
న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తులు, సామాన్యులు ఎక్కువగా వినియోగించే 200కుపైగా రకాల ఉత్పత్తులు కాస్త చౌకగా మారాయి. వీటీపై జీఎస్టీ తగ్గింపు బుధవారం (ఈ నెల 15) నుంచి అమల్లోకి వచ్చింది. షాంపూలు, డిటర్జెంట్లు, సౌందర్య ఉత్పత్తుల ధరలను సవరించినట్టు పెద్ద పెద్ద రిటైల్ మాల్స్ బోర్డులు పెట్టి మరీ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. చాక్లెట్లు, ఫర్నిచర్, చేతి గడియారాలు, కట్లరీ వస్తువులు, సూట్‌కేసులు, సెరామిక్ టైల్స్, సిమెంట్ ఆర్టికల్స్ ఇలా 200కుపైగా వస్తువులపై పన్ను రేటు తగ్గిస్తూ గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక మందగమన నేపథ్యంలో వ్యాపారులు, వినియోగదారులకు ఉపశమనం కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 178 నిత్యావసరాలను 28 శాతం పన్ను పరిధి నుంచి 18 శాతం పన్ను పరిధిలోకి మార్చారు. అన్ని రెస్టారెంట్లకు (ఏసీ, నాన్‌ఏసీ) ఏకరీతిన 5 శాతం పన్నుగా ఖరారు చేశారు. గతంలో ఏసీ రెస్టారెంట్లపై 18 శాతం పన్ను, నాన్‌ఏసీ రెస్టారెంట్లపై 12 శాతం పన్ను అమల్లో ఉంది. 28 శాతం పన్ను పరిధిలో 228 వస్తువులు ఉంటే వాటిని 50కి పరిమితం చేశారు. విలాస వస్తువులు, పొగాకు ఉత్పత్తులు, పెయింట్లు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు, కార్లు, బైక్‌లపైనే అధిక పన్ను ఉంది. మిగతా వాటిని 18, 12, 5 శాతం పన్ను పరిధిలోకి సర్దుబాటు చేశారు. చూయింగ్ గమ్, చాక్లెట్లు, కాఫీ, కస్టర్డ్ పౌడర్, మార్బుల్స్, గ్రానైట్, దంత సంరక్షణ ఉత్పత్తులు, పాలిష్‌లు, క్రీములు, శానిటరీవేర్, లెదర్ వస్త్రాలు, కృత్రిమ ఉన్ని, కుక్కర్లు, స్టవ్‌లు, బ్లేడ్స్, స్టోరేజీ వాటర్ హీటర్లు, బ్యాటరీలు, తదితర ఉత్పత్తులపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి దిగొచ్చింది. వైర్లు, కేబుల్స్, ఫర్నిచర్, పరుపులు, సూట్‌కేసులు, డిటర్జెంట్, షాంపూలు, మెయిర్ క్రీమ్, హెయిర్‌డై, ఫ్యాన్లు, రబ్బరు ట్యూబులు తదితర ఉత్పత్తులను 18 నుంచి 12 శాతానికి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment