న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) నిధుల్లో కొంత మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ప్రతిపాదనలేవీ తమ పరిశీలనలో లేవని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) పేర్కొంది. ప్రస్తుతం ఈ సంస్థ నిర్వహణలో సుమారు రూ.6 లక్షల కోట్ల మేర మూల నిధి(కార్పస్) ఉన్నట్లు అంచనా.
తాజాగా కేంద్ర కార్మిక మంత్రి నేతృత్వంలో జరిగిన ఈపీఎఫ్‌ఓ ట్రస్టీల సమావేశంలో ఆర్థిక శాఖ చేసిన పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చ జరిగిందని.. సంస్థ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కేకే జైన్ బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. బోర్డు మాత్రం స్టాక్స్ లేదా ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్)లో పెట్టుబడులకు నిరాకరించినట్లు ఆయన పేర్కొన్నారు.
కాగా, ప్రభుత్వ బాండ్‌లలో పెట్టుబడుల మొత్తాన్ని మరింత పెంచేందుకు బోర్డు నిర్ణయించిందని.. దీనికి సంబంధించి కేటాయింపుల్లో వెసులుబాటు కోసం ఆర్థిక శాఖకు నివేదించినట్లు జైన్ వివరించారు. మరింత మెరుగైన రాబడుల కోసం పీఎఫ్ నిధులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలంటూ ఆర్థిక శాఖ చాన్నాళ్లుగా చెబుతూ వస్తోంది. అయితే, ఉద్యోగ సంఘాల నుంచి ఆందోళన కారణంగా ఈపీఎఫ్‌ఓ ఇందుకు నిరాకరిస్తోంది. 5 కోట్లకు పైగా చందాదారులు ఉన్న ఈపీఎఫ్‌ఓ.. 2014-15 ఏడాదికిగాను ఇటీవలే వడ్డీరేటును 8.75 శాతంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
పీఎఫ్ నిధులను స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టం: ఈపీఎఫ్‌ఓ
Published Thu, Sep 18 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM
Advertisement
Advertisement