
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.230 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత క్యూ3లో ఆర్జించిన నికర లాభం రూ.207 కోట్లతో పోలిస్తే 11% వృద్ధి సాధించామని బ్యాంక్ తెలిపింది. ఇతర ఆదాయం, నిర్వహణ ఆదాయాలు పెరగడంతో నికర లాభం పుంజుకుందని, అయితే కేటాయింపులు పెరగడంతో వృద్ధి కూడా పరిమితంగానే నమోదయిందని విశ్లేషకులు పేర్కొన్నారు.
ఎన్‌ఐఐ 7% అప్..: మొత్తం ఆదాయం రూ.14,124 కోట్ల నుంచి 8% వృద్ధితో రూ.15,257 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 7% వృద్ధితో రూ.3,989 కోట్లకు చేరుకుందని, రుణ వృద్ధి 17%గా ఉందని తెలిపింది. ఈ క్యూ3లో బ్యాంక్ రూ.558 కోట్ల నికర లాభం, రూ.4,123 కోట్ల నికర వడ్డీ ఆదాయం ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు.
మెరుగుపడిన రుణ నాణ్యత...: ఈ క్యూ3లో స్థూల మొండి బకాయిలు రూ.57,519 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.34,076 కోట్లకు తగ్గాయని పీఎన్‌బీ తెలిపింది. శాతాల పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 13.70% నుంచి 12.11%కి, నికర మొండి బకాయిలు 9.09% నుంచి 7.55 శాతానికి తగ్గాయి. పన్ను మినహా ఇతర అంశాలకు కేటాయింపులు రూ.2,562 కోట్ల నుంచి 74% (క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 80%) వృద్ధితో రూ.4,467 కోట్లకు పెరిగాయి. ప్రభుత్వం చేయనున్న రూ.5,473 కోట్ల మూలధన పెట్టుబడులకు తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని పీఎన్‌బీ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో పీఎన్‌బీ షేరు 1.8% నష్టంతో రూ.160 వద్ద ముగిసింది.