ఆన్‌లైన్ చెల్లింపులు..! | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ చెల్లింపులు..!

Published Sun, Sep 14 2014 1:23 AM

ఆన్‌లైన్ చెల్లింపులు..! - Sakshi

ఆదిలాబాద్ : ఏటా రైతులు ధాన్యం విక్రయించడం.. ఆ డబ్బుల కోసం వేచి చూడ్డం పరిపాటిగా మారింది. ఇక నుంచి ఆ జాప్యానికి చెక్ పడనుంది. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులోభాగంగానే ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియకు తెరతీయనుంది. ఈ విధానాన్ని అక్టోబర్‌లో ఖరీఫ్ కొనుగోళ్ల నుంచే ప్రారంభించాలని యోచిస్తోంది. ఆన్‌లైన్ చెల్లింపుల కోసం మహిళా సంఘాలకు ల్యాప్‌టాప్‌లను ఇవ్వాలని నిర్ణయించారు.
 
ప్రస్తుతం ఇలా..

ఐకేపీ ఆధ్వర్యంలో మహిళ సంఘాలు (వీవోలు) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొంటారు. ఆ ధాన్యాలను లారీల ద్వారా రైస్ మిల్లులకు తరలిస్తారు. వీవోలు బిల్లులను డీఆర్‌డీఏ పీడీ ద్వారా పౌర సరఫరాల శాఖ డీఎంకు పంపిస్తారు. దానికి సంబంధించి నగదును డీఎం డీఆర్‌డీఏ పీడీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. పీడీ నుంచి వీవోల అకౌంట్లకు బదిలీ చేస్తారు. వీవోలు రైతులకు చెల్లిస్తారు. ఈ ప్రక్రియ ఏడు నుంచి పది రోజుల వరకు పడుతుంది. మహిళా సంఘాల్లో అకౌంట్‌కు సంబంధించి ఐదుగురు సభ్యుల్లో ముగ్గురికి నిర్వహణ బాధ్యతలు ఉండడంతో కొన్నిసార్లు ఎవరో ఒకరు లేరని, లేనిపక్షంలో బ్యాంకులో చెక్ బుక్కులు లేవని, ఇలా అనేక కారణాలతో చెల్లింపుల్లో మరింత జాప్యం జరిగిన సందర్భాలు ఉన్నాయి.
 
ఇకపై పౌరసరఫరాల శాఖ డీఎం నుంచి నేరుగా రైతుల ఖాతాలోకే నగదును బదిలీ చేయనున్నారు. తద్వారా చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం కొనుగోలు ప్రక్రియను సరళీకృతం చేస్తున్నారు. ఒకవేళ ప్రక్రియ సరళీకృతమైతే రైతులకు 3 నుంచి 5 రోజుల్లోనే చెల్లింపులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మహిళా సంఘాలకు ల్యాప్‌టాబ్‌లను అందజేస్తున్నారు. ఈమేరకు వారికి శిక్షణ కూడా కల్పించనున్నారు.
 
ఓ ఫార్మాట్‌ను రూపొందించి దాని ప్రకారంగా కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు పౌరసరఫరాల శాఖకు పంపించేలా సర్వీస్ ప్రొవైడర్‌ను రూపొందిస్తున్నారు. రైతుల పేరు, అతని పేరిట ఉన్న ఎకరాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ బ్రాంచ్ కోడ్, ఐఎఫ్‌ఎస్ కోడ్‌ను అందులో నమోదు చేస్తారు. తద్వారా ఏ రైతు నుంచి ఎంత కొనుగోలు చేశాం, ఆయనకు ఎంత చెల్లించాలన్న వివరాలు వీవోలు నమోదు చేసి వెంటనే పంపించే వీలుంటుంది.
 
దానికి అనుగుణంగా డీఎం నుంచి సంబంధిత ఖాతాల్లో నగదు జమ చేస్తారు. దీనిపై డీఆర్డీఏకు చెందిన ఓ అధికారి చెప్తూ.. ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్ల కోసం నోటిఫికేషన్ వచ్చిందని.. అర్హులైన కంప్యూటర్ ఏజెన్సీల నుంచి ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించినట్లు చెప్పారు. అలాగే మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement