సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ రెండో విడత దాడిని కొనసాగిస్తూ ప్రజల్లో దడ పుట్టిస్తున్న తరుణంలో చల్లని కబురు కరోనా కట్టడికి కొత్త వ్యాక్సిన్. మూడవ దశ మానవ ప్రయోగాలను కూడా పూర్తి చేసుకొని 90 శాతం విజయ దరహాసంతో ప్రపంచం ముంగిట్లోకి రానుంది ఆ వ్యాక్సిన్. అమెరికాకు చెందిన బహుళజాతి కంపెనీ ‘పీఫైజర్ ఫార్మాస్యూటికల్’ కంపెనీతో కలిసి కరోనా నిరోధక వ్యాక్సిన్ కోసం జర్మనీకి చెందిన ‘బయోఎన్‌టెక్’ కంపెనీ సంయుక్తంగా జరిపిన పరిశోధనల్లో ప్రముఖ పాత్ర నిర్వహించినది ఓ వైద్య దంపతులు.
ప్రముఖ ఫిజిషియన్లు ఉగర్ సాహిన్(55), ఓజ్లెమ్ ట్యూరెసి (53) వైద్య దంపతులు కరోనా వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కృషి చేశారు. వారు పెళ్లి రోజున కూడా ల్యాబ్‌లోనే గడిపేవారట. అంటే వైద్య పరిశోధనల పట్ల వారికి ఎంత అంకిత భావం ఉందో అర్థం అవుతోంది. తాము కనుగొన్న కరోనా వ్యాక్సిన్ నూటికి 90 శాతం ఫలితాలనిస్తోందంటూ ఫైజర్, బయోఎన్‌టెక్ కంపెనీలు సంయుక్తంగా సోమవారం నాడు చేసిన ప్రకటనతో ఆ వ్యాక్సిన్ గురించి ప్రపంచానికి తొలిసారి తెల్సింది. ఆ వ్యాక్సిన్‌ను దక్కించుకోవడంలో బ్రిటన్ ముందుంటుందని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆ దేశ ప్రజలకు హామీ ఇవ్వడం గమనార్హం.
(చదవండి : కరోనా కట్టడిలో ‘డి’ విటమిన్ పాత్ర)
వైద్య పరిశోధనల పట్ల ఉన్న మక్కువతోనే సాహిన్, ట్యూరెసిలు ఒక్కౖటై పెళ్లి చేసుకున్నారు. టర్కీలో జన్మించిన సాహిన్ జర్మనీలో పెరిగారు. ఆయన తల్లిదండ్రులు ఫోర్డ్ కార్ల ఫ్యాక్టరీలో ఉద్యోగులవడంతో ఆయన అక్కడే మెడిసిన్ చదువుకున్నారు. ‘ఇమ్యునోథెరపి (రోగ నిరోధక శక్తి)’లో పరిశోధకులుగా, ప్రొఫెసర్‌గా ఎదిగారు. ఆయన ముందుగా కొలోగ్ని, ఆ తర్వాత హామ్‌బర్గ్ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. హామ్‌బర్గ్ వైద్య కళాశాలలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఇమ్యునాలోజిస్ట్ మిస్ ట్యూరెసి పరిచయం అయ్యారట. జర్మనీకి వలస వచ్చిన టర్కీ ఫిజీషియన్ కూతరు ట్యూరెసి. వారి పరిచయం కాస్త ఇష్టంగా మారి పెళ్లి చేసుకున్నారు. తాము పెళ్లి రోజున కూడా ల్యాబ్‌లోనే పరిశోధనల మధ్య గడిపేవారమని ట్యూరెసి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
(చదవండి : మూడో వ్యాక్సిన్ రిజిస్టర్ చేయనున్న రష్యా)
2001లో ఆ దంపతులు తొలిసారిగా వాణిజ్య రంగంలో అడుగుపెట్టారు. మనుషుల్లో క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కొనే యాంటీ బాడీస్‌ను అభివృద్ధి చేయడం కోసం ‘గెనిమెడ్ ఫార్మాస్యూటికల్స్’ను స్థాపించారు. అప్పుడు సాహిన్ మెయింజ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన దేన్ని వదులుకోకుండా వైద్య బోధనను, వైద్య పరిశోధనలను కొనసాగించారు. వారు ఆ తర్వాత తమ ఫార్మాస్యూటికల్ కంపెనీని 2016లో జపాన్‌కు చెందిన ఆస్టెల్లా కంపెనీకి 1.4 బిలియన్ డాలర్లకు అమ్మేశారు. వారు 2008లో క్యాన్సర్‌పై తదుపరి పరిశోధనల కోసం ‘బయోఎన్‌టెక్’ సహ వ్యవస్థాపకులుగా ఏర్పాటు చేశారు. దానిలో ‘బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్’ 55 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టింది. సాహిన్ ఎన్నడూ ఖాళీ సమయాల్లో తన కంపెనీల షేర్ల గురించి పట్టించుకోకుండా సైంటిఫిక్ జర్నల్స్‌ను చదువుతూ కనిపించేవారని ఆయన సన్నిహితులు తెలిపారు.
వంద మంది జర్మనీ కుబేరుల్లో సాహిన్, ట్యూరెసి దంపతులున్నారని జర్మని వార్తా పత్రిక ‘వెల్ట్ ఏఏం ’ వెల్లడించింది. ఎంత సంపద వచ్చి పడినా సాహిన్ సాదా సీదా జీవితాన్ని గడుపుతూ హుందాగా కనిపించేవారని ‘బయోఎన్‌టెక్’ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘ఎంఐజీ ఏజీ’ సంస్థ బోర్డు మెంబర్ మత్తియాస్ క్రోమయర్ తెలిపారు. ఎంత పెద్ద బిజినెస్ సమావేశమైనా సాహిన్ జీన్ పాయింట్ ధరించి, భుజాన బ్యాక్‌ప్యాక్ తగిలించుకొని సైకిల్‌పై హెల్మెట్ ధరించి వచ్చేవారని ఆయన చెప్పారు. సాహిన్, ట్యూరెసి దంపతులే వాస్తవానికి వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. బ్రిటన్ ప్రభుత్వంతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఫైజర్, బయోఎన్‌టెక్ కంపెనీలు సంయుక్తంగా తయారు చేస్తోన్న కరోనా వ్యాక్సిన్‌ను ఒక కోటి డోస్‌లను క్రిస్మస్ నాటికి బ్రిటన్‌కు అందజేయాల్సి ఉంది. భారత్‌కు ఎప్పుడొస్తుందో తెలీదు.
Comments
Please login to add a commentAdd a comment