
రెండు వారాలుగా ‘సీసా’ (పైకి, కిందికి) ఆట ఆడుతున్న డాలర్–బంగారం సమీప భవిష్యత్తును ఈ వారం సెంట్రల్ బ్యాంకుల పాలసీ నిర్ణయాలు తేల్చనున్నాయి. జూన్ 13న ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో అమెరికా ఫెడ్ రేటు (ప్రస్తుతం 1.50–1.75 శాతం శ్రేణి) మరో పావుశాతం పెంపు నిర్ణయం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఈ పెంపునకు డాలర్ ఇండెక్స్ ఎలా స్పందిస్తుందన్నది ఇక్కడ ముఖ్యాంశం. జూన్ 8వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ ధర 10 డాలర్లు బలపడి తిరిగి 1,303 డాలర్లపైకి లేస్తే, డాలర్ ఇండెక్స్ 61 సెంట్లు బలహీనపడి 93.55 వద్ద ముగిసింది. ఇక జూన్ 14న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) పరపతి విధాన నిర్ణయమూ డాలర్–పసిడి కదలికలను ప్రభావితం చేసే అంశమే. 12న జరగనున్న అమెరికా–ఉత్తరకొరియా అగ్రస్థాయి చర్చలు దీర్ఘకాలంలో పసిడిపై ప్రభావం చూపే అంశమే.
దేశంలోనూ పెరుగుదల: దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర వారం వారీగా రూ.669 లాభపడి, రూ. 31,215 వద్ద ముగిసింది. ఇక ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్‌లో 99.9, 99.5 స్వచ్ఛత వారంలో రూ.190 చొప్పున లాభపడి రూ.31,160, రూ.31,010 వద్ద ముగిశాయి. కాగా వెండి కేజీ ధర రూ.835 లాభపడి రూ.40,225 వద్దకు చేరింది.