హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో భాగ్యనగరం సిగలో మరో కలికితురాయి చేరింది. మానవ రహిత విమానాల (యూఏవీ) తయారీకి హైదరాబాద్ కేంద్రం అయింది. విభిన్న రంగాల్లో ఉన్న అదానీ గ్రూప్... తన అనుబంధ సంస్థ అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ద్వారా ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ఇజ్రాయెల్ దిగ్గజం ఎల్బిట్ సిస్టమ్స్‌తో కలిసి సంయుక్తంగా శంషాబాద్ సమీపంలో 20 ఎకరాల్లో అదానీ ఎల్బిట్ యూఏవీ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ హెర్మెస్ 900 యూఏవీలను రూపొందిస్తారు. వీటిని భారత్‌తోపాటు వివిధ దేశాల్లోని ఎల్బిట్ కస్టమర్లకు విక్రయిస్తారు. భారత్‌లో ప్రైవేటు రంగంలో అన్–మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్ (యూఏవీ) తయారీకి ఏర్పాటు చేసిన తొలి కేంద్రం ఇది. అలాగే ఎల్బిట్ సిస్టమ్స్ ఇజ్రాయెల్ వెలుపల ఏర్పాటు చేసిన ఉత్పత్తి కేంద్రం కూడా ఇదే. అదానీ ఏరోస్పేస్ పార్క్ సైతం ఇక్కడ కొలువుదీరింది. అదానీ, ఎల్బిట్ ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఈ రెండు కేంద్రాలను తెలంగాణ హోం శాఖ మంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ ప్రారంభించారు.
ప్రపంచంలో 15 దేశాల్లో..
అత్యాధునిక హెర్మెస్ 900 యూఏవీలను ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లోని సైన్యం నిఘా, ఇంటెలిజెన్స్ కోసం విజయవంతంగా వినియోగిస్తోంది. 150 యూఏవీల కోసం ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఆఫర్ చేసిన టెండర్లలో అదానీ ఎల్బిట్‌ల జాయింట్ వెంచర్ పోటీపడుతోంది. ఇక హైదరాబాద్ సెంటర్‌లో తొలి ఉత్పాదన మార్చికల్లా సిద్ధం కానుంది. తొలుత ఏటా నాలుగు వాహనాలను తయారు చేస్తారు. 2020 చివరికల్లా ప్లాంటు సామర్థ్యం ఏడాదికి 18 వెహికిల్స్ స్థాయికి చేరనుందని అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ హెడ్ ఆశిష్ రాజవంశీ మీడియాకు వెల్లడించారు. కాంప్లెక్సులో 110 మంది ఇంజనీర్లు, టెక్నికల్ సిబ్బంది పనిచేస్తున్నట్టు చెప్పారు. ట్రైనింగ్, ఆర్‌అండ్‌డీ సెంటర్ స్థాపిస్తున్నామని, పరిశ్రమకు అవసరమైన మానవ వనరులకు ఇక్కడ శిక్షణ ఇస్తామని వివరించారు. 2019 సెప్టెంబరు నుంచి హెలికాప్టర్ల గేర్స్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్స్ తయారు చేస్తామన్నారు. హైదరాబాద్ సెంటర్‌కు సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసినట్టు ఎల్బిట్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ బెజలెల్ మెషిలిస్ వెల్లడించారు.
హైదరాబాద్‌లో యూఏవీల తయారీ
Published Sat, Dec 15 2018 5:29 AM | Last Updated on Sat, Dec 15 2018 5:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment