నిధులు పనిచేస్తేనే ఆర్జన | Brief about etf trading | Sakshi
Sakshi News home page

నిధులు పనిచేస్తేనే ఆర్జన

Published Sun, Jul 8 2018 11:38 PM | Last Updated on Mon, Jul 9 2018 12:07 AM

Brief about etf trading  - Sakshi

సురేశ్‌కు స్టాక్‌ మార్కెట్‌పై పూర్తి అవగాహన ఉంది. రెగ్యులర్‌గా ట్రేడింగ్‌ చేస్తుంటాడు. కాకపోతే మార్కెట్లు అనుకూలంగా లేవని భావిస్తే... కొద్దిరోజులు ఎలాంటి ట్రేడింగ్‌ చెయ్యకుండా మిన్నకుండిపోతాడు. డబ్బులు పోగొట్టుకోకుండా చూసుకోవటం కూడా ఒకరమైన స్ట్రాటజీయేనన్నది సురేశ్‌ ఉద్దేశం.

కాకపోతే అలా ట్రేడింగ్‌ మానేసినపుడు... మార్కెట్లు కాస్త అనుకూలంగా మారి మళ్లీ ఎప్పుడు చేస్తాడో తనకే తెలియదు కనక ఆ డబ్బుల్ని అలా ట్రేడింగ్‌ ఖాతాలోనే ఉంచేస్తుంటాడు. బ్యాంకు ఖాతాలోకి వెనక్కి తీసుకోకుండా అలానే ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి కదా అని ఉంచేస్తుంటాడు. ఒకోసారి రెండుమూడు వారాల పాటు ఇలానే ఉండిపోతాయి కూడా. మరి ఈ సమయంలో అవి బ్యాంకు ఖాతాలో ఉంటే కనీసం సేవింగ్స్‌ వడ్డీ అయినా వస్తుంది.

అలాకాకుండా ఈ సమయంలో ఇంకా మెరుగైన రాబడులు రావాలంటే ఏం చేయాలి? లిక్విడ్‌ ఈటీఎఫ్‌లను ఎంచుకోవాలి. మీ ట్రేడింగ్‌ ఖాతా నుంచి బ్యాలన్స్‌ను విత్‌ డ్రా చేసుకోకుండానే... లిక్విడ్‌ ఫండ్స్‌ను కొనుగోలు చేసుకుని, మళ్లీ ట్రేడింగ్‌కు డబ్బులు అవసరమైన వెంటనే వీటిని విక్రయించేసుకోవచ్చు. దాంతో మీ బ్యాలన్స్‌పై కొంతైనా రాబడులు అందుకోవచ్చు. ఈ విధానం ఎలా పనిచేస్తుందో తెలియజేసే కథనమే ఇది.   – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

అందుబాటులో రెండు ఫండ్లు...
లిక్విడ్‌ ఈటీఎఫ్‌లనేవి ‘ప్యాసివ్‌లీ మేనేజ్డ్‌ డెట్‌ ఫండ్స్‌’. పాసివ్‌లీ అంటే ఫండ్‌ మేనేజర్ల ప్రమేయం లేకుండానే డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం.. అంతకుముందు రోజు రాత్రి బెంచ్‌మార్క్‌ (సూచీ) రేటును ట్రాక్‌ చేయటం వంటివి జరిగిపోతుంటాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో షేర్ల మాదిరే లిక్విడ్‌ ఈటీఎఫ్‌లు ట్రేడవుతుంటాయి.

మార్కెట్‌ వేళల్లో అన్ని పనిదినాల్లో ఎప్పుడైనా వీటిని కొనటం, విక్రయించటం చేయొచ్చు. ప్రస్తుతం రెండు లిక్విడ్‌ ఈటీఎఫ్‌లు పనిచేస్తున్నాయి. రిలయన్స్‌ లిక్విడ్‌ బీస్, డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ లిక్విడ్‌ ఈటీఎఫ్‌. వీటిలో రిలయన్స్‌ లిక్విడ్‌ బీస్‌ అన్నది చాలా యాక్టివ్‌గా ట్రేడయ్యే ఈటీఎఫ్‌. 2003 జులై నుంచి మంచి బలమైన ట్రాక్‌ రికార్డు ఉంది. డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ లిక్విడ్‌ ఈటీఎఫ్‌ ఏడాది నుంచే పనిచేస్తోంది.  

చార్జీలు లేవు..!
రిలయన్స్‌ లిక్విడ్‌ బీస్, డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ లిక్విడ్‌ ఈటీఎఫ్‌... రెండూ డైలీ డివిడెండ్‌ ప్లాన్‌నే ఆఫర్‌ చేస్తున్నాయి. అంటే రోజువారీ రాబడులను డివిడెండ్‌గా మార్చేసి తిరిగి ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. కనుక డివిడెండ్‌పై 29.12 శాతం డివిడెండ్‌ పన్ను అమలవుతుంది. అయినప్పటికీ ఫండ్‌ ఎన్‌ఏవీని రోజువారీగా కనీసం రూ.1,000 స్థాయిలో ఉంచేందుకు ఇవి ప్రయత్నిస్తుంటాయి.

ఒక్క బ్రోకరేజీ సంస్థ మినహా (ఈ బ్రోకరేజీ మాతృ సంస్థ బ్యాంకింగ్‌ కంపెనీ) మిగిలిన బ్రోకరేజీలు లిక్విడ్‌ ఈటీఎఫ్‌లలో లావాదేవీలపై బ్రోకరేజీ వసూలు చేయడం లేదు. ఎందుకంటే లిక్విడ్‌ ఈటీఎఫ్‌ల రూపంలో ఇన్వెస్టర్ల నిధులు బయటకు వెళ్లిపోకుండా ఉంటాయి. దీంతో వాటిని తిరిగి ట్రేడింగ్‌ కోసం ఉపయోగిస్తే బ్రోకరేజీలకు ఎంతో కొంత లాభమే వస్తుంది కాబట్టి. కస్టోడియన్, ట్రాన్సాక్షన్‌ చార్జీలు కూడా లేవు. దీంతో కొనుగోలు, అమ్మకాలపై పెద్దగా వ్యయాలుండవు. ఎక్సే్చంజ్‌ల్లో కనీస లావాదేవీ ఒక యూనిట్‌గా ఉంటుంది.

లిక్విడిటీ సమస్య తక్కువే...
రిలయన్స్‌ లిక్విడ్‌ బీస్‌ అన్నది చాలా యాక్టివ్‌గా ట్రేడయ్యే ఈటీఎఫ్‌. అవసరమైన సందర్భంలో ఈటీఎఫ్‌ యూనిట్లను అమ్ముకోవడం ఎంతో సులభం. ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్‌ లిక్విడ్‌ బీస్‌ కౌంటర్లో రోజువారీగా రూ.92 కోట్ల మేర ట్రేడింగ్‌ గత రెండేళ్లుగా నమోదవుతోంది. గత రెండేళ్లుగా రోజువారీగా ఈ కౌంటర్లో 3,150 ట్రేడ్లు నమోదవుతున్నాయి. ఈ రెండు లిక్విడ్‌ ఈటీఎఫ్‌లు కూడా నిఫ్టీ 1డి రేటు ఇండెక్స్‌ను తమ బెంచ్‌ మార్క్‌గా పాటిస్తున్నాయి.

అంటే ఇన్వెస్టర్లు లెండింగ్‌ మనీతో ఆర్జించే రాబడులను ఈ సూచీ ప్రతిఫలిస్తుంది. ఈ సూచీ రాబడుల రేటు ప్రస్తుతం 6.11 శాతంగా ఉంది. గత ఏడాది కాలంలో 4.3– 6.3 శాతం మధ్య ఉంది. దీంతో ఈ లిక్విడ్‌ ఈటీఎఫ్‌ల రాబడులు నిఫ్టీ 1డి రేటు సూచీల రేటుకు సమీపంలో ఉంటాయి. అంటే స్పష్టంగా చెప్పాలంటే డివిడెండ్‌ పన్ను పోను ఈ లిక్విడ్‌ ఈటీఎఫ్‌ల్లో రాబడులు ప్రతి రోజూ రూ.లక్షకు రూ.11–13 మధ్య ఉంటున్నాయి. సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలో వచ్చే రాబడుల కంటే ఇవి ఎక్కువ.

ఉపయోగపడని నిధులకు మార్గం
లిక్విడ్‌ ఈటీఎఫ్‌లు ప్రత్యేకంగా క్యాపిటల్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు ఉపయోగం. ఉపయోగించకుండా ఉన్న నిధులతో వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. అవసరమైన సందర్భంలో వెంటనే నగదుగా మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.  ఇన్వెస్టర్లు ఈక్విటీ షేర్లను విక్రయించినప్పుడు ఆ మొత్తం ఖాతాలో యాడ్‌ అవుతుంది. కానీ రెండు రోజుల తర్వాతే బ్యాలన్స్‌ నిధులను రిడెంప్షన్‌ చేసుకోవడానికి వీలవుతుంది.

ప్రస్తుతం క్యాష్‌ మార్కెట్లో సెటిల్‌మెంట్‌కు సంబంధించి టీప్లస్‌2 అమలవుతోంది. అంటే ట్రేడ్‌ జరిగిన తరవాత రెండు రోజులకు సెటిల్‌మెంట్‌ అవుతుందన్న మాట. సెటిల్‌మెంట్‌ రోజున లిక్విడ్‌ ఈటీఎఫ్‌లు డీమ్యాట్‌ ఖాతాలో జమవుతాయి. కొత్త లావాదేవీకి డబ్బులు అవసరమయ్యేంత వరకు లిక్విడ్‌ ఈటీఎఫ్‌ల రూపంలో నిధులు హోల్డ్‌ అయి ఉంటాయి.

ఇక స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేద్దామనే ఉద్దేశంతో బ్యాంకు ఖాతాల్లో బ్యాలన్స్‌ ఉంచుకుని, అవకాశం కోసం వేచి చూసే వారు కూడా ఆ అవకాశం వచ్చే వరకు లిక్విడ్‌ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌ చేసుకుంటే మంచిదే. ట్రేడ్‌కు మార్జిన్‌ అవసరమైన వెంటనే ఒక క్లిక్‌తో లిక్విడ్‌ ఈటీఎఫ్‌లను అమ్మేసుకుంటే సరిపోతుంది. లిక్విడ్‌ ఈటీఎఫ్‌లను డెరివేటివ్‌ ట్రేడ్లకు మార్జిన్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. హేర్‌కట్‌ 10 శాతం అమలవుతుంది.


ప్రతికూలతలూ ఉన్నాయ్‌!
రిలయన్స్‌ లిక్విడ్‌ బీస్, డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ లిక్విడ్‌ ఈటీఎఫ్‌  ఫండ్స్‌లో ఎక్స్‌పెన్స్‌ రేషియో ఎక్కువగా ఉంది. 60 బేసిస్‌ పాయింట్ల (0.60శాతం) మేర ఉంది. రెగ్యులర్‌ లిక్విడ్‌ ఫండ్స్‌తో పోలిస్తే ఇది ఎక్కువే. రెండోది డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ అన్నది రాబడులను తినేస్తుంటుంది. మరో అంశం మాతృ సంస్థ బ్యాంకుగా ఉన్న బ్రోకరేజీ కంపెనీ లిక్విడ్‌ ఈటీఎఫ్‌ల ట్రేడింగ్‌పై షేర్ల మాదిరే బ్రోకరేజీ ఛార్జీలను బాదేస్తోంది. దీంతో లిక్విడ్‌ ఈటీఎఫ్‌ల రాబడులు తగ్గిపోతాయి.

కనుక ఇన్వెస్టర్లు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్‌ చేయాలి. ఇక, లిక్విడ్‌ ఈటీఎఫ్‌లను లిక్విడిటీ లేని ఈటీఎఫ్‌ల పనితీరుతో, బ్యాంకు ఎఫ్‌డీలతో పోల్చడం సరైనది కాదు. ఎందుకంటే ఇవి సాధారణ ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం కాదు. ముఖ్యంగా స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తగిన అవకాశం కోసం వేచి చూస్తూ ట్రేడింగ్‌ ఖాతాల్లో నిధులను అలాగే ఉంచేసేవారు, తాత్కాలికంగా ఆ నిధుల్ని లిక్విడ్‌ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవడానికి అనువైనవి. అది కూడా ఒక నెల కాల వ్యవధి వరకు సమంజసం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement