మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ఐసీఏఐ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
మాదాపూర్ (హైదరాబాద్): దేశ ఆర్థిక వ్యవస్థ పరిరక్షణలో సీఏల పాత్ర కీలకమైందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో గురువారం జరిగిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖాతాదారులను సరైన మార్గంలో నడిపించే బాధ్యత చార్టెడ్ అకౌంటెంట్లపై ఉంటుందన్నారు. పన్నులు కట్టడాన్ని తగ్గించే ప్రయత్నం చేయకూడదని సూచించారు.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం సజావుగా అమలు అయ్యేలా చూడటంలో సీఏలది ముఖ్య భూమిక అని, ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలుగల దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉందని అన్నారు. భారత్ అప్పు తీసుకునే దశ నుంచి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతోందన్నారు. జీ–20 దేశాల సదస్సు ఈ ఏడాది భారత్‌లోనే జరుగుతుందని, ఆర్థిక రంగానికి సంబంధించిన పలు సమా వేశాలను హైదరాబాద్‌లో కూడా నిర్వహించనున్నారని తెలిపారు.
ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు ముప్పల శ్రీధర్ మాట్లాడుతూ.. సీఏ కోర్సు పూర్తి చేసిన వారికి అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వృత్తిలో నైతిక విలువలను పాటిస్తూ, అంకిత భావంతో పనిచేయాలని కోరారు. అనంతరం సీఏ కోర్సులను పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్‌లను అందజేశారు. కార్యక్రమంలో ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు దయానివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment