బీబీఎంపీలో ఆన్‌లైన్ ద్వారా చెల్లింపుల విధానాన్ని (ఆన్‌లైన్ పేమెంట్) బుధవారం నుంచి అమలు చేస్తున్నట్లు మేయర్ ఎన్ శాంతకుమారి తెలిపారు.
బీబీఎంపీ ట్విట్టర్,పేస్‌బుక్ అకౌంట్లు ఇవే..
facebookaccountuser name : worshipful mayor-bbmp
twitter account user name : mayor bangalore
బీబీఎంపీ మేయర్ ఎన్ శాంతకుమారి
బనశంకరి : బీబీఎంపీలో ఆన్‌లైన్ ద్వారా చెల్లింపుల విధానాన్ని (ఆన్‌లైన్ పేమెంట్) బుధవారం నుంచి అమలు చేస్తున్నట్లు మేయర్ ఎన్ శాంతకుమారి తెలిపారు. సోమవారమిక్కడి బీబీఎంపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 24 నుంచి బీబీఎంపీలో ఆన్‌లైన్ వ్యవస్థను అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన నిర్వహణా బాధ్యతలను నిర్వర్తించేందుకు గాను నిపుణుల సమితి ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమితి రెండు నెలల పాటు కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం బీబీఎంపీ అనేక పథకాలు అమల్లోకి తెస్తోందని, అందులో భాగంగానే పాలికేలోని అన్ని శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయడానికి మేయర్ పేరుతో ట్విట్టర్, పేస్‌బుక్ అకౌంట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు ఎలాంటి అభిప్రాయాలు, సూచనలు,సలహాలనైనా సరే ఈ ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా పంపించవచ్చునని ఆమె తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బీబీఎంపీ సిద్ధంగా ఉందన్నారు. జనవరి మొదటివారంలో జలమండలి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
బీబీఎంపీ వ్యాప్తిలో తాగునీటి సమస్య ఉన్న వార్డుల్లో అధికారులు పూర్తి వివరాలతో సమావేశంలో చర్చించి సమస్యను పరిష్కారిస్తామన్నారు. నూతనంగా రోడ్లు వేసిన వార్డుల్లో రెండేళ్ల పాటు ఓఎప్‌సీ కేబుల్ ఏర్పాటు చేయబోమని, అలాగే రోడ్లు విస్తరణకు అనుమతి ఇచ్చేదిలేదని అన్నారు. కేబుల్ అమర్చినట్లైతే ఎచ్‌డీడీ తరహాలో అమర్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు. విలేకరుల సమావేశంలో బీబీఎంపీ కమిషనర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీమేయర్ కే.రంగణ్ణ, అధికారపక్షనేత ఎన్‌ఆర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మేయర్ శాంతకుమారి ట్విట్టర్,పేస్‌బుక్ అకౌంట్లను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. వీటితో పాటు బీబీఎంపీ సహాయ్ అనే హెల్ప్‌లైన్ వెబ్‌సైట్‌నూ ప్రారంభించారు.
కంట్రాక్టర్లు, అధికార పక్షనేత మధ్య మాటల యుద్ధం
బీబీఎంపీలో 24 నుంచి ఆన్‌లైన్ చెల్లింపు విధానంపై కాంట్రాక్టర్లు , అధికార పక్షనేత ఎన్ ఆర్ రమేశ్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వివరాలు.. ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థను అమలు చేస్తున్నారనే విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్లు ఒక్కసారిగా విలేకరుల సమావేశంలోకి వెళ్లారు. కాంట్రాక్టర్లకు ప్రత్యేకంగా ఓ సంఘం ఉందని, పదాధికారులు ఉన్నారని, తమతో చర్చించకుండా, తమకు కావలసిన వారికి బిల్లులు చెల్లించిన తరువాత ఇప్పుడు ఆన్‌లైన్ చెల్లింపు విధానాన్ని ఎలా ప్రవేశపెడతారా అంటూ కమిషనర్, మేయర్‌పై గొడవకు దిగారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న అధికార పక్షనేత ఎన్‌ఆర్ రమేశ్ ‘ మీరు ఎందుకు లోపలికి వచ్చారు. ముందు బయటకు వెళ్లండి’ అంటూ కాంట్రాక్టర్లుతో అన్నారు. తక్షణమే కాంట్రాక్టర్లు ఎన్‌ఆర్ రమేశ్‌ను ఏకవచనంతో కమిషనర్ ఎదురుగా నిందించడంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. చేయి చేసుకునే స్థాయికి చేరుకుంది. కమిషనర్ ఇరువర్గాల వారిని శాంతపరిచి.. తమ కార్యాలయానికి పిలుచుకెళ్లారు. అక్కడ కూడా కంట్రాక్టర్లు ఒక్కసారిగా ఆన్‌లైన్ వ్యవస్థను అమలులోకి తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారికి సర్దిచెప్పారు.