వేతన జీవులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 2023 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.15 శాతంగా కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. ఈ మేరకు 8.15 శాతం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లుగా ఈపీఎఫ్‌ఓ ఓ సర్క్యలర్ విడుదల చేసింది.
ఈపీఎఫ్ పథకం- 1952లోని 60 (1) పేరా కింద ప్రతి సభ్యుని ఖాతాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ వడ్డీని జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని తెలియజేసిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ తెలియజేసినట్లు ఈపీఎఫ్‌ఓ సర్క్యులర్‌లో పేర్కొంది. దీని ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో చందాదారుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేసిన పీఎఫ్ మొత్తానికి 8.15 శాతం వడ్డీని ఈపీఎఫ్‌ఓ సభ్యుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇంతకు ముందు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.10 శాతం చొప్పున వడ్డీని ఈపీఎఫ్‌ఓ జమ చేసింది.
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 23 ఆర్థిక సంవత్సరానికికి గానూ 8.15 శాతం వడ్డీ రేటును గత మార్చి 28న సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును అనుసరించి, వడ్డీ రేటును ఆర్థిక శాఖ ఆమోదించి నోటిఫై చేయాలి. అప్పుడే సభ్యుల ఖాతాల్లో జమ అవుతుంది. సాధారణంగా, వడ్డీ రేటును ఆర్థిక శాఖ ద్వారా ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తెలియజేస్తుంది. 2023 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ కోసం చందాదారులు ఇప్పటి వరకు వేచి చూశారు.
ఎంప్లాయీస్ ప్రావెడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది దేశంలోనే అతిపెద్ద రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్. ఇందులో 70.2 మిలియన్ల మంది ఉద్యోగులు, 0.75 మిలియన్ల కంపెనీలు సొమ్ము జమ చేస్తున్నారు. సబ్‌స్క్రైబర్‌ల పాస్‌బుక్‌ని పన్ను పరిధిలోకి వచ్చే, పన్నేతర విరాళాలుగా విభజించాల్సి రావడంతో తలెత్తిన సాఫ్ట్‌వేర్ సమస్యల కారణంగా 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ జమ ఆలస్యమైంది. 2021-22లో రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్‌లపై వచ్చే పొదుపు ఆదాయంపై ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను దీనికి కారణం.
Comments
Please login to add a commentAdd a comment