
మార్కెట్లకు స్వల్ప నష్టాలు..
• నిరాశపరిచిన పారిశ్రామిక, ద్రవ్యోల్బణ గణాంకాలు
• 88 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
• నిఫ్టీకి 29 పాయింట్ల నష్టం
ముంబై: జూన్‌లో పారిశ్రామికోత్పత్తి మందగించడం, ద్రవ్యోల్బణం రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడంతోపాటు... జపాన్ రెండో త్రైమాసికపు జీడీపీ గణాంకాలు నిరుత్సాహపరచడంతో మార్కెట్లు మంగళవారం స్వల్పంగా నష్టాలు చవిచూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 88 పాయింట్ల నష్టంతో 28,064.61 వద్ద ముగియగా.... నిఫ్టీ సైతం 29.60 పాయింట్లను కోల్పోయి 8,642.55 వద్ద ముగిసింది. ఉదయం మార్కెట్లు సానుకూలంగానే ప్రారంభమైనా హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాల రాకతో ఆ ఉత్సాహం ఎంతో సేపు నిలువలేదు.
సెన్సెక్స్ 28,199 పాయింట్ల గరిష్ట స్థాయికి వెళ్లినా చివరికి క్రితం ముగింపుతో పోలిస్తే 88 పాయింట్లు కోల్పోయి 28,064 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 29.60 పాయింట్ల నష్టంతో 8,642 వద్ద స్థిరపడింది. పారిశ్రామికోత్పత్తి జూన్‌లో గతేడాది ఇదే నెలతో పోలిస్తే 2.1శాతానికి తగ్గడం, రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం పెరగడం మార్కెట్లను నిరుత్సాహపరిచినట్టు జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ అన్నారు.
ఎఫ్‌ఐఐల వాటాః రూ.20 లక్షల కోట్లు: ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడుల వాటా విలువ ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ.20.13 లక్షల కోట్లుగా ఉంది. ఇక జనవరి-మార్చి త్రైమాసికంలో ఎఫ్‌ఐఐ హోల్డింగ్స్ రూ.18.37 లక్షల కోట్లు.