ఈక్విటీలపై రాబడి తగ్గే అవకాశం
మార్కెట్ నిపుణుల విశ్లేషణ
న్యూఢిల్లీ: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. నాలుగేళ్ల తదుపరి బుధవారం 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. అయితే చౌకగా లభించనున్న ఫైనాన్సింగ్ భారత్ వంటి వర్ధమాన దేశాలకు పెద్దగా కలసిరాకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. విదేశీ నిధులు బంగారం ధరలకు దన్నునిచ్చే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు.
మిశ్రమ అంచనాలు
సుమారు 14 నెలలపాటు రెండు దశాబ్దాల గరిష్టం వద్ద కొనసాగిన ఫెడ్ ఫండ్స్ రేట్లు దిగివస్తున్నాయి. తాజాగా రేట్ల తగ్గింపు టర్న్ తీసుకున్న ఫెడ్ ఈ ఏడాది చివరి(డిసెంబర్)కల్లా మరో 0.5 శాతం కోత పెట్టనున్నట్లు అంచనా. అయితే ఫెడ్ రేట్ల తగ్గింపుతో ఈక్విటీలపై రాబడి క్షీణించనున్నట్లు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజీవ్ అగర్వాల్ అంచనా వేశారు. మరోవైపు బంగారం ధరలు బలపడే వీలున్నట్లు పేర్కొన్నారు. కామా జ్యువెలరీ ఎండీ కొలిన్ షా సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. సమీపకాలంలో పసిడి ధరలు సరికొత్త గరిష్టాలకు చేరవచ్చని తెలియజేశారు. యూఎస్ రేట్ల కోత బంగారంలో పెట్టుబడులకు దారిచూపుతుందని అభిప్రాయపడ్డారు.
రేట్ల కోతకు దారి...
ఫెడ్ వడ్డీ తగ్గింపుతో భారత్‌కు మరిన్ని విదేశీ పెట్టుబడులు తరలిరానున్నట్లు బిజ్2క్రెడిట్ సహవ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ అరోరా పేర్కొన్నారు. అటు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు, ఇటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మార్గంలోనూ విదేశీ నిధులు పెరగనున్నట్లు అంచనా వేశారు. ఇది దేశీ కరెన్సీ రూపాయికి బలాన్నిస్తుందని తెలియజేశారు. వెరసి ఆర్‌బీఐ సైతం వడ్డీ రేట్లను తగ్గించేందుకు వీలు చిక్కుతుందని అభిప్రాయపడ్డారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 6.5 శాతంవద్దే కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కఠిన పరపతి విధానాలను అవలంబిస్తోంది. వచ్చే నెల(అక్టోబర్) 7–9 మధ్య ఆర్‌బీఐ పాలసీ సమీక్షను చేపట్టనున్న విషయం విదితమే.
అయితే ప్రపంచ దేశాల వడ్డీ రేట్ల ప్రభావం భారత్‌పై ఉండదని ఇండియాబాండ్స్.కామ్ సహవ్యవస్థాపకుడు విశాల్ గోయెంకా పేర్కొన్నారు. రిస్క్ ఆస్తులలో భారీ ర్యాలీ, ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, ద్రవ్యోల్బణ ప్రభావాల కారణంగా ప్రస్తుతం వడ్డీ రేట్ల తగ్గింపునకు చాన్స్ తక్కువేనని తెలియజేశారు. అంచనాలకు మించి ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించినట్లు ఎడిల్‌వీజ్ ఎంఎఫ్ ఈక్విటీస్ సీఐవో త్రిదీప్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు.
భారత్‌పై ప్రభావం అంతంతే..
మార్కెట్‌వర్గాలు ఇప్పటికే చాలా మటుకు ఫెడ్ వడ్డీ రేట్ల కోతను పరిగణనలోకి తీసుకున్నందున దీని ప్రభావం భారత్‌పై పెద్దగా ఉందు. దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఇప్పటికే ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే, మొత్తం మీద రేట్ల తగ్గింపనేది వర్ధమాన మార్కెట్లకు మాత్రం సానుకూలమే. – వి. అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారు
Comments
Please login to add a commentAdd a comment