పోర్షే కారు(ఫొటో కర్టెసీ: పోర్షే ట్విటర్)
బెర్లిన్: ఈ ఏడాది ప్రారంభంలో అందించిన బోనస్ నుంచి కొద్ది మొత్తం కోవిడ్-19(కరోనా వైరస్)పై పోరుకు విరాళంగా ప్రకటించాలని ప్రముఖ కార్ల తయారీ సంస్థ పోర్షే తన ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో లాభాలు ఆర్జించినందుకు గానూ ఈ జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం తన ఉద్యోగులకు బంపర్ బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్థ విజయం సాధించడంలో తోడ్పాటు అందించిన వారందరికీ 9 వేల యూరోలు బోనస్(వ్యక్తిగత పెన్షన్ ప్రణాళిక కోసం 700 యూరోలు అదనం)గా ఇస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది. అయితే ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకున్న వేళ సాటి వారికి సహాయంగా నిలిచేందుకు విరాళాలు అందించాలని సంస్థ ఉద్యోగులను కోరింది.
ఇక పోర్షే బోర్డు వ్యక్తిగతంగా 5 మిలియన్ యూరోలు దానం చేసిందని... దీనిని సామాజిక కార్యక్రమాల కోసం వినియోగిస్తుందని తెలిపింది. ఇలా ప్రతీ ఒక్కరూ స్వచ్చంగా ముందుకు వచ్చి మహమ్మారిపై పోరులో ముందుండాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.‘‘మనమంతా కలిసికట్టుగా పనిచేసినందు వల్లే విజయాలు సాధించాం. ఇందులో ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. ప్రతీ ఒక్కరికి బోనస్ లభిస్తుంది. అయితే ఈసారి ఆ మొత్తాన్ని సంఘీభావం తెలిపేందుకు ఉపయోగిద్దాం’’అంటూ కంపెనీ ఉన్నత పదవిలో ఉన్న ఆలివర్ బ్లూమ్ ఉద్యోగులను చైతన్యవంతం చేశారు. కాగా కరోనా ధాటికి ఆటోమొబైల్ సహా అన్ని రంగాలు కుదేలవుతున్న విషయం తెలిసిందే.(కరోనాతో ఏవియేషన్ కుదేలు..)
Comments
Please login to add a commentAdd a comment