సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జిల్లాకు మూడు చోట్ల చొప్పున 39 చోట్ల శనివారం కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ (మాక్ డ్రిల్) నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్‌కు సన్నద్ధతలో లోటుపాట్లు పరిశీలించి సరిదిద్దుకోవడానికి డ్రై రన్ ఉపయోగ పడుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమ నిర్వహణకు కార్యాచరణ ఏ విధంగా ఉండాలో అంచనా వేసేందుకు తోడ్పడుతుందని తెలిపారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌కు సంబంధించి రూపొందించిన వెబ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ కోవిన్ సక్రమంగా పనిచేస్తుందో లేదో పరిశీలించనున్నట్లు తెలిపారు. డ్రై రన్‌లో వెలుగుచూసే అంశాలు, ఇతర వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖకు నివేదిక రూపంలో అందజేస్తామని భాస్కర్ వివరించారు.
ఈ డ్రై రన్ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరించి, కార్యాచరణ నివేదికను జిల్లా, రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌కు అందజేస్తారు. రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఈ ప్రక్రియనంతా సమీక్షించి తదుపరి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సమాచారాన్ని అందిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రై రన్‌లో భాగంగా డిసెంబర్ 28న విజయవాడలోని ఐదు కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇది ప్రోత్సాహకర ఫలితాలు ఇచ్చినట్లు భాస్కర్ తెలిపారు. వ్యాక్సిన్ రవాణా మొదలు, ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఫోన్ మెసేజ్‌లు పంపడం, వారు వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేస్తున్నట్టుగానే మొత్తం ప్రక్రియ (డమ్మీ ప్రక్రియ) నిర్వహిస్తారు. అనంతరం వారిని అబ్జర్వేషన్‌లో కూడా ఉంచుతారు. శనివారం ఒక్కో జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ లేదా ప్రభుత్వ ఆస్పత్రిలో, ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో, ఒక ఎంపిక చేసిన బయటి ప్రదేశంలో.. ఇలా మూడు చోట్ల డ్రైరన్ నిర్వహించనున్నారు.
డ్రై రన్ నిర్వహించే ప్రదేశాలు
Comments
Please login to add a commentAdd a comment