పాన్ బహార్ యాడ్‌లో పీర్స్ బ్రోస్నన్
న్యూఢిల్లీ : పాన్ బహార్ ప్రకటనలో మెరిసిన, హాలీవుడ్ జేమ్స్ బాండ్ నటుడు పీర్స్ బ్రోస్నన్ ఆ కంపెనీపై తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. పాన్ మసాలా బ్రాండు తనను మోసం చేసిందని ఆరోపించాడు. ఉత్పత్తి హానికరమైన స్వభావాన్ని దాచిపెట్టి పాన్ మసాల బ్రాండు ఈ మోసానికి పాల్పడిందన్నాడు. ఢిల్లీ స్టేట్ టుబాకో కంట్రోల్ సెల్‌కు రాసిన లేఖలో.. ‘కంపెనీ నన్ను మోసం చేసింది. ఉత్పత్తి హానికరమైన స్వభావాన్ని వెల్లడించలేదు. అంతేకాక ప్రకటన ఒప్పందానికి సంబంధించిన నిబంధనలను బహిర్గతం చేయలేదు’ అని పేర్కొన్నట్టు అదనపు డైరెక్టర్(హెల్త్) ఎస్‌కే అరోరా చెప్పారు. ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం బ్రోస్నన్‌కు షోకాజు నోటీసు పంపిన సంగతి తెలిసిందే.
ఈ లీగల్ నోటీసుకు స్పందించిన బ్రోస్నన్, కంపెనీతో తనకున్న ఒప్పందం ఎప్పుడో పూర్తయిందని, డిపార్ట్‌మెంట్‌కు అన్ని విధాలా సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని బ్రోస్నన్ తెలిపారు. భవిష్యత్తులో హాని కలిగించే ఎలాంటి ఉత్పత్తుల కంపెనీలకు తాను సహకరించనని బ్రోస్నన్ రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్టు అరోరా పేర్కొన్నారు. సిగరెట్స్, ఇతర టుబాకో ప్రొడక్ట్‌ల యాక్ట్ 2003 కింద నిషేధించబడిన టుబాకో ఉత్పత్తుల ప్రకటనలకు సహకరించవద్దని సెలబ్రిటీలకు, మాస్ మీడియాకు అధికారులు ఆదేశించారు. సామాజిక బాధ్యతను సెలబ్రిటీలు తప్పక తెలుసుకోవాలని, ముఖ్యంగా యువత వారిని సెలబ్రిటీలను దేవుడిలా భావించి, గుడ్డిగా అనుకరించకూడదని సూచించారు. సిగరెట్స్, ఇతర టుబాకో ప్రొడక్ట్‌ల యాక్ట్ 2003 కింద టుబాకో ఉత్పత్తుల అన్ని ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనలను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment