీకరించింది. పేటీఎమ్ విలువ 1,500 కోట్ల డాలర్లకు ఎగసిందని ఇటీవలనే విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. స్టార్టప్‌లకు స్వర్ణయుగం... ఇప్పుడు భారత్‌లో ఎంటర్ప్రెన్యూర్షిప్కు స్వర్ణయుగమని విజయ్ శేఖర్ పేర్కొన్నారు. ఇలాంటి కాలంలో పుట్టినందుకు అదృష్టంగా భావిస్తున్నానని, చిన్న చిన్న వ్యవస్థాపకులు పెద్ద పెద్ద వ్యాపారాలను ఏర్పాటు చేయగలుగుతున్నారని వివరించారు. చిన్న చిన్న కంపెనీలు, తమ వాటాదారులకు భారీ విలువను చేకూర్చిపెట్టాయని పేర్కొన్నారు. ఆర్నెళ్లలో 390 కోట్ల డాలర్లు.... భారత్‌లో స్టార్టప్‌ల జోరు పెరుగుతోంది. దేశీ, విదేశీ సంస్థలు ఈ స్టార్టప్‌ల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో భారత స్టార్టప్‌లు 390 కోట్ల డాలర్ల నిధులను సమీకరించాయని వెంచర్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. 2016, 2017 సంవత్సరాల్లో వచ్చిన నిధుల కంటే కూడా ఇది అధికం. -
పింఛన్ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకే..!
► బ్యాంకుల్లోనే పింఛన్ల చెల్లింపు ►ఖాతా వివరాలు సేకరిస్తున్న ఎంపీడీవోలు ►జనవరి నుంచి అమలు చేసేందుకు కసరత్తు ► ఉమ్మడి జిల్లాలో 3.64లక్షల లబ్ధిదారులు ఆదిలాబాద్ రిమ్స్ : ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా లబ్ధిదారులకు వివిధ రకాల పింఛన్ డబ్బులను నగదు రూపంలో చేతికి అందిస్తుండగా అక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. వీటికి చెక్ పెట్టి పింఛన్ డబ్బులు బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఆసరాతోపాటు బీడీ కార్మికులకు ఇచ్చే జీవన భృతి, ఎరుుడ్‌స బాధితులకు పంపిణీ చేసే పింఛన్ డబ్బులు కూడా బ్యాంక్‌ఖాతాలో జమ చేయనుంది. ఈ ప్రక్రియ అమలులో భాగంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఎంపీడీవోలు పింఛన్‌దారుల ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించిన ప్రభుత్వం బ్యాంకుల ద్వారానే పింఛన్ డబ్బులు చెల్లించనుంది. నాలుగు జిల్లాల్లో 3.64లక్షల లబ్ధిదారులకు.. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల,కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అన్ని కేటగిరీలకు సంబంధించి పింఛన్ లబ్ధిదారులున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 64,841, నిర్మల్‌లో 1,36,345, మంచిర్యాలలో 86,360, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 46,611 మంది ఉన్నారు. వీరందరికీ ప్రతీ నెల రూ.50కోట్లపైనే నగదు రూపంలో పింఛన్ డబ్బులు చెల్లిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసుల ద్వారా వేలిముద్రలు తీసుకుని ప్రతినెలా పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారుల చేతికి అందిస్తున్నారు. అరుుతే వచ్చే ఏడాది జనవరి నుంచి వీరికి బ్యాంకుల ద్వారానే చెల్లింపులు చేయనున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఖాతాలు ఉన్న పెన్షనర్ల సంఖ్య.. బ్యాంకులు లేని గ్రామాల సంఖ్య.. తదితర వివరాలను ఇప్పటికే ఎంపీడీవోలు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సేకరిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించి ఈ అంశాలకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ చెల్లింపులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పింఛన్ చెల్లింపుల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే బ్యాంకుల ద్వారానే సాధ్యమవుతుందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టిందని అధికారులు చెబుతున్నారు. అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు లబ్ధిదారులకు సరైన న్యాయం జరుగుతుంది. పింఛన్‌దారులకు ఎంతమందికి ఖాతాలున్నారుు.. ఎంతమందికి లేవు.. అనే దానిపై సమగ్ర సమాచారం సేకరించి ఖాతాలు కలిగిన వారి వివరాలను ఎంపీడీవో లాగిన్‌లో నమోదు చేస్తారు. లబ్ధిదారుల నుంచి అకౌంట్ నంబర్, ఐఎఫ్‌టీ కోడ్ తీసుకుంటారు. పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో లాగిన్‌లో ఈ డాటా మొత్తాన్ని నమోదు చేస్తారు. బ్యాంకు ఖాతాలు లేని వారు ఖాతాలు తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులు ఆదేశించారు. -
పాడి రైతులకు ఆన్లైన్ చెల్లింపులు
• 15 రోజులకోసారి వారి బ్యాంకు ఖాతాల్లోకే సొమ్ము • పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విజయ డెరుురీ నిర్ణయం • భవిష్యత్తులోనూ ఆన్లైన్ చెల్లింపులే... సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విజయ డెరుురీకి పాలు పోసే రైతులకు ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించాలని విజయ డెరుురీ నిర్ణరుుంచింది. వచ్చే పదిహేను రోజులకు సంబంధించిన చెల్లింపులను రైతు ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు రైతులకు 15 రోజులకోసారి నగదు రూపంలో నేరుగా చెల్లించే పద్ధతి ఉంది. పెద్ద నోట్ల రద్దు... చిల్లర సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులోనూ ఆన్లైన్లో రైతు ఖాతాలకు చెల్లింపు పద్దతిని కొనసాగిస్తామని... దీనివల్ల ఎవరికీ ఇబ్బందులు ఉండబోవని పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా ‘సాక్షి’కి చెప్పారు. 63 వేల మంది రైతులకు ప్రయోజనం.. తెలంగాణలో విజయ డెరుురీకి రోజూ 63 వేల మంది రైతులు పాలు పోస్తుంటారు. దాదాపు 5 లక్షల లీటర్ల పాలు వారి నుంచి సేకరిస్తున్నారు. ఇందుకోసం విజయ డెరుురీ ఏడాదికి రూ. 350 కోట్ల మేరకు రైతులకు చెల్లింపులు చేస్తుంది. దీంతోపాటు విజయ డెరుురీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. ఆ ప్రకారం ఏడాదికి రూ. 72 కోట్లు ఇస్తున్నారు. ప్రోత్సాహక సొమ్మును ఇప్పటికే రైతు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. దీంతోపాటు పాలకు ఇచ్చే సేకరణ సొమ్మును కూడా ఆన్లైన్లో రైతుల ఖాతాల్లో వేయాలని నిర్ణరుుంచారు. ఇదిలావుంటే పాడి రైతులకు ఇచ్చే ప్రోత్సాహక సొమ్ము రూ. 50 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పినా.. అవి ఇంకా రైతులకు చేరలేదని తెలిసింది. ఎన్సీడీసీ సభ్యునిగా సురేశ్ చందా... జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) సభ్యుడిగా సురేశ్ చందా నియమితులయ్యారు. జాతీయ స్థారుులో సభ్యుడిగా నియమితులవడం వల్ల పశు సంవర్థక, పాడి శాఖలకు పెద్ద ఎత్తున ఎన్సీడీసీ నుంచి రుణాలు పొందడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అనేక రాష్ట్రాలకు దక్కని అవకాశం తెలంగాణకు దక్కడంపై సురేశ్ చందాకు పలువురు అభినందనలు తెలిపారు. -
సిట్రస్ పే... ‘పేయూ’ చేతికి
♦ రూ.870 కోట్లను చెల్లించనున్న పేయూ ♦ ఫిన్‌టెక్ రంగంలో అతిపెద్ద కొనుగోలు న్యూఢిల్లీ: ఆన్లైన్ పేమెంట్ సేవల్లో గ్లోబల్ ప్లేయర్‌గా ఉన్న పేయూ, అదే రంగంలోని దేశీయ కంపెనీ సిట్రస్ పేను కొనుగోలు చేసింది. పూర్తిగా నగదు రూపంలో 130 మిలియన్ డాలర్లు (సుమారు రూ.870కోట్లు)చెల్లించడం ద్వారా కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రెండు సంస్థలు బుధవారం ఇక్కడ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కొనుగోలు ఒప్పందం మూడో త్రైమాసికం లోపు పూర్తి కానుంది. ఈ డీల్‌తో సిట్రస్ పేలో పెట్టుబడిదారులుగా ఉన్న బీనోస్, సీక్వోయ తమ వాటాలను విక్రయించడం ద్వారా కంపెనీ నుంచి వైదొలగనున్నారు. దేశీయ ఆర్థిక సేవల రంగంలో ఇదే అతి పెద్ద విలీన, కొనుగోలు (ఎంఅండ్ఏ) ఒప్పందం. కాగా, పేయూ, సిట్రస్ కలయికతో పేమెంట్ సేవలు అందించే పేటీఎం, ఫ్రీచార్జ్ సంస్థలకు పోటీ ఎదురుకానుంది. ఈ డీల్‌తో తమ కస్టమర్లు 30 మిలియన్లకు మించి వృద్ధి చెందుతారని, 4.2 బిలియన్ డాలర్ల విలువైన 150 మిలియన్ల లావాదేవీల నిర్వహణకు వీలు కలుగుతుందని పేయూ ప్రకటించింది. అలాగే, తమ కస్టమర్లకు వినూత్నమైన ఆర్థిక సేవలను తక్ష ణమే అందుబాటులోకి తేవడం సాధ్యమవుతుందని పేర్కొంది. కాగా ఇప్పటి వరకు సిట్రస్‌పే ఎండీగా ఉన్న అమ్రిష్రా ఇకపై పేయూ ఇండియా సీఈవో బాధ్యతలు చేపడతారు. సిట్రస్ పే వ్యవస్థాపకుడు జితేంద్ర గుప్తా పేయూ రుణ విభాగం ‘లేజీ పే’ వ్యవహారాలు చూస్తారు. సిట్రస్ పేను 2011లో జితేంద్ర గుప్తా ఏర్పాటు చేశారు. పేయూ దక్షిణాఫ్రికాకు చెందిన నాస్పర్స్ గ్రూప్‌నకు చెందినది. ఇకపై సిట్రస్ పే నాస్పర్స్ అనుబంధ కంపెనీగా మారుతుంది. -
రేపటి నుంచి బీబీఎంపీలో ‘ఆన్లైన్ పేమెంట్’ సేవలు
బీబీఎంపీ ట్విట్టర్,పేస్బుక్ అకౌంట్లు ఇవే.. facebookaccountuser name : worshipful mayor-bbmp twitter account user name : mayor bangalore బీబీఎంపీ మేయర్ ఎన్ శాంతకుమారి బనశంకరి : బీబీఎంపీలో ఆన్లైన్ ద్వారా చెల్లింపుల విధానాన్ని (ఆన్లైన్ పేమెంట్) బుధవారం నుంచి అమలు చేస్తున్నట్లు మేయర్ ఎన్ శాంతకుమారి తెలిపారు. సోమవారమిక్కడి బీబీఎంపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 24 నుంచి బీబీఎంపీలో ఆన్లైన్ వ్యవస్థను అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన నిర్వహణా బాధ్యతలను నిర్వర్తించేందుకు గాను నిపుణుల సమితి ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమితి రెండు నెలల పాటు కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం బీబీఎంపీ అనేక పథకాలు అమల్లోకి తెస్తోందని, అందులో భాగంగానే పాలికేలోని అన్ని శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయడానికి మేయర్ పేరుతో ట్విట్టర్, పేస్బుక్ అకౌంట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు ఎలాంటి అభిప్రాయాలు, సూచనలు,సలహాలనైనా సరే ఈ ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా పంపించవచ్చునని ఆమె తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బీబీఎంపీ సిద్ధంగా ఉందన్నారు. జనవరి మొదటివారంలో జలమండలి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. బీబీఎంపీ వ్యాప్తిలో తాగునీటి సమస్య ఉన్న వార్డుల్లో అధికారులు పూర్తి వివరాలతో సమావేశంలో చర్చించి సమస్యను పరిష్కారిస్తామన్నారు. నూతనంగా రోడ్లు వేసిన వార్డుల్లో రెండేళ్ల పాటు ఓఎప్సీ కేబుల్ ఏర్పాటు చేయబోమని, అలాగే రోడ్లు విస్తరణకు అనుమతి ఇచ్చేదిలేదని అన్నారు. కేబుల్ అమర్చినట్లైతే ఎచ్డీడీ తరహాలో అమర్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు. విలేకరుల సమావేశంలో బీబీఎంపీ కమిషనర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీమేయర్ కే.రంగణ్ణ, అధికారపక్షనేత ఎన్ఆర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మేయర్ శాంతకుమారి ట్విట్టర్,పేస్బుక్ అకౌంట్లను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. వీటితో పాటు బీబీఎంపీ సహాయ్ అనే హెల్ప్‌లైన్ వెబ్‌సైట్‌నూ ప్రారంభించారు. కంట్రాక్టర్లు, అధికార పక్షనేత మధ్య మాటల యుద్ధం బీబీఎంపీలో 24 నుంచి ఆన్లైన్ చెల్లింపు విధానంపై కాంట్రాక్టర్లు , అధికార పక్షనేత ఎన్ ఆర్ రమేశ్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వివరాలు.. ఆన్లైన్ చెల్లింపు వ్యవస్థను అమలు చేస్తున్నారనే విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్లు ఒక్కసారిగా విలేకరుల సమావేశంలోకి వెళ్లారు. కాంట్రాక్టర్లకు ప్రత్యేకంగా ఓ సంఘం ఉందని, పదాధికారులు ఉన్నారని, తమతో చర్చించకుండా, తమకు కావలసిన వారికి బిల్లులు చెల్లించిన తరువాత ఇప్పుడు ఆన్లైన్ చెల్లింపు విధానాన్ని ఎలా ప్రవేశపెడతారా అంటూ కమిషనర్, మేయర్‌పై గొడవకు దిగారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న అధికార పక్షనేత ఎన్ఆర్ రమేశ్ ‘ మీరు ఎందుకు లోపలికి వచ్చారు. ముందు బయటకు వెళ్లండి’ అంటూ కాంట్రాక్టర్లుతో అన్నారు. తక్షణమే కాంట్రాక్టర్లు ఎన్ఆర్ రమేశ్‌ను ఏకవచనంతో కమిషనర్ ఎదురుగా నిందించడంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. చేయి చేసుకునే స్థాయికి చేరుకుంది. కమిషనర్ ఇరువర్గాల వారిని శాంతపరిచి.. తమ కార్యాలయానికి పిలుచుకెళ్లారు. అక్కడ కూడా కంట్రాక్టర్లు ఒక్కసారిగా ఆన్లైన్ వ్యవస్థను అమలులోకి తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారికి సర్దిచెప్పారు. -
రైతన్నకు శుభవార్త..
ఆన్లైన్ ద్వారా కొనుగోలు డబ్బుల చెల్లింపు - అక్టోబర్ నుంచి అమలు - పెరిగిన ధాన్యం మద్దతు ధర రాయికల్ : జిల్లా రైతులకు శుభవార్త. అన్నదాతలు తాము పండించిన పంట ఐకేపీ, సహకార సంఘాల్లో అమ్మిన తర్వాత డబ్బులకోసం 15 నుంచి నెల వరకు వేచిచూసేవారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు నేరుగా డబ్బులు ఆన్లైన్ ద్వారా తమ ఖాతాలో జమయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ఆన్లైన్ ద్వారా చెల్లింపుకు అక్టోబర్‌లో శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబర్ నుంచి జిల్లాలో 301 ఐకేపీ కొనుగోలు సెంటర్లు, 320 సహకార సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సెంటర్లలో అమ్మిన రైతులకు కేవలం 48 గంటల్లోనే తమ అకౌంట్లోకి డబ్బులు జమయ్యేలా చర్యలు చేపడుతున్నారు. గతంలో ఐకేపీ, సహకార కొనుగోలు సెంటర్లో అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు రాకపోవడం, బ్యాంకుల్లో గంటల తరబడి నిలబడటం, బ్యాంకులో సిబ్బంది సరిగా లేకపోతే ఆ డబ్బుల కోసం రోజుల తరబడి వేచిచూడడం వంటి సంఘటనలు జరిగాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు మొదటిసారిగా ఆన్లైన్ పేమెంట్‌ను ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా రైతులు తమ బ్యాంక్ అకౌంట్, ఆధార్‌కార్డులను సంబంధిత మండల ఐకేపీ కార్యాలయంలో సమర్పించాలని, తద్వారా కంప్యూటరీకరణ చేసి ఆన్లైన్ అకౌంటింగ్ ద్వారా త్వరితగతిన రైతులకు తమ అకౌంట్లలో డబ్బులు పడే అవకాశం ఉంది. పెరిగిన వరి మద్దతు ధర అక్టోబర్ నుంచి ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు, సహకార కొనుగోలు కేంద్రాల ఆధ్వర్యంలో వరికొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. గతంలో ఏ గ్రేడ్ వరికి రూ.1345 ఉండగా.. ప్రస్తుతం రూ.1400లకు కామన్ గ్రేడ్ రూ.1310 ఉండగా.. రూ.1360కి పెంచిందని ఐకేపీ అధికారులు తెలిపారు. -
ఆన్లైన్ చెల్లింపులు..!
ఆదిలాబాద్ : ఏటా రైతులు ధాన్యం విక్రయించడం.. ఆ డబ్బుల కోసం వేచి చూడ్డం పరిపాటిగా మారింది. ఇక నుంచి ఆ జాప్యానికి చెక్ పడనుంది. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులోభాగంగానే ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియకు తెరతీయనుంది. ఈ విధానాన్ని అక్టోబర్‌లో ఖరీఫ్ కొనుగోళ్ల నుంచే ప్రారంభించాలని యోచిస్తోంది. ఆన్లైన్ చెల్లింపుల కోసం మహిళా సంఘాలకు ల్యాప్‌టాప్‌లను ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఇలా.. ఐకేపీ ఆధ్వర్యంలో మహిళ సంఘాలు (వీవోలు) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొంటారు. ఆ ధాన్యాలను లారీల ద్వారా రైస్ మిల్లులకు తరలిస్తారు. వీవోలు బిల్లులను డీఆర్డీఏ పీడీ ద్వారా పౌర సరఫరాల శాఖ డీఎంకు పంపిస్తారు. దానికి సంబంధించి నగదును డీఎం డీఆర్డీఏ పీడీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. పీడీ నుంచి వీవోల అకౌంట్లకు బదిలీ చేస్తారు. వీవోలు రైతులకు చెల్లిస్తారు. ఈ ప్రక్రియ ఏడు నుంచి పది రోజుల వరకు పడుతుంది. మహిళా సంఘాల్లో అకౌంట్‌కు సంబంధించి ఐదుగురు సభ్యుల్లో ముగ్గురికి నిర్వహణ బాధ్యతలు ఉండడంతో కొన్నిసార్లు ఎవరో ఒకరు లేరని, లేనిపక్షంలో బ్యాంకులో చెక్ బుక్కులు లేవని, ఇలా అనేక కారణాలతో చెల్లింపుల్లో మరింత జాప్యం జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇకపై పౌరసరఫరాల శాఖ డీఎం నుంచి నేరుగా రైతుల ఖాతాలోకే నగదును బదిలీ చేయనున్నారు. తద్వారా చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం కొనుగోలు ప్రక్రియను సరళీకృతం చేస్తున్నారు. ఒకవేళ ప్రక్రియ సరళీకృతమైతే రైతులకు 3 నుంచి 5 రోజుల్లోనే చెల్లింపులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మహిళా సంఘాలకు ల్యాప్‌టాబ్‌లను అందజేస్తున్నారు. ఈమేరకు వారికి శిక్షణ కూడా కల్పించనున్నారు. ఓ ఫార్మాట్‌ను రూపొందించి దాని ప్రకారంగా కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు పౌరసరఫరాల శాఖకు పంపించేలా సర్వీస్ ప్రొవైడర్‌ను రూపొందిస్తున్నారు. రైతుల పేరు, అతని పేరిట ఉన్న ఎకరాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ బ్రాంచ్ కోడ్, ఐఎఫ్ఎస్ కోడ్‌ను అందులో నమోదు చేస్తారు. తద్వారా ఏ రైతు నుంచి ఎంత కొనుగోలు చేశాం, ఆయనకు ఎంత చెల్లించాలన్న వివరాలు వీవోలు నమోదు చేసి వెంటనే పంపించే వీలుంటుంది. దానికి అనుగుణంగా డీఎం నుంచి సంబంధిత ఖాతాల్లో నగదు జమ చేస్తారు. దీనిపై డీఆర్డీఏకు చెందిన ఓ అధికారి చెప్తూ.. ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్ల కోసం నోటిఫికేషన్ వచ్చిందని.. అర్హులైన కంప్యూటర్ ఏజెన్సీల నుంచి ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించినట్లు చెప్పారు. అలాగే మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.