రోడ్డు పక్కనే పడి ఉన్న మహిళ మృతదేహం
రాజాం సిటీ: శ్రీకాకుళం జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రి తీరు ఓ కరోనా రోగి పాలిట శాపంగా మారింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. రాజాం మండలంలోని పెంటఅగ్రహారం గ్రామానికి చెందిన ఓ మహిళ కరోనాతో బాధపడుతోంది. వైద్యం కోసం ఆమెను కుటుంబ సభ్యులు బుధవారం రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. రోగికి ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో ముందుగా డబ్బు చెల్లించాలని ఆస్పత్రి వారు చెప్పారు. అయితే డబ్బు రూపంలో మాత్రమే ఫీజు చెల్లించాలని, ఆన్‌లైన్ పేమెంట్‌లు అంగీకరించబోమని ఆస్పత్రి యాజమాన్యం తెగేసి చెప్పింది. దీంతో బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేయడం కోసం మూడు గంటల పాటు పట్టణమంతా తిరిగారు. అయినా ఫలితం లేకపోయింది. వారు తిరిగి వచ్చేసరికి మహిళ పరిస్థితి విషమించి ఆస్పత్రి ఎదుట రోడ్డుపైనే మృతి చెందింది.
ఆస్పత్రి యాజమాన్యం వ్యాపారాత్మక ధోరణే తమ తల్లి మృతికి కారణమని బాధిత మహిళ కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదన్నారు. ముందు వైద్యం చేయాలి గానీ, డబ్బుల రూపంలో ఫీజు కడితేనే జాయిన్ చేసుకుంటామని అనడం ఎంత వరకు సమంజసమని వాపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది అక్కడకు చేరుకున్నా కానీ ఎలాంటి సహకారం అందించలేదని స్థానికులు తెలిపారు. రాజాం ప్రెస్‌క్లబ్ సభ్యులు, రెడ్‌క్రాస్ సభ్యులు ఏర్పాటు చేసిన వాహనంలో మృతదేహాన్ని తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment