సాక్షి, హైదరాబాద్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ఇంజనీరింగ్, మేథమెటిక్స్, హ్యుమానిటీస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది ఉద్యోగాల పంట పండింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ విద్యార్థులకు కంపెనీలు భారీగా వేతనాలు ఆఫర్ చేశాయి. ఐఐటీల్లో చదివే బీటెక్ విద్యార్థులతో పోలిస్తే.. పీజీ (ఎంటెక్) విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఉద్యోగావకాశాల శాతం (60–65 శాతం మాత్రమే) తక్కువ. కానీ ఈ ఏడాది కాన్పూర్, రూర్కీ, భువనేశ్వర్, ఖరగ్‌పూర్, హైదరాబాద్, గాంధీనగర్ ఐఐటీల్లో పీజీ చదువుతున్న వారిలో 90 శాతం మందికి ఉద్యోగాలు లభించాయి. ముంబై, చెన్నై, ఢిల్లీ ఐఐటీలోనైతే ప్లేస్‌మెంట్‌కు నమోదు చేసుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు రావడం గమనార్హం. అంతేకాదు కంపెనీలు గతేడాదితో పోలిస్తే 50 శాతం మేర ఎక్కువగా వేతనాలు ఆఫర్ చేశాయి.
గతేడాదికన్నా ఎక్కువగా...
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పీజీ చేస్తున్న విద్యార్థుల్లో 570 మందికి ఆయా కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేశాయి. గతేడాది ఉద్యోగాలు పొందిన 342 మందితో పోలిస్తే ఇది 40 శాతం అధికం. ఐఐటీ కాన్పూర్‌లో గత సంవత్సరం 301 మందికి ఉద్యోగాలివ్వగా.. ఈసారి 30 శాతం ఎక్కువగా 432 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇక గత మూడేళ్లలో ఢిల్లీ, చెన్నై ఐఐటీల్లో పీజీ విద్యార్థుల ప్లేస్‌మెంట్లు 60–75 శాతానికి మించలేదు. కానీ ఈ ఏడాది ఏకంగా 95 శాతం మంది ఉద్యోగాలు పొందారు. అంతేకాదు కాన్పూర్, చెన్నై, రూర్కీ ఐఐటీల్లో ఈసారి ఉద్యోగాలు పొందిన పీజీ విద్యార్థులకు గత ఐదేళ్ల సగటుతో పోల్చితే 90 శాతం అధికంగా వేతన ఆఫర్లు వచ్చాయి.
పీజీ విద్యార్థులకు పెరుగుతున్న డిమాండ్
బీటెక్ చదివినవారు కంపెనీల్లో స్థిరంగా ఉద్యోగాలు చేయకపోవడం, ఏడాది రెండేళ్లు పనిచేశాక పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిపోవడం వంటి కారణాలతో ఐటీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెన్నై ఐఐటీ ప్లేస్‌మెంట్ విభాగం ఓ విశ్లేషణలో వెల్లడించింది. అందువల్ల రెండు మూడేళ్లుగా పీజీ విద్యార్థులకు ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొంది.
కంప్యూటర్ సైన్స్ వారికి భారీ వేతనాలు
ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రధానాంశంగా, మెకానికల్‌లో రోబోటిక్స్ ప్రధానాంశంగా పీజీ చేస్తున్నవారికి డిమాండ్ ఎక్కువగా ఉంది. వారికి కనిష్టంగా రూ. 75 లక్షల నుంచి గరిష్టంగా రూ. 90 లక్షల వరకు వార్షిక వేతనాల ఆఫర్లు రావడం గమనార్హం. అంతేకాదు ఈసారి పీజీ పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు గత ఐదేళ్ల సగటుతో పోల్చితే కనిష్టంగా 50 శాతం నుంచి గరిష్టంగా 90 శాతం వరకు అధికంగా వేతనాల ఆఫర్లు వచ్చాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రమే కాదు డ్యూయల్ డిగ్రీ (ఐదేళ్ల మాస్టర్ డిగ్రీ) చేసిన విద్యార్థులకు కూడా ప్రతిష్టాత్మక కంపెనీలు మంచి ఆఫర్లు ఇచ్చాయి. ఎక్కువ వేతనం ఆఫర్ చేసిన కంపెనీల్లో సామ్‌సంగ్ ఆర్‌అండ్‌డీ, ఇంటెల్, టాటా మోటార్స్, గోల్డ్‌మన్‌శాక్స్, హ్యూందాయ్, మైక్రోసాఫ్ట్, హెచ్‌పీ వంటి కంపెనీలు ఉన్నాయి.
ఎన్‌ఐటీల్లోనూ ‘పీజీ’డిమాండ్
ఐఐటీలే కాదు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లలో కూడా పీజీ విద్యార్థులకు ఈసారి భారీగా ఉద్యోగ ఆఫర్లు వచ్చాయని నాస్కామ్ తన తాజా బులెటిన్‌లో వెల్లడించింది. ‘‘పీజీ విద్యార్థులు ప్రత్యేకమైన కోర్సులో స్పెషలైజేషన్ పూర్తి చేస్తారు. ఎంపిక చేసుకున్న సబ్జెక్టు మీద వారికి పూర్తిగా అవగాహన ఉంటుంది. దీంతో కంపెనీలు పీజీ విద్యార్థుల మీద దృష్టి పెట్టాయి..’’అని నాస్కామ్ సీనియర్ డైరెక్టర్ పి.అశోక్ చెప్పారు. ఓ మోస్తరు పేరున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా పీజీ విద్యార్థులకు కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది తెలంగాణలోని టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో పీజీ విద్యార్థులకు ప్లేస్‌మెంట్లు చేపడుతున్నట్లు పలు కంపెనీలు ఇప్పటికే లేఖలు రాశాయి.
ఇతర కాలేజీల్లో బీటెక్ చేసినా ఐఐటీల్లో ఎంటెక్
ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో బ్యాచిలర్ అఫ్ టెక్నాలజీ (బీటెక్) సీటు కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీపడతారు. కానీ పది వేల మందికి మాత్రమే సీట్లు లభిస్తాయి. అదే విద్యా సంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌కు మాత్రం పోటీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఐఐటీల్లో బీటెక్ పూర్తికాగానే క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో మంచి ఉద్యోగావకాశాలు వస్తుంటాయి. మరికొందరు పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిపోవడం జరుగుతోంది. దీంతో ఇతర కాలేజీల్లో బీటెక్ పూర్తి చేసినవారు ఐఐటీల్లో ఎంటెక్ చేసేందుకు అవకాశం లభిస్తోంది. అలాంటివారు ‘గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)’పరీక్ష ద్వారా ఐఐటీల్లో పీజీ కోర్సులు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment