
పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా భారత్
మూడేళ్లలో అనేక సంస్కరణలు
ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరగాలి
భారత్–టర్కీ వ్యాపార దిగ్గజాల సదస్సులో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత్ ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ దేశంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇన్వెస్ట్‌మెంట్స్‌కు భారత్ గతంతో పోలిస్తే ప్రస్తుతం మరింత ఆశావహంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థను, పాలనా విధానాలను సంస్కరించేందుకు గత మూడేళ్లలో తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని భారత్–టర్కీ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొన్న సందర్భంగా మోదీ తెలిపారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా పేర్లతో పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టామన్నారు.
‘ప్రస్తుతం భారత ఎకానమీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతోంది. ఈ వేగాన్ని కొనసాగించడంతో పాటు వ్యవస్థలో లోపాలను సరిదిద్దడంపైనా దృష్టి సారిస్తున్నాం‘ అని ఆయన వివరించారు. నవభారత నిర్మాణం కొనసాగుతోందని,విధానాలు.. ప్రక్రియలు మొదలైనవాటిని సంస్కరించడం ద్వారా వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా టర్కీ వ్యాపార దిగ్గజాలను ఆయన ఆహ్వానించారు.