10 శాతం తగ్గిన పిపవావ్
గత కొన్ని రోజులుగా జోరుగా పెరుగుతున్న పిపవావ్ డిఫెన్స్ షేర్ 10 శాతం క్షీణించి రూ.68.85 వద్ద ముగిసింది. ఒక్కో షేర్‌ను రూ.63 చొప్పున నిఖిల్ గాంధీ నేతృత్వంలోని ప్రమోటర్ల గ్రూప్ నుంచి 18 శాతం వాటాను రూ.819 కోట్లకు కొనుగోలు చేయనున్నామని రిలయన్స్ ఇన్‌ఫ్రా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే ఈ షేర్ 10 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. ఈ క్షీణత కారణంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కో రోజులోనే రూ.563 కోట్లు హరించుకుపోయి రూ.5,069 కోట్లకు తగ్గింది.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీ పిపవావ్ డిఫెన్స్‌లో రూ.2,082 కోట్లతో నియంత్రిత వాటాను కొనుగోలు చేయనున్న సంగతి తెలిసిందే. కాగా రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీ షేర్ 3 శాతం వృద్ధితో రూ.490 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.391 కోట్లు పెరిగి రూ.12,880 కోట్లకు చేరింది.