చౌకబారు ప్రచారం, పేటీఎం ఫౌండర్‌పై మండిపాటు | Paytm owner Vijay Shekhar contributes Rs 500 to armed forces | Sakshi
Sakshi News home page

చౌకబారు ప్రచారం, పేటీఎం ఫౌండర్‌పై మండిపాటు

Published Sat, Dec 2 2017 11:29 AM | Last Updated on Sat, Dec 2 2017 12:21 PM

Paytm owner Vijay Shekhar contributes Rs 500 to armed forces - Sakshi

పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మపై సోషల్‌ మీడియా యూజర్లు విరుచుకుపడుతున్నారు. సాయుధ దళాల వారోత్సవం సందర్భంగా ఆయన అందించిన సహకారం సోషల్‌ మీడియా యూజర్లలో మండిపాటుకు గురిచేసింది. సాయుధ దళాల వారోత్సవం సందర్భంగా తన వంతు సహకారంగా రూ.501ను అందిస్తున్నట్టు పేర్కొన్న విజయ్‌ శేఖర్‌ శర్మ, దాన్ని తన ట్విట్టర్‌ ప్రొఫైల్‌లో షేర్‌ చేశారు. బిలియన్‌ డాలర్‌ కంపెనీకి అధిపతి అయిన విజయ్‌ శేఖర్‌ శర్మ, కేవలం రూ.501నే సాయుధ దళాలకు అందించడంపై సోషల్‌ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేవలం రూ.501ను అందించడమే కాకుండా.. తానేదో పెద్ద మొత్తంలో నగదు అందించిన మాదిరిగా ట్విట్టర్‌లో షేర్‌ చేయడాన్ని యూజర్లు ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా చౌక బారు ప్రచారమని, ఈ రోజుల్లో సాధారణ గ్రామీణ ప్రజానీకమే సరస్వతి పూజకు రూ.500 విరాళంగా ఇస్తున్నారని, అలాంటిది ఒక పెద్ద టైకూన్‌ అయి ఉండి కేవలం రూ.501 అందించడంపై ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. 

ఇలాంటి సహకారం వస్తుందని అంచనా వేయడం లేదని పేర్కొంటున్నారు. కోట్లలో సంపద ఆర్జిస్తూ... కేవలం రూ.500నే విరాళంగా అందించడం చాలా చెత్తగా ఉందన్నారు. ఇది రక్షణ దళాలను కించపరచడమేనని అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పేటీఎం భారీ ఎత్తున్న సంపదను ఆర్జించింది. 1.47 బిలియన్‌ డాలర్లకు అధిపతి అయిన విజయ్‌ శేఖర్‌ శర్మ సాయుధ దళాలకు కేవలం రూ.501నే అందించడంపై సోషల్‌ మీడియా ప్రశ్నలు కురిపించడం తప్పేమీ కాదంటున్నారు కొందరు. ఈ వారమంతా సాయుధ దళాల వారోత్సవంగా ఆర్మీ సెలబ్రేట్‌ చేస్తోంది. సాయుధ దళాల విలువను విశ్వవ్యాప్తం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఈ క్యాంపెయిన్‌ను లాంచ్‌చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement