ఆఫ్లైన్ స్టోర్ను మొబైల్లో చూసేయొచ్చు! | Preksh innovations augmented Reality Services | Sakshi
Sakshi News home page

ఆఫ్లైన్ స్టోర్ను మొబైల్లో చూసేయొచ్చు!

Published Sat, May 21 2016 2:07 AM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

ఆఫ్లైన్ స్టోర్ను మొబైల్లో చూసేయొచ్చు!

ఆఫ్లైన్ స్టోర్ను మొబైల్లో చూసేయొచ్చు!

రిటైల్ సంస్థలకు ఆగ్‌మెంటెడ్ రియాలిటీ సేవలు
ఏఆర్‌లో ప్రపంచంలోనే తొలిసారి ‘ప్రేక్ష్’కు 2 పేటెంట్లు
మిలియన్ డాలర్ల నిధుల సమీకరణపై దృష్టి
ప్రేక్ష్ ఇన్నోవేషన్స్ కో-ఫౌండర్ సైకత్ సిన్హా

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్... షాపింగ్‌లో ఈ రెండింటికీ ఉన్న ప్రధాన తేడా టచ్ అండ్ ఫీల్ మాత్రమే. దీన్ని ఆన్‌లైన్ షాపింగ్‌కు కూడా అన్వయిస్తే!! అంటే కంప్యూటర్ నుంచో... చేతిలోని సెల్‌ఫోన్ నుంచో నేరుగా స్టోరంతా చూస్తూ నచ్చిన వస్తువును ఎంచుకునే వీలుంటే...!! నిజానికి ‘ప్రేక్ష్ ఇన్నోవేషన్’ సంస్థ దీన్ని కూడా అందుబాటులోకి తెచ్చేసింది. ప్రపంచంలో రిటైల్ స్టోర్లకు ఆగ్‌మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) సేవలందిస్తున్న ఏకైక సంస్థ ప్రేక్ష్ సేవల గురించి సంస్థ కో-ఫౌండర్ సైకత్ సిన్హా ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి వివరించారు. ఆ వివరాలు ఇవీ...

‘‘నా స్నేహితులు ఎం.ఎ.కోదండరామ, సాత్విక్ మురళీధర్, శరత్‌లతో కలసి బెంగళూరు కేంద్రంగా గతేడాది జూన్‌లో ప్రేక్ష్ ఇన్నోవేషన్ సంస్థను ప్రారంభించాం. 9 నెలల పాటు టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసం శ్రమించాం. సుమారు కోటి రూపాయల పైనే పెట్టుబడి పెట్టాం. మా సంస్థ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఆఫ్‌లైన్ షాప్‌ను ఆన్‌లైన్‌లో మీ కళ్లముందు ఉంచుతాం. ప్రపంచంలోనే రిటైల్ రంగంలో ఏఆర్ సొల్యూషన్స్‌లో రెండు పేటెంట్లను దక్కించుకున్నది మేం మాత్రమే.

 చ.అ.ను బట్టి చార్జీలు..
షాప్ విస్తీర్ణం, వినియోగించే ఉత్పత్తులను బట్టి ఆఫ్‌లైన్ సంస్థల నుంచి ఛార్జీలు వసూలు చేస్తాం. చదరపు అడుగుకు ప్రారంభ ధర రూ.10. ఉదాహరణకు మీకు 1,000 చ.అ.ల్లో ఫర్నిచర్ షాపు ఉందనుకుందాం. ముందుగా ఫోటో షూట్ కోసం రూ.10 వేలు, ఆ తర్వాత సబ్‌స్క్రిప్షన్ కింద నెలకు రూ.25 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఆపైన ప్రతి కొనుగోలుపై కొంత కమీషన్ ఉంటుంది. అది ఉత్పత్తిని బట్టి 1 శాతం నుంచి మొదలవుతుంది.

 రిటైల్ చెయిన్స్ కస్టమర్లు..
ప్రస్తుతం వాల్‌మార్ట్, వ్యాన్‌హ్యూసెన్, మహీంద్రా అండ్ మహీంద్రా, బేబీ ఓయ్, వర్ణం, డెకోవిల్లా, మాయా ఆర్గానిక్, ఫ్యాబ్‌హోమ్, డ్యాష్‌స్క్వేర్.. వంటి కంపెనీలు మా కస్టమర్లుగా ఉన్నాయి. ప్రేక్ష్‌ను వినియోగించుకోవాలంటే ముందుగా సంబంధిత రిటైల్ సంస్థ సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ వర్చువల్ స్టోర్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు కావాల్సిన ఉత్పత్తులను వర్చువల్ రియాల్టిలో నుంచి నేరుగా షాపులో తిరుగుతూ చూసినట్టుగా చూసుకోవచ్చు. కావాలంటే అక్కడి నుంచే కొనుగోలు చేయవచ్చు కూడా. ప్రేక్ష్ ఏఆర్ సేవల వల్ల ఆఫ్‌లైన్ స్టోర్లకు ఐడెంటిటీ వస్తుంది. బ్రాండింగ్ కూడా పెరుగుతుంది. అది కూడా ఎలాంటి విస్తరణ పెట్టుబడి అవసరం లేకుండానే. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉండే ఓ రిటైల్ చైన్ సంస్థ.. బెంగళూరుకు విస్తరించాలంటే స్టోర్  నిర్మాణం, స్థల సేకరణ, అనుమతులు వంటి వాటి కోసం పెద్ద మొత్తంలోనే పెట్టుబడి పెట్టాలి. పెపైచ్చు స్థానిక వర్తకుల నుంచి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, ప్రేక్ష్ ఏఆర్‌తో ఇవేవీ అవసరం లేకుండానే నేరుగా ఒకే స్టోర్ నుంచి ఆన్‌లైన్ ద్వారా దేశంలోని ఏ స్టోర్ లోని ఉత్పత్తులనైనా విక్రయించుకునే వీలుంటుంది. అంటే విస్తరణ నిమిత్తం చేసే పెట్టుబడంతా మిగిలినట్టేగా.

మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ..
టార్గెట్ ఇండియా అనే సంస్థ రిటైల్ పరిశ్రమలో నిర్వహించిన యాక్సలరేటర్ ప్రోగ్రాంలో దేశంలోని ఐదు ఉత్తమమైన స్టార్టప్‌లను ఎంపిక చేసింది. ఇందులో ప్రేక్ష్ ఒకటి. మిగతా నాలుగు మింట్‌ఎం, ఆన్‌క్యానీ విజన్, లేచల్, లాబోట్. ఈ నాలుగు స్టార్టప్‌లు 1.20 లక్షల డాలర్లు గెలుపొందాయి. ప్రస్తుతం మా సంస్థలో 20 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగిసే నాటికి విమానాశ్రయాలు, హై ఎండ్ ఫ్యాషన్ స్టోర్స్, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్లు, ఆతిథ్య రంగాలతో పాటూ ఆగ్నేయాసియా, నార్త్ అమెరికా దేశాలకూ విస్తరించాలని నిర్ణయించాం. ఇందుకోసం తొలిసారిగా నిధుల సమీకరణ చేస్తున్నాం. పలువురు ప్రైవేట్ ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నాం. మరో రెండు మూడు నెలల్లో సుమారు మిలియన్ డాలర్ల నిధులను సమీకరిస్తాం.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే
startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement