
స్టాక్ మార్కెట్‌లోకి 30శాతం ఈపీఎఫ్‌ఓ నిధులు!
న్యూఢిల్లీ: రిటైర్‌మెంట్ అండ్ గ్రాట్యూటీ ఫండ్స్ తమ వద్ద ఉన్న నిధుల్లో 30% ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించాలని ఆర్థికమంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. దీనిని ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌ఓ) యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డెరివేటివ్‌లు కలిగిఉన్న కంపెనీల షేర్లు లేదా మ్యూచ్యువల్ ఫండ్స్‌లో 15 శాతం వరకూ ప్రభుత్వేతర ప్రావిడెంట్, పెన్షన్, గ్రాట్యూటీ ఫండ్లు పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలన్నది మంత్రిత్వశాఖ ప్రతిపాదన. అంతే శాతాన్ని నిఫ్టీ, సెన్సెక్స్ ఫోర్టిఫోలియోలను ప్రతిబింబించే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టేందుకు వెసులుబాటు కల్పించాలి. అలాగే రిటైర్‌మెంట్ అండ్ గ్రాట్యూటీ ఫండ్స్ తమ మొత్తం నిధుల్లో 40 శాతాన్ని ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టేలా పరిస్థితి ఉండాలి.
ప్రస్తుత నిబంధనల ప్రకారం రిటైర్‌మెంట్ అండ్ గ్రాట్యూటీ ఫండ్స్ తమ నిధులను ప్రత్యక్షంగా ఈక్విటీ మార్కెట్‌లో పెట్టడానికి వీలులేదు. ఈపీఎఫ్‌ఓకు 5% వరకూ మనీ మార్కెట్ ఇన్‌స్ట్రమెంట్లలో (సెబీ నియంత్రణలోని ఫండ్ సంస్థల ఈక్విటీ అనుసంధాన పథకాలు సహా) పెట్టేందుకు అనుమతి ఉంది. కాగా భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్), ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌సహా పలు కార్మిక సంఘాలు ఈపీఎఫ్‌ఓ నిధులను ఈక్విటీ మార్కెట్‌లో పెట్టేందుకు తీవ్ర వ్యతిరేకతను తెలుపుతున్నాయి. ఈపీఎఫ్‌ఓ వద్ద ప్రస్తుతం దాదాపు రూ.5 లక్షల కోట్లకుపైగా నిధులు ఉన్నాయి.