
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి రెండింతలై 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. కచ్చితమైన పన్ను వ్యవస్థతో ప్రభుత్వ రాబడి పెరుగుతుందని చార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ ఐసీఏఐ వజ్రోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదార్లుకు, ప్రభుత్వానికి మధ్య చార్టర్డ్ అకౌంటెంట్లు వారధిగా పనిచేయాలని పిలుపు ఇచ్చారు. ఆర్థిక ఆరోగ్యాన్ని పరిరక్షించే సీఏలు వైద్యుల వంటి వారని గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి పీపీ చౌదరి ప్రస్తావించారు.
సీఎలు తమ అద్భుత ఆర్థిక నైపుణ్యాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందారని చెప్పారు. ప్రభుత్వం నల్లధనం నిరోధించేందుకు పలు చర్యలు చేపడుతోందని అన్నారు. ఈ చర్యల అమలుకు చార్టర్డ్ అకౌంటెంట్లు సహకరించాలని, సమాజం నుంచి అవినీతి పద్ధతులను తీసివేసేందుకు చొరవ చూపాలని మంత్రి పిలుపు ఇచ్చారు.
నిజాయితీతో కూడిన మార్గాన్ని అనుసరించాలని సీఎలు తమ క్లయింట్లకు సూచించాలని కోరారు. నల్లధనానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పోరాటం కొనసాగుతుందని, 2.25 లక్షల సూట్‌కేసు కంపెనీలను గుర్తించిందని, వీటిపై తగిన చర్యలు చేపడతామని చెప్పారు.
'