పేటీఎం షేర్ రోజురోజుకు దారుణంగా పడిపోతుంది. వరుసగా కేవలం నాలుగు రోజుల్లో దాదాపు 45 శాతం నష్టాలపాలయింది. తాజాగా సోమవారం 10 శాతం కంపెనీ షేర్లు నష్టపోయాయి. ఈరోజు 48.70 పాయింట్లు నష్టపోయి ప్రస్తుతం షేర్ ధర రూ.438.50 వద్దకు చేరింది. ఐదు రోజులకింద ఈ ధర రూ.760.65గా ఉండేది.
వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదు. వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు కూడా అప్పటి నుంచి చేయకూడదు’ అని ఆర్‌బీఐ తెలిపింది. పీపీబీఎల్ కార్యకలాపాలపై బయటి ఆడిటర్లు పూర్తి స్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని ఆడిట్‌లో తేలినందునే ఆర్‌బీఐ చర్యలు చేపట్టినట్లు తెలిసింది.
ఈ వ్యవహారంపై విజయ్‌శేఖర్‌శర్మ స్పందిస్తూ పేటీఎం సేవలు ఈ నెల (ఫిబ్రవరి) 29 తర్వాత కూడా యథావిధిగానే కొనసాగుతాయని తెలిపారు. నిబంధనలను పూర్తిగా పాటిస్తూ దేశానికి సేవలందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో శర్మ పోస్ట్ చేశారు. మరోవైపు, పేటీఎం సౌండ్‌బాక్స్ వంటి సర్వీసులు అందించే ఆఫ్‌లైన్ వ్యాపారులపై ఆర్‌బీఐ ఆదేశాల ప్రభావం ఉండబోదని పేటీఎం తెలిపింది.
2021లో రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.2,150 ఇష్యూ ధరతో పేటీఎం పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. రూ.18,300 కోట్లను సమీకరించింది. ఇందులో రూ.8,300 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా, రూ.10,000 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) పద్ధతిలో సేకరించింది. నవంబరు 18న ఎన్‌ఎస్‌ఈలో రూ.రూ.1,950 వద్ద, బీఎస్‌ఈలో రూ.1,955 వద్ద నమోదైంది. అదే రోజున రూ.1,560 కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు షేరు సుమారు 77 శాతం నష్టపోయినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: ఎయిరిండియా మాజీ సీఎండీ, ఐబీఎం, ఎస్‌ఏపీ కంపెనీలపై సీబీఐ కొరడా.. కారణం..
విజయ్ శేఖర్ శర్మ 2009లో ప్రారంభించిన పేటీఎంకు మొదటినుంచి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. విజయ్ అలీబాబా గ్రూప్‌నకు చెందిన జాక్‌మా, సాఫ్ట్‌బ్యాంక్ నుంచి నిధులు సేకరించారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు ప్రకటించినప్పటి నుంచి పేటీఎంకు కొంత లాభాలు వచ్చాయి. ఎక్కువ మంది డిజిటల్ చెల్లింపులకు మారి, పేటీఎంను అధికంగా వినియోగించారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో విజయ్‌కు 51 శాతం ఉండగా, మిగతాది ఒన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అధీనంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment