ప్రపంచ ట్రెండ్తో ర్యాలీకి బ్రేక్
♦ 69 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
♦ నిఫ్టీ 20 పాయింట్లు డౌన్
ముంబై: ప్రపంచ ట్రెండ్ ప్రతికూలంగా వుండటంతో పాటు కొన్ని కార్ల మోడల్స్ సేఫ్టీ క్రాష్ టెస్ట్‌లో ఫెయిలయ్యాయన్న వార్తలతో మార్కెట్ ర్యాలీకి బుధవారం బ్రేక్‌పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 69 పాయింట్ల క్షీణతతో 25,705 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల తగ్గుదలతో 7,870 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ముందుగానే వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు తాజాగా ఏర్పడటంతో ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి.
దాంతో భారత్ సూచీలు 1 శాతం వరకూ క్షీణతతో మొదలైనా, ముగింపు సమయంలో షార్ట్ కవరింగ్ ఫలితంగా కొంతవరకూ కోలుకున్నాయి. మూడేళ్లలో ఎన్నడూలేని విధంగా గత ఏప్రిల్ నెలలో అమెరికా వినియోగధరలు పెరిగినట్లు గణాంకాలు వెలువడటంతో ఫెడ్ వడ్డీ రేట్లను త్వరలోనే పెంచవచ్చన్న అంచనాలు నెలకొన్నాయని బీఎన్‌పీ పారిబాస్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ శ్రేయాష్ దేవల్కర్ చెప్పారు.
ఆటో షేర్లకు దెబ్బ....
ఆటో షేర్లు నష్టాలతో ముగిసాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే ఆటో సూచీ అధికంగా 1.28 శాతం నష్టపోయింది. సెలెరియా, ఎకో మోడల్స్ క్రాష్ టెస్ట్‌లో విఫలమైనట్లు సేఫ్టీ గ్రూప్ ఎన్‌సీఏపి ప్రకటించడంతో మారుతి సుజుకి 0.8 శాతం తగ్గింది. బజాజ్ ఆటో, మహీంద్రా, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్ షేర్లు 1-2 శాతం మధ్య తగ్గాయి. బీహెచ్‌ఈఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలీవర్‌లు 1 శాతం వరకూ క్షీణించాయి.