ప్రీమియం సైకిళ్లు రయ్‌ రయ్‌..! | Premium bicycles 50 percent annual growth | Sakshi
Sakshi News home page

ప్రీమియం సైకిళ్లు రయ్‌ రయ్‌..!

Published Tue, Dec 27 2016 12:52 AM | Last Updated on Tue, Jun 4 2019 6:36 PM

ప్రీమియం సైకిళ్లు రయ్‌ రయ్‌..! - Sakshi

ప్రీమియం సైకిళ్లు రయ్‌ రయ్‌..!

హై ఎండ్‌ మోడళ్లు 50% వృద్ధి
సైక్లింగ్‌ పట్ల యువత ఆసక్తి
వరుస కడుతున్న విదేశీ బ్రాండ్లు


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో
దేశంలో ప్రీమియం సైకిళ్లు సవారీ చేస్తున్నాయి. బేసిక్‌ మోడళ్లతో పోలిస్తే ఖరీదైన సైకిళ్లు వేగంగా దూసుకు పోతున్నాయి. హై ఎండ్‌ మోడళ్లు ఏకంగా 50 శాతం దాకా వార్షిక వృద్ధిని నమోదు చేస్తున్నాయంటే ఇక్కడి వారి ఆసక్తిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంకేముంది విదేశీ బ్రాండ్లు సైతం భారత్‌కు వరుస కడుతున్నాయి. ఫిట్‌నెస్‌ కోసం వీటి వాడకం పెరగడం కూడా సైకిళ్లకు డిమాండ్‌ను తెచ్చిపెడుతోంది. నగరాల్లో అయితే జీవనశైలిలో సైకిల్‌ ఒక భాగమైపోయింది. సైక్లిస్టులు దీని పేరు కాస్తా బైక్‌గా మార్చేశారు.

సైక్లింగ్‌ నగరాలివీ..
చెన్నై, బెంగళూరు, పుణే తర్వాత సైక్లింగ్‌కు ఆదరణ పెరుగుతున్న నగరాల్లో హైదరాబాద్‌ నాల్గవ స్థానంలో ఉందని సైకిళ్ల తయారీ దిగ్గజం టీఐ సైకిల్స్‌ అంటోంది. అయిదవ స్థానంలో ఢిల్లీ రాజధాని ప్రాంతం నిలిచింది. ఫిట్‌నెస్‌కు ప్రజల్లో ప్రాధాన్యత పెరిగింది. సామాజిక మాధ్యమాలు, సైక్లింగ్‌ క్లబ్‌లు కుర్రకారునే కాదు అన్ని వయస్కుల వారికీ సైక్లింగ్‌ పట్ల ఆసక్తిని పెంచేలా చేస్తున్నాయి. వందలాది కిలోమీటర్ల ప్రయాణంతో కూడిన అడ్వెంచర్‌ టూర్లు పట్టణ వాసులకు మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తున్నాయి.

వెరశి ప్రీమియం సైకిళ్లకు గిరాకీని తెచ్చిపెడుతున్నాయి. ఆసియాలో తొలిసారిగా సైకిల్‌ హైవే ఉత్తర ప్రదేశ్‌లోని ఇటావా–ఆగ్రా మధ్య 207 కిలోమీటర్లలో ఏర్పాటైంది. హైవేకు సమాంతరంగా ఏడు అడుగుల వెడల్పుతో దీనిని నిర్మించారు. సైక్లింగ్‌ను ప్రోత్సహించాలంటే నగరాల్లో ప్రత్యేక ట్రాక్‌ల ఏర్పాటు తప్పనిసరి చేయాలని హీరో సైకిల్స్‌ సీఎండీ పంకజ్‌ ముంజల్‌ తెలిపారు. అలాగే రూ.5 వేల లోపు సైకిళ్లకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

టూ వీలర్లకు పోటీగా..
దేశవ్యాప్తంగా టూ వీలర్‌ మార్కెట్‌లో 2015–16లో 1.64 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. నువ్వా నేనా అన్నట్టు ఈ రంగానికి సమంగా సైకిళ్ల విపణి పోటీ పడుతోంది. గతేడాదిలో సుమారు 1.6–1.7 కోట్ల యూనిట్ల సైకిళ్లు రోడ్డెక్కాయి. ఇందులో 20 లక్షల యూనిట్ల దాకా స్థానికంగా అసెంబుల్‌ చేసినవే. మొత్తం విపణిలో రూ.5 వేల లోపు ధరల విభాగం వాటా 90% దాకా ఉంది. 2016 ఏప్రిల్‌–అక్టోబరు మధ్య 5% వృద్ధి నమోదైంది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత నవంబరులో అమ్మకాలు 30% తగ్గాయని పంకజ్‌ ముంజల్‌ వెల్లడించారు. జనవరిలోనే విక్రయాలు తిరిగి పుంజుకుంటాయని ఏవన్‌ సైకిల్స్‌ జేఎండీ రిషి పాహ్వా తెలిపారు. కస్టమర్లు సైకిళ్ల నుంచి టూ వీలర్లకు మళ్లడం వల్లే రూ.5 వేలలోపు విభాగంలో పెద్దగా వృద్ధి లేదని టీఐ సైకిల్స్‌ ప్రెసిడెంట్‌ అరుణ్‌ అలగప్పన్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు వెల్లడిం చారు. పిల్లలు, విద్యార్థుల నుంచి సైకిళ్లకు డిమాండ్‌ కొనసాగుతోందని చెప్పారు. మొత్తం విపణిలో గ్రామీణ ప్రాంతాల వాటా 60 శాతంగా ఉంది.

ధరలు పెరిగే చాన్స్‌..
స్టీలు ధర టన్నుకు రూ.10,000 దాకా పెరిగిందని టీఐ సైకిల్స్‌ అంటోంది. రూ.5 వేల లోపు సైకిళ్లన్నీ స్టీల్‌తో తయారైనవే. కొద్ది రోజుల్లో ధరలు 3–4 శాతం అధికమయ్యే చాన్స్‌ ఉందని సమాచారం. ప్రీమియం మోడళ్లు అల్యూమినియంతో రూపొందుతున్నాయి. రూ.1 లక్ష ఆపైన మోడళ్లన్నీ కూడా ఖరీదైన ముడి పదార్థం కార్బన్‌తో తయారవుతున్నాయి. కస్టమైజేషన్‌కు చాన్స్‌ ఉన్న రిడ్లే మోడళ్ల ధర రూ.5 లక్షలపై మాటే. యూరప్‌ నుంచి కంపెనీ ప్రతినిధులు వచ్చి కస్టమర్లకు శిక్షణ ఇస్తారు కూడా. టీఐ సైకిల్స్‌ రిడ్లే సైకిళ్లను విక్రయిస్తోంది. ఇక వినియోగదార్ల పరంగా చూస్తే పురుషులు, బాలురు ఏకంగా 75 శాతం సైకిళ్లను సొంతం చేసుకున్నారు.

ఖరీదైన మోడళ్లదే హవా..
సైకిళ్లలో రూ.5–12 వేల ధర గల ప్రీమియం శ్రేణి వృద్ధి 30 శాతం దాకా నమోదవుతోంది. రూ.12 వేలు, ఆపైన ధర గల హై ఎండ్‌ ఏకంగా 50# పెరుగుతోంది. హై ఎండ్‌లో ఏటా 3 లక్షల యూనిట్లు భారత్‌లో రోడ్లపై దూసుకెళ్తున్నాయి. వీటిలో 35,000 సైకిళ్లు పూర్తిగా విదేశీ బ్రాండ్లే అవడం విశేషం. బైక్‌ మాదిరి గేర్లు, విభిన్న డిజైన్లు, అధిక మన్నిక, తేలికగా ఉండడం ఖరీదైన మోడళ్ల ప్రత్యేకత. అందుకే ఇవి కస్టమర్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. బియాంకీ, కనొండేల్, మాంగూస్, ష్విన్‌ వంటి బ్రాండ్లు పోటీలో ఉన్నాయి. రూ.10 లక్షల విలువ చేసే సైకిళ్లూ ఇక్కడి రోడ్లపై హుందాను ఒలకబోస్తున్నాయట.

20 దాకా విదేశీ బ్రాండ్లు దేశంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వాయిదా చెల్లింపుల్లో హై ఎండ్‌ మోడళ్లను తీసుకునే వారే ఎక్కువ. ఇక దేశీయంగా హీరో, టీఐ, ఏవన్, అట్లాస్‌ తదితర బ్రాండ్లతోసహా 40 దాకా స్థానిక కంపెనీలు పోటీపడుతున్నాయి. 2020 నాటికి బేసిక్‌ మోడళ్ల విభాగంలో పెద్దగా వృద్ధి ఉండకపోవచ్చు. రూ.5 వేలు ఆపైన ధర గల మోడళ్ల అమ్మకాల్లో అధిక పెరుగుదల ఉంటుందని అరుణ్‌ వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement