ICAI
-
హైదరాబాద్‌లో ఐసీఏఐ రిసర్చ్ హబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) హైదరాబాద్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిసర్చ్ హబ్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు, ఆర్థిక అక్షరాస్యత, విధాన రూపకల్పనలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర, సులభతర వ్యాపారంతో కూడిన సుపరిపాలన తదితర అంశాలపై ఈ కేంద్రం లోతైన అధ్యయనాలను నిర్వహిస్తుందని ఐసీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పరిశోధన కార్యక్రమాల ద్వారా వెల్లడైన అంశాలను ప్రభుత్వంతో పంచుకుంటామని వివరించింది. కాగా, సెంటర్ డైరెక్టర్, డీన్‌గా నుపుర్ పవన్ బంగ్ను ఐసీఏఐ నియమించింది. జైపూర్‌లోనూ ఐసీఏఐకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. కోల్‌కతలో ఇటువంటి కేంద్రాన్ని 2025 జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా మరో ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను నెలకొల్పాలని ఐసీఏఐ యోచిస్తోంది. దాదాపు 9.85 లక్షల మంది విద్యార్థులు, 4 లక్షల మంది సభ్యులతో ఐసీఏఐ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ అకౌంటెన్సీ సంస్థ కావడం విశేషం. -
సత్యం కుంభకోణం.. ఇద్దరు సీఏల సభ్యత్వం రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : సత్యం కుంభకోణంతో సంబంధం ఉన్న ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్ల సభ్యత్వాన్ని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) రద్దు చేసింది. హైదరాబాద్‌కు చెందిన పులవర్తి శివప్రసాద్, సీహెచ్ రవీంద్రనాథ్‌లు ఐసీఏఐ నిబంధనలు మీరి వృత్తిపరమైన అవకతవకలకు పాల్పడ్డారని వారి సభ్యత్వం రద్దుతోపాటు చెరో రూ.5లక్షల జరిమానా విధిస్తూ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై వారిద్దరూ అప్పీలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లగా కమిటీ సిఫార్సును సమర్థించింది. దీంతో వారిద్దరూ రూ.5లక్షలు జరిమానా ఐసీఏఐకి చెల్లించి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఢిల్లీ కోర్టు వారిద్దరి పిటిషన్లు కొట్టివేయడంతో ఐసీఏఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పులవర్తి శివప్రసాద్ (సభ్యతం–204076) , సీహెచ్ రవీంద్రనాధ్ (సభ్యత్వం–204494)ల పేరు సభ్యుల రిజిస్టర్ నుంచి తొలగిస్తున్నామని, ఇది డిసెంబరు 27, 2023 నుంచి అమలులోకి వస్తుందని ఐసీఏఐ బుధవారం పేర్కొంది. ఈ మేరకు సంస్థ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. -
2030 నాటికి మూడో ఆర్థిక శక్తిగా భారత్
మాదాపూర్: ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 2030 నాటికి మూడో ఆర్థిక శక్తిగా ఎదగనుందని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయమంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ అన్నారు. మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో మంగళవారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) 2023 స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ 2047 నాటికి మనదేశం నెంబర్‌వన్‌గా నిలుస్తుందన్నారు. సీఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఆయన పట్టాలను అందజేశారు. ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై చర్చలు నిర్వహించే జీ–20 దేశ సమావేశాల్లో ఐసీఏఐ కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ఐసీఏఐ అధ్యక్షుడు దేబాషిన్ మిత్రా మాట్లాడుతూ ఎంతో క్లిష్టమైన సీఏ ఉత్తీర్ణులైన విద్యా ర్థుల్లో 42% మహిళలే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఐ ఉపాధ్యక్షుడు అనికేత్ సునీల్ తలాటి, ఐసీఏఐ కౌన్సిల్ సభ్యులు శ్రీధర్ ముప్పాల, ప్రతినిధులు సుశీల్‌కుమార్ గోయల్, ప్రసన్నకు మార్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. -
ఐసీఏఐ ప్రెసిడెంట్‌గా విజేందర్ శర్మ
న్యూఢిల్లీ: 2022- 23కి గాను ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కొత్త ప్రెసిడెంట్‌గా విజేందర్ శర్మ, వైస్-ప్రెసిడెంట్‌గా రాకేశ్ భల్లా ఎన్నికయ్యారు. లా గ్రాడ్యుయేట్, ఐసీఏఐ ఫెలో మెంబర్ అయిన శర్మ 1998 నుండి కాస్ట్ అకౌంటెంట్‌గా సేవలు అందిస్తున్నారు. 2017 జనవరి నుండి ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఫైనాన్స్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో 22 ఏళ్ల అనుభవం ఉన్నట్లు ఐసీఏఐ తెలిపింది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన భల్లా .. ఐసీఏఐ ఫెలో మెంబర్‌గా ఉన్నారు. -
ఆర్థిక వ్యవస్థ పరిరక్షణలో సీఏల పాత్ర కీలకం
మాదాపూర్ (హైదరాబాద్): దేశ ఆర్థిక వ్యవస్థ పరిరక్షణలో సీఏల పాత్ర కీలకమైందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో గురువారం జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖాతాదారులను సరైన మార్గంలో నడిపించే బాధ్యత చార్టెడ్ అకౌంటెంట్లపై ఉంటుందన్నారు. పన్నులు కట్టడాన్ని తగ్గించే ప్రయత్నం చేయకూడదని సూచించారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం సజావుగా అమలు అయ్యేలా చూడటంలో సీఏలది ముఖ్య భూమిక అని, ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలుగల దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉందని అన్నారు. భారత్ అప్పు తీసుకునే దశ నుంచి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతోందన్నారు. జీ–20 దేశాల సదస్సు ఈ ఏడాది భారత్‌లోనే జరుగుతుందని, ఆర్థిక రంగానికి సంబంధించిన పలు సమా వేశాలను హైదరాబాద్‌లో కూడా నిర్వహించనున్నారని తెలిపారు. ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు ముప్పల శ్రీధర్ మాట్లాడుతూ.. సీఏ కోర్సు పూర్తి చేసిన వారికి అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వృత్తిలో నైతిక విలువలను పాటిస్తూ, అంకిత భావంతో పనిచేయాలని కోరారు. అనంతరం సీఏ కోర్సులను పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు దయానివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
‘సీఏ’ పరీక్షలు వాయిదా
సాక్షి, గుంటూరు: కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్డౌన్ నేపథ్యంలో మేలో జరగాల్సిన సీఏ కోర్సులకు సంబంధించిన వివిధ పరీక్షలు వాయిదాపడ్డాయి. మే 2వ తేదీ నుంచి 18 వరకూ జరగాల్సిన పరీక్షలను రీ–షెడ్యూల్ చేస్తున్నట్టు న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) శుక్రవారం ప్రకటించింది. న్యూఢిల్లీలోని ఐసీఏఐ ప్రకటించిన రీ–షెడ్యూల్ తేదీలు.. జూన్ 27, 29, జూలై 1, 3వ తేదీల్లో సీఏ ఫౌండేషన్ కోర్సులో పాత విధానం ప్రకారం పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియెట్ (ఐపీసీ) కోర్సు పాత విధానాన్ని అనుసరించి గ్రూప్–1 విభాగంలో జూన్ 20, 22, 24, 26వ తేదీల్లోనూ, గ్రూప్–2 విభాగంలో జూన్ 28, 30, జూలై 2వ తేదీల్లో జరగనున్నాయి. కొత్త విధానాన్ని అనుసరించి గ్రూప్–1 విభాగంలో జూన్ 20, 22, 24, 26వ తేదీలు, గ్రూప్–2 విభాగంలో జూన్ 28, 30, జూలై 2వ, 4వ తేదీల్లో జరగనున్నాయి. సీఏ–ఫైనల్ కోర్సు పరీక్షలు పాత విధానం.. గ్రూప్–1 విభాగంలో జూన్ 19, 21, 23, 25వ తేదీల్లోనూ, గ్రూప్–2 విభాగంలో జూన్ 27, 30, జూలై 2వ, 4వ తేదీల్లో జరగనున్నాయి. సీఏ–ఫైనల్ కొత్త విధానంలో పరీక్షలు గ్రూప్–1 విభాగంలో జూన్ 19, 21, 23, 25 తేదీల్లో, గ్రూప్–2 విభాగ పరీక్షలు జూన్ 27, 29, జూలై 1, 3వ తేదీల్లో జరగనున్నాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్ లా అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పార్ట్–1 పరీక్షలు గ్రూప్–ఏ విభాగంలో జూన్ 20, 22, గ్రూప్–బి విభాగంలో జూన్ 24, 26వ తేదీల్లో జరగనున్నాయి. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ – అసెస్మెంట్ టెస్ట్ పరీక్ష జూన్ 27, 29వ తేదీల్లో జరుగుతాయి. దేశ వ్యాప్తంగా 207 ప్రధాన నగరాలు, పట్టణాల్లో జరగనున్న సీఏ పరీక్షలకు దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. -
త్వరలోనే ఐసీఏఐ.. ఏసీఎంఏఐగా మార్పు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)గా ఉన్న చార్టెర్డ్ అకౌంటింగ్స్ బాడీ.. త్వరలోనే ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ)గా మారనుంది. దీనికి సంబంధించి కేంద్రం ప్రత్యేక పార్లమెంటరీ చట్టాన్ని రూపొందిస్తోందని సౌత్ ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్ (ఎస్‌ఏఎఫ్‌ఏ) ప్రెసిడెంట్ డాక్టర్ పీవీఎస్ జగన్మోహన్ రావు తెలిపారు. 1949లో చార్టెర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ కింద ఐసీఏఐను చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 80 వేలకు పైగా సభ్యులున్నారు. గురువారమిక్కడ ఎస్‌ఏఎఫ్‌ఏ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంపెనీల అకౌంటింగ్, ఆడిటింగ్, ఎథిక్స్ విభాగాల్లో ఎస్‌ఏఎఫ్‌ఏ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ఎనిమిది సార్క్ దేశాల్లో అకౌంటింగ్, కాస్ట్ మేనేజ్మెంట్ ప్రొఫిషనల్స్ తయారీ, నిర్వహణ వంటి వాటిల్లో ఎస్‌ఏఎఫ్‌ఏ పనిచేస్తుందని.. నేపాల్, ఆప్ఘనిస్తాన్, భూటాన్, మాల్దీవుల్లో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ బాడీని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ఎస్‌ఏఎఫ్‌ఏలో 3.50 లక్షల మంది సభ్యులున్నారు. ఇక నుంచి ప్రతి ఏటా ఫౌండేషన్ డేను నిర్వహిస్తామని, ఫౌండేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి దేశంలో ఈ కార్యక్రమం జరుగుతుందని’’ వివరించారు. ఈ కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ నేపాల్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్ ఆచార్య, సార్క్ దేశాల నుంచి 150 మంది సీఏలు, సీఎంఏలు పాల్గొన్నారు. -
ఐఎల్ఎఫ్ఎస్ ఖాతాలు మళ్లీ మదింపు
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఖాతాలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మరోసారి మదింపు చేయనుంది. ఈ కేసులో ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఐసీఏఐ అకౌంటింగ్ రీసెర్చ్ ఫౌండేషన్ విభాగం దీన్ని చేపట్టనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. 2012–13 నుంచి 2017–18 మధ్య కాలానికి సంబంధించి కంపెనీల చట్టంలోని సెక్షన్ 130 కింద (ఆర్థిక అవకతవకలు) ఐఎల్ఎఫ్ఎస్, ఐఎల్ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్ ఖాతాలను, ఆర్థిక ఫలితాలను మరోసారి మదింపు చేయాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ జనవరి 1న ఆదేశించడం తెలిసిందే. వీటికి అనుగుణంగానే ఐసీఏఐ తాజాగా ప్రక్రియ చేపట్టనుంది. పాత మేనేజ్మెంట్ హయాంలో పద్దుల్లో అవకతవకలు జరిగాయని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో), ఐసీఏఐ గత నివేదికల్లో సూచనప్రాయంగా వెల్లడించటం తెలిసిందే. ఖాతాల్ని మరోసారి మదించటానికి ఆర్బీఐ, సెబీ వంటి నియంత్రణ సంస్థలు అనుమతించినా.. ఆయా పద్దులు, ఆర్థిక ఫలితాలు కంపెనీ రూపొందించినవేనని, తమకు సంబంధం లేదని ఎస్ఆర్బీసీ అండ్ కో తదితర ఆడిటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎల్ఎఫ్ఎస్ దాదాపు రూ.90,000 కోట్ల మేర బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు బాకీపడింది. 22 సంస్థలపై ఆంక్షల తొలగింపు ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్‌లో కాస్త మెరుగ్గా ఉన్న 22 కంపెనీలు రుణాలపై వడ్డీల చెల్లింపును కొనసాగించేందుకు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) అనుమతించింది. అలాగే గ్రూప్ దివాలా పరిష్కార ప్రక్రియ పర్యవేక్షణకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ నియామకాన్ని కూడా ఆమోదిస్తూ జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య బెంచి నిర్ణయం తీసుకుంది. అటు విదేశాల్లో ఏర్పాటైన 133 సంస్థలపైనా మారటోరియం ఎత్తివేసి, దివాలా పరిష్కార ప్రక్రియలో భాగం అయ్యేలా ఉత్తర్వులు ఇచ్చింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ రుణ పరిష్కార ప్రణాళికను కార్పొరేట్ వ్యవహారాల శాఖ గత నెలలో సమర్పించింది. దీని ప్రకారం.. ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉన్న కంపెనీలను ఆకుపచ్చ రంగులోనూ, కొంత తీవ్రత ఉన్న వాటిని కాషాయ రంగు, తీవ్రంగా ఉన్న వాటిని ఎరుపు రంగులోనూ వర్గీకరించింది. ఎరుపు వర్ణంలోనివి కనీసం సీనియర్ సెక్యూర్డ్ రుణదాతలకు కూడా చెల్లింపులు జరపలేని పరిస్థితుల్లో ఉన్నాయి. -
ఏడేళ్లలో రెండింతలు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి రెండింతలై 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. కచ్చితమైన పన్ను వ్యవస్థతో ప్రభుత్వ రాబడి పెరుగుతుందని చార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ ఐసీఏఐ వజ్రోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదార్లుకు, ప్రభుత్వానికి మధ్య చార్టర్డ్ అకౌంటెంట్లు వారధిగా పనిచేయాలని పిలుపు ఇచ్చారు. ఆర్థిక ఆరోగ్యాన్ని పరిరక్షించే సీఏలు వైద్యుల వంటి వారని గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి పీపీ చౌదరి ప్రస్తావించారు. సీఎలు తమ అద్భుత ఆర్థిక నైపుణ్యాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందారని చెప్పారు. ప్రభుత్వం నల్లధనం నిరోధించేందుకు పలు చర్యలు చేపడుతోందని అన్నారు. ఈ చర్యల అమలుకు చార్టర్డ్ అకౌంటెంట్లు సహకరించాలని, సమాజం నుంచి అవినీతి పద్ధతులను తీసివేసేందుకు చొరవ చూపాలని మంత్రి పిలుపు ఇచ్చారు. నిజాయితీతో కూడిన మార్గాన్ని అనుసరించాలని సీఎలు తమ క్లయింట్లకు సూచించాలని కోరారు. నల్లధనానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పోరాటం కొనసాగుతుందని, 2.25 లక్షల సూట్‌కేసు కంపెనీలను గుర్తించిందని, వీటిపై తగిన చర్యలు చేపడతామని చెప్పారు. ' -
భారీ రుణ గ్రహీతల వివరాలివ్వండి
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి రూ.2,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న వారి వివరాలివ్వాలని ఆర్బీఐని కోరింది. సదరు జాబితాను ఐసీఏఐకి చెందిన ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డు పరిశీలించి, అకౌంటింగ్, ఆడిటింగ్ ప్రమాణాల ఉల్లంఘనకు ఏమైనా అవకాశం ఉందా అన్నది తేలుస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు పీఎన్బీ, గీతాంజలి జెమ్స్ ఆడిటర్లకు ఐసీఏఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే, సెబీ, సీబీఐ, ఈడీలు తమ దర్యాప్తు వివరాలను ఐసీఏఐతో పంచుకోవాలని ఆదేశించాలంటూ కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖకు లేఖ రాసినట్టు పేర్కొంది. -
బిట్‌కాయిన్స్‌పై ఐసీఏఐ అధ్యయనం
కోల్‌కతా: బిట్‌కాయిన్స్ వంటి క్రిప్టోకరెన్సీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వీటిపై అధ్యయనం చేయనుంది. క్రిప్టో కరెన్సీలపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం సూచించడంతో ఈ సమగ్ర అధ్యయనం చేపడుతున్నట్లు ఐసీఏఐ సభ్యుడు (డిజిటల్ అకౌంటింగ్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్ బోర్డ్) దెబాశిష్ మిత్రా తెలిపారు. ‘‘ఈ ఏడాది మార్చికల్లా కంపెనీ వ్యవహారాల శాఖకు దీనిపై నివేదిక సమర్పించే అవకాశముంది. దీనికోసం ఆయా అంశాలపై పట్టు ఉన్న సంస్థల అభిప్రాయాలు కూడా తీసుకుంటాం’’ అని మిత్రా వివరించారు. కార్పొరేట్ గవర్నెన్స్, కంపెనీల చట్టంపై సీఐఐ నిర్వహించిన సెమినార్లో పాల్గొన్న సందర్భంగా మిత్రా ఈ విషయాలు చెప్పారు. -
టాటా కంపెనీలపై మిస్త్రీ ఆరోపణలు... ఐసీఏఐ దృష్టి
న్యూఢిల్లీ: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తాజాగా టాటా గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై దృష్టి సారించింది. పలు టాటా గ్రూప్ కంపెనీల్లో అకౌంటింగ్ సంబంధిత అంశాల్లో అవకతవకలు జరిగాయని మిస్త్రీ లేవనెత్తిన ఆరోపణలను పరిశీలిస్తున్నామని ఐసీఏఐ తెలిపింది. దీనితోపాటు యునైటెడ్ స్పిరిట్స్‌కు సంబంధించిన అకౌంటింగ్ అంశాలను కూడా క్షుణ్ణంగా శోధిస్తున్నామని పేర్కొంది. వెలువడిన ఆరోపణలపై దృష్టి కేంద్రీకరించాలని ఇప్పటికే తాము ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డు (ఎఫ్‌ఆర్‌ఆర్‌బీ)ని కోరామని ఐసీఏఐకు కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ నీలేశ్ ఎస్ వికాంసే తెలిపారు. కాగా టాటా సన్స్ చైర్మన్‌గా మిస్త్రీని తొలగించిన తర్వాత ఆయన టాటా గ్రూప్‌కు చెందిన కొన్ని కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యలను లేవనెత్తుతూ, పలు ఇతర అంశాల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ బోర్డుతోపాటు సెబీతో సహా ఇతర నియంత్రణ సంస్థలకు లేఖలు రాశారు. -
రేపట్నుంచి హైదరాబాద్‌లో ఐసీఏఐ జ్ఞాన యజ్ఞ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ) తలపెట్టిన అంతర్జాతీయ సదస్సు ‘జ్ఞాన యజ్ఞ’ ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనుంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించే ఈ సదస్సులో సుమారు 3,500 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఐసీఏఐ ప్రెసిడెంట్ ఎం.దేవరాజ రెడ్డి గురువారమిక్కడ విలేకరులతో చెప్పారు. అంతర్జాతీయంగా అకౌంటింగ్ విధానాలు, దేశీ ప్రమాణాలను మెరుగుపర్చుకునే అంశాలు, జీఎస్టీ అమలు కానున్న నేపథ్యంలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర తదితర విషయాలపై ఇందులో చర్చించనున్నట్లు చెప్పారు. వివిధ రంగాల సంస్థల్లో చార్టర్డ్ అకౌంటెంట్ల అవసరాలు పెరుగుతున్న దరిమిలా ప్రస్తుతం 2.60 లక్షలుగా ఉన్న ఐసీఏఐ సభ్యుల సంఖ్య 2020 నాటికి ఆరు నుంచి పదిలక్షల దాకా పెరగగలదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అటు కోచింగ్ సెంటర్ల మాయమాటలతో ఔత్సాహిక విద్యార్థులు మోసపోకుండా ఉండేలా సీఏ కోర్సుపై అవగాహన పెంచేందుకు తామే ప్రత్యేకంగా కెరియర్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని దేవరాజ రెడ్డి తెలిపారు. -
నవంబర్ నుంచి సీఏ సిలబస్ మార్పు
- ఐసీఏఐ జాతీయ అధ్యక్షుడు దేవరాజ్ రెడ్డి వెల్లడి లబ్బీపేట: దేశవ్యాప్తంగా ఈ ఏడాది నవంబర్ నుంచి సీఏ సిలబస్‌లో మార్పులు తీసుకురానున్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) జాతీయ అధ్యక్షుడు ఎం.దేవరాజ్ రెడ్డి తెలిపారు. ఐసీఏఐ విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో ‘జ్ఞానశిఖర’ పేరుతో చార్టెడ్ అకౌంటెంట్స్ సబ్ రీజినల్ కాన్ఫరెన్స్ శనివారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేవరాజ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐసీఏఐ ఇచ్చే సిలబస్‌తో మూడేళ్లపాటు ప్రణాళికాబద్ధంగా ఆర్టికల్స్ చేస్తేనే సీఏ పూర్తి చేయడం సాధ్యమవుతుందన్నారు. రైల్వేలో డబుల్ అకౌంటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఐసీఏఐ విజయవాడ చాప్టర్ చైర్మన్ కె.శివరామకుమార్, వైస్ చైర్మన్ జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
డిగ్రీ తర్వాత ఏది బెటర్?!
గుంటూరు ఎడ్యుకేషన్: డిగ్రీ విద్య పూర్తి చేసిన తరువాతే సీఏ చదవడం ఉత్తమమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) జాతీయ అధ్యక్షుడు ఎం దేవరాజారెడ్డి విద్యార్థులకు సలహా ఇచ్చారు. ఐసీఏఐ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో బ్యాంక్ ఆడిట్‌పై మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చార్టర్డ్ అకౌంటెంన్సీ (సీఏ) చదవాలనే లక్ష్యం గల విద్యార్థులు ఇంటర్మీడియట్ కంటే డిగ్రీ పూర్తిచేసిన తరువాతే సీఏ కోర్సులో చేరడం మంచిదన్నారు. ఇంటర్మీడియెట్‌లో స్థాయిలో ఎంఈసీ కోర్సు అభ్యశించిన విద్యార్థులు ఇంటర్లో అత్యధిక మార్కులు సాధిస్తున్నప్పటికీ సీఏ-సీపీటీలో ఉత్తీర్ణత శాతం అత్యంత తక్కువగా ఉంటోందని చెప్పారు. ఇంటర్మీడియట్ దశలో విద్యార్థులు సీఏ కోర్సుపై పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోవడమే ఇందుకు కారణమన్నారు. గుంటూరు అమరావతిరోడ్డులోని ఐసీఏఐ శాఖకు సొంత భవన నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. సీఏలకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత రీతిలో ఉద్యోగావకాశాలు రానున్నాయని చెప్పారు. మార్కెట్ అవసరాలు, మారుతున్న వ్యాపార, వాణిజ్య రంగాలకు అనుగుణంగా విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఏ కోర్సు సిలబస్‌లో మార్పులు చేస్తున్నామని చెప్పారు. అనంతరం బ్యాంక్ ఆడిట్‌పై ఆడిటర్లకు అవగాహన కల్పించిన దేవరాజారెడ్డి సీఏ విద్యార్థులకు ఉపయోపడే సమాచారాన్ని అందించేందుకు ఐసీఏఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నాలెడ్జ్ కియోస్క్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్‌ఐఆర్‌సీ కౌన్సిల్ చైర్మన్ ఈ ఫల్గుణకుమార్, గుంటూరు శాఖ చైర్మన్ చేకూరి సాంబశివరావు, వైస్ చైర్మన్ చేగు అశోక్‌కుమార్, కార్యదర్శి కేవీ సుబ్బారావు, కోశాధికారి ఎం శ్రీనివాసరావు, సికాస చైర్మన్ ఎన్ శివరామకృష్ణ, సభ్యులు, ఆడిటర్లు, సీఏలు పాల్గొన్నారు. -
కంపెనీల చట్టాన్ని తిరగరాయాలి
ఐసీఐసీఐ బ్యాంకు చైర్మన్ ఎంకే శర్మ ముంబై : కంపెనీల చట్టంలో నిబంధనలను కఠినతరం చేయడమనేది ప్రమోటర్లకు శాపంగా మారిందని ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్‌గా కొత్తగా నియమితులైన ఎంకే శర్మ వ్యాఖ్యానించారు. సత్యం కంప్యూటర్స్, సహారా గ్రూప్ లాంటి కొన్ని కుంభకోణాల కేసుల వల్ల మిగతా అందరినీ శిక్షిస్తున్నట్లుగా ఉందని పేర్కొన్నారు. అభివృద్ధికి దోహదపడటం కన్నా కేవలం నిబంధనలపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన ఈ చట్టం.. కంపెనీల కోసం కన్నా, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్ల కోసమే రాసినట్లుగా కనిపిస్తోందన్నారు. డెరైక్టర్ల విధుల విషయంలోనూ నిబంధనలు తీవ్రంగా ఉన్నాయని శర్మ చెప్పారు. ఈ నేపథ్యంలో చట్టాన్ని తక్షణమే తిరగరాయాల్సిన అవసరం ఉంద ని పేర్కొన్నారు. ఇందుకోసం ఐసీఏఐ, ఐసీఎస్ఐ తదితర పరిశ్రమ వర్గాలతో మరోసారి సంప్రతింపులు జరపాలని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. చట్టం అనేది నియంత్రణ పాత్ర పోషిస్తూనే అభివృద్ధికి ఊతమిచ్చేలా కూడా ఉండాలని శర్మ అభిప్రాయపడ్డారు. ఆర్బీఐకి పూర్తిగా స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆయన పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో సర్వీస్ ట్యాక్స్‌పై సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సేవా పన్ను వసూళ్లలో ఎదరవుతున్న న్యాయపరమైన అడ్డంకులపై అవగాహన కల్పించడానికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సదస్సును నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో శనివారం జరిగే ఈ అవగాహనా సదస్సులో కేంద్ర కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్‌ట్యాక్స్ కమిషనర్ సునీల్ జైన్‌తో పాటు ఈ రంగానికి చెందిన ఇతర టెక్నికల్ స్పీకర్లు పాల్గొంటున్నట్లు ఐసీఏఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సదస్సులో పాల్గొనే సీఎంఏ మెంబర్స్ రూ. 800, ఇతర కార్పొరేట్ ప్రతినిధులు రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. -
ఐసిఎఐ వైఎస్ ప్రెసిడెంట్ దేవరాజారెడ్డికి సన్మానం!
-
ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ దేవరాజరెడ్డికి సన్మానం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఎం.దేవరాజరెడ్డికి ఆదివారంనాడిక్కడ ఘనంగా సన్మానం జరిగింది. ఐసీఏఐ హైదరాబాద్ చైర్మన్ కె.మతేష్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఐసీఏఐ 65 సంవత్సరాల చరిత్రలో ఒక తెలుగు వ్యక్తి ఈ పదవి దక్కించుకోవడం ఇదే మొదటి సారి. కాగా, 2016 నుంచి దేవరాజరెడ్డి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వృత్తిపరమైన అభివృద్ధి, ఆడిటింగ్, నైతిక ప్రమాణాలను మెరుగు పరచి ప్రపంచవ్యాప్తంగా సంస్థకు గుర్తింపు తీసుకువస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో రెండవ అతి పెద్ద అకౌంటింగ్ సంస్థ అయిన ఐసీఏఐకు దేవరాజ రెడ్డి వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులవడం గర్వించదగ్గ విషయమని మతేష్ రెడ్డి అన్నారు. -
ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్‌గా దేవరాజ రెడ్డి
ప్రెసిడెంట్‌గా మనోజ్ ఫాడ్నిస్ ఎంపిక హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్‌గా మనోజ్ ఫడ్నిస్, వైస్ ప్రెసిడెంట్‌గా ఎం.దేవరాజ రెడ్డి ఎంపికయ్యారు. 2015-16 సంవత్సరానికి గాను గవర్నింగ్ బాడీని సెంట్రల్ కౌన్సిల్ ఎన్నుకుంది. చార్టర్డ్ అకౌంటింగ్లో విశేష అనుభవం ఉన్న హైదరాబాద్‌కు చెందిన దేవరాజ రెడ్డి వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావ్వడంపై హైదరాబాద్ చాప్టర్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆయన వచ్చే ఏడాది ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఐసీఏఐలో కీలకమైన సెంట్రల్ కౌన్సిల్ మెంబర్‌గా దేవరాజ రెడ్డి 2010 నుంచి నిరంతరంగా కొనసాగుతున్నారు. 2010-13 కాలానికి ఒకసారి పనిచేసిన ఈయన 2013-16 కాలానికి కూడా సెంట్రల్ కౌన్సిల్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. -
మాస్టర్‌మైండ్స్‌కు జాతీయ ర్యాంకులు
గుంటూరు: ఐసీఏఐ బుధవారం విడుదల చేసిన సీఏ-ఐపీసీసీ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ సీఏ విద్యాసంస్థల విద్యార్థులు అఖిల భారత స్థాయి టాప్-50 ర్యాంకుల్లో 9 ర్యాంకులు సాధించి సంచలన విజయం నమోదు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక ర్యాంకులు కైవసం చేసుకున్న సంస్థగా మాస్టర్‌మైండ్స్ నిలిచింది. విద్యార్ధి జె. భిక్షాలు బాబు అఖిల భారతస్థాయిలో 9వ ర్యాంకు, కె.పవన్‌కుమార్ 24వ ర్యాంకు, కె.రవితేజ 25వ ర్యాంకు, పి.మధులిక 34వ ర్యాంకు, ఎస్.కార్తీక్ 34వ ర్యాంకు, టి.శ్రీకాంత్ 34వ ర్యాంకు, కె.రాజ్యవర్ధన్ రెడ్డి 39వ ర్యాంకు, వి.వెంకట రోహిత్ 41వ ర్యాంకు, వై.సాయి కిరణ్మయి 50వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా గుంటూరులో జరిగిన విలేకర్ల సమావేశంలో సంస్థ డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ విద్యార్థులను అభినందించారు. సీఏ ఫైనల్, ఫౌండేషన్, సీఏ-సీపీటీ, ఐపీసీసీ ఫలితాల్లో జాతీయ స్థాయి ర్యాంకులు కైవసం చేసుకుని తిరుగులేని విజయం అందుకున్నామని చెప్పారు. -
సీఏ విద్యార్థులకు టీవీ చానెల్
న్యూఢిల్లీ: చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) చదువుతున్న విద్యార్థుల కోసం ద ఇన్స్టిట్యూట్ ఆప్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఒక టెలివిజన్ ఛానెల్‌ను ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. దీంతో పాటు గ్లోబల్ టెక్నాలజీ సెంటర్‌ను, క్లౌడ్ క్యాంపస్‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా సీఏ విద్యార్ధులకు మరింత చేరువ కావడం లక్ష్యంగా ఇంటరాక్టివ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అందించాలనుకుంటున్నామని ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ కె. రఘు బుధవారం తెలిపారు. స్కామ్‌ల కట్టడికి పటిష్ట మార్గదర్శకాలు: ఐసీఏఐ కార్పొరేట్ కుంభకోణాలని కట్టడి చేసే దిశగా చార్టర్డ్ అకౌంటెంట్ల కోసం పటిష్టమైన మార్గదర్శకాలు రూపొందిస్తోంది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ). ఇందుకోసం కార్పొరేట్ వ్యవహారాల శాఖతో కలిసి పనిచేస్తోందని రఘు తెలిపారు. -
సీఏలకు సగటు వేతన ప్యాకేజీ రూ.7.3 లక్షలు
న్యూఢిల్లీ: సీఏలకు ఉద్యోగావకాశాలు బావున్నాయని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) తెలిపింది. 16 నగారాల్లో ఈ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించామని 624 మందికి పైగా సీఏలకు ఉద్యోగాలు లభించాయని పేర్కొంది. రూ.4 లక్షల నుంచి రూ.24.67 లక్షల వరకూ వేతన ప్యాకేజీలను 58 కంపెనీలు ఆఫర్ చేశాయి. సగటు వార్షిక ప్యాకేజీ రూ.7.3 లక్షలుగా ఉంది. ఐటీసీ, హిందూస్తాన్ యూనిలివర్, టీసీఎస్, విప్రో, మధుర ప్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, మారియట్ హోటల్స్ తదితర కంపెనీలు పాల్గొన్నాయి. -
సెప్టెంబర్‌లో సీఏ క్యాంపస్ ప్లేస్మెంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక వృద్ధిరేటు క్షీణిస్తున్నప్పటికీ అన్ని రంగాల నుంచి చార్టర్డ్ అకౌంటెంట్స్‌కి డిమాండ్ ఉందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఐసీఏఐ నిర్వహిస్తున్న క్యాంపస్ రిక్రూట్మెంట్స్కు అన్ని రంగాలకు చెందిన కంపెనీల నుంచి మంచి స్పందన వస్తోందని, కొన్ని కంపెనీలు గరిష్టంగా రూ.16 లక్షల వార్షిక వేతనం ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నాయని ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ విజయ్ కుమార్ గుప్తా తెలిపారు. సెప్టెంబర్10 నుంచి 13వ తేది వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న క్యాంపస్ ఇంటర్వ్యూ విషయాలను తెలియచేయడానికి శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో గుప్తా మాట్లాడుతూ సీఏలకు దేశంలో నాలుగు లక్షల నుంచి రూ.16 లక్షలకు వరకు వేతనం లభిస్తోందని, అదే విదేశాల్లో అయితే రూ.21 లక్షల వరకు వేతనం లభిస్తోందన్నారు. గత సంవత్సరం సగటున రూ.7.11 లక్షల వేతనం లభించినట్లుగా గుప్తా తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్లేస్మెంట్ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్, ఎస్ఆర్బీసీ అండ్ కో, బజాజ్ ఫైనాన్స్, ల్యాంకో వంటి 130 కంపెనీలు పాల్గొంటాయని అంచనా వేస్తున్నట్లు ఐసీఏఐ హైదరాబాద్ చీఫ్ కో-ఆర్డినేటర్ ఎం.దేవరాజ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ మధ్యనే సీఏ కోర్సును పూర్తి చేసిన 5,000 మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నామని, గడిచిన సంవత్సరం జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్లో 1,500 మందికి ఉద్యోగావకాశాలు లభించినట్లు తెలిపారు.