పేటీఎం (ఫైల్ ఫోటో)
ముంబై : వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన డిజిటల్ వ్యాలెట్ పేటీఎం గురించి తెలియని వారంటూ ఉండరు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ ఆన్‌లైన్ లావాదేవీలకు పేటీఎంనే వాడుతున్నారు. అంతలా మార్కెట్‌లోకి దూసుకొచ్చింది పేటీఎం. కానీ పేటీఎం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆ సంస్థనే భారీ నష్టాల పాలు చేస్తున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో పేటీఎం నష్టాలు దాదాపు 80 శాతం మేర పెరిగి రూ.1600 కోట్లగా నమోదైనట్టు తెలిసింది. కంపెనీ తన పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం మాల్, కొత్త మ్యూచువల్ ఫండ్ బిజినెస్ పేటీఎం మనీని విస్తరించే ప్రణాళికలను అమలు చేస్తుండటం, పేటీఎంకు తీవ్ర దెబ్బ తగులుతోంది. వీటి విస్తరణతో నష్టాలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. నష్టాలు విపరీతంగా పెరిగిపోవడంతో, కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ శేఖర్ శర్మ, వార్షిక వేతనం 2017-18 ఆర్థిక సంవత్సరం రూ.3 కోట్లకు తగ్గింది. 2016-17లో ఆయన వేతనం రూ.3.47 కోట్లగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ విజయ్ శేఖర్ శర్మ వార్షిక వేతనం రూ.3 కోట్లగానే ఉండనున్నట్టు తెలిసింది. ఉద్యోగులకు సంబంధించిన ఖర్చులు కూడా 2018 ఆర్థిక సంవత్సరంలో రూ.625 కోట్లకు పెరిగినట్టు కంపెనీ తన వార్షిక రిపోర్టులో పేర్కొంది. ఇటీవలే మార్కెట్ మాంత్రికుడు వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్‌వే పేటీఎంలో రూ.356 మిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టింది. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి కంపెనీ రూ.7600 కోట్ల రిజర్వును, మిగులును కలిగి ఉంది. ఈ ఏడాది ఫిన్‌టెక్ ప్రొడక్ట్‌లపై ఎక్కువగా దృష్టిసారించనున్నట్టు శర్మ చెప్పారు. తమ కస్టమర్ బేస్‌ను విస్తరించుకోనున్నట్టు పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ కోసం త్వరలోనే పేటీఎం మనీని లాంచ్ చేయనున్నామని, ఇతర సర్వీసులను విస్తరించనున్నామని, అలా కస్టమర్ బేస్‌ను పెంచుకుంటామని శర్మ చెబుతున్నారు. కానీ ఈ విస్తరణలో భాగంగానే పేటీఎంకు నష్టాలు పెరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment