అమెరికా కంపెనీలకూ ప్రోత్సాహకాలు | Prasad woos US cos to start manufacturing in India, offers sops | Sakshi
Sakshi News home page

అమెరికా కంపెనీలకూ ప్రోత్సాహకాలు

Published Mon, Jan 26 2015 1:29 AM | Last Updated on Sat, Aug 25 2018 3:20 PM

అమెరికా కంపెనీలకూ ప్రోత్సాహకాలు - Sakshi

అమెరికా కంపెనీలకూ ప్రోత్సాహకాలు

ఐటీ, టెలికం శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్
 
*  భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించాలని టెక్నాలజీ కంపెనీలకు ఆహ్వానం...
న్యూఢిల్లీ: ‘మేక్ ఇన్ ఇండియా’లో పాలుపంచుకునే అమెరికా కంపెనీలకు ప్రోత్సాహకాలు కల్పిస్తామని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. భారత్‌లో అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు ఇక్కడి నుంచి ఎగుమతులపై దృష్టిపెట్టాల్సిందిగా అమెరికా టెక్నాలజీ కంపెనీలు, కార్పొరేట్ దిగ్గజాలను ఆయన ఆహ్వానించారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత్ పర్యటన సందర్భంగా(ఆదివారం నుంచి పర్యటన మొదలైంది) ఏర్పాటైన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారతీయ కంపెనీలకు అందుబాటులో ఉన్న రాయితీలన్నీ అమెరికా కంపెనీలకూ వర్తింపజేస్తాం. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అనేక ప్రోత్సాహకాలున్నాయి. వీటిని అందిపుచ్చుకోవాలి. సరిగ్గా చెప్పాలంటే... పెట్టుబడి పెట్టే ప్రతి 100 డాలర్లలో 25 డాలర్లను మేం(భారత్) తిరిగిచ్చేస్తాం. దీనికి తోడు రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలు కూడా అదనం’ అని ప్రసాద్ వివరించారు.
 
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీని భారీగా పెంచాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 2013-14 లో భారత్ రూ.69,516 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోగా... రూ.20,475 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఐటీ రంగంలోనూ భారత్, అమెరికా కంపెనీల భాగస్వామ్యాలు మరింత బలపడేందుకు అవకాశాలున్నాయని ప్రసాద్ పేర్కొన్నారు.
 
ఇక జోరుగా ఎఫ్‌డీఐలు: సిన్హా
భారత్‌కు త్వరలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) వెల్లువెత్తనున్నాయని ఆర్థిక శాఖ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగాన్ని పటిష్టం చేస్తున్న నేపథ్యంలో అమెరికాతో పాటు ఇతర దేశాల నుంచి నిధుల ప్రవాహం జోరందుకోనుందన్నారు. ‘అమెరికా వ్యాపార దిగ్గజాలు, కంపెనీలతో జరుపుతున్న చర్చలు చాలా సానుకూలంగా ఉన్నాయి.

ఆయా ప్రణాళికలన్నీ కార్యరూపం దాల్చే అవకాశాలుండటంతో త్వరలోనే నిధుల ప్రవాహం పెరగనుంది’ అని వివరించారు. కాగా, మల్టీబ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐల అనుమతికి తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. దేశంలో లక్షలాదిమంది చిన్న వర్తకులపై దీని ప్రభావం పడుతుందన్నదే తమ నిర్ణయానికి కారణమన్నారు. గతేడాది భారత్ ఈక్విటీ, డెట్(బాండ్‌లు) మార్కెట్లోకి 40 బిలియన్ డాలర్ల విదేశీ నిధులు వచ్చాయని.. మరిన్ని పెట్టుబడులకు ఇక్కడ అవకాశాలున్నాయని సిన్హా తెలిపారు. ఏప్రిల్ 2000-2014 నవంబర్ వరకూ అమెరికా నుంచి భారత్‌కు 13.28 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు లభించాయి. మొత్తం ఎఫ్‌డీఐల్లో ఇవి 5.62 శాతం.
 
నేడు సీఈఓలతో మోదీ, ఒబామా భేటీ
న్యూఢిల్లీ: అమెరికా-భారత్ సీఈఓల ఫోరం సమావేశం నేడు జరగనుంది. దీనిలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత్ ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. వీరితో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ కూడా భేటీకి హాజరుకానున్నట్లు సమాచారం. కాగా, ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార బంధం పటిష్టం చేసుకోవడం, వీసా సంబంధ సమస్యలు, పెట్టుబడులకు అడ్డంకుల తొలగింపు, టోటలైజేషన్ ఒప్పందంపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. భారత్ సీఈఓల తరఫున టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఫోరం కో-చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. అమెరికా తరఫున హనీవెల్ గ్రూప్ చీఫ్ డేవిడ్ ఎం కోట్ సారథ్యం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement