తగ్గే వడ్డీ రేటుతో లాభం పొందేదిలా
రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు తగ్గనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం దిగి వస్తుండటం నేపథ్యంలో ఆర్థిక వృద్ధికి తోడ్పాటునిచ్చేందుకు ఆర్‌బీఐ ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని ఇప్పటికే సూచనప్రాయంగా చెప్పింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో డెట్ మార్కెట్‌లో ప్రయోజనాలు ఎలా పొందవచ్చన్నది తెలిపేదే ఈ కథనం.
ప్రధానంగా ధరల కట్టడి కోసమే ఆర్‌బీఐ కఠిన పరపతి విధానాన్ని అమలు చేస్తోంది. తాజాగా వెలువడుతున్న ద్రవ్యోల్బణ గణాంకాలు కాస్త ఉపశమనం కలిగించే విధంగానే ఉన్నాయి. రాబోయే 4-6 నెలల్లో వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ 5.5 శాతం - 6.5 శాతం మధ్య స్థిరపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఆర్‌బీఐ రెపో రేటును సుమారు 50 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చు. ద్రవ్యోల్బణం ఇదే స్థాయిలో కొనసాగి, అటు ప్రభుత్వమూ ద్రవ్య లోటు లక్ష్యాలను సాధించగలిగితే రేట్ల తగ్గింపు బహుశా బడ్జెట్ తర్వాత చేపట్టవచ్చు.
ఇటువంటి పరిణామాల నడుమ రాబోయే 4-6 నెలల్లో 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్ త గ్గవచ్చు. 7.55% -7.70% మధ్య ట్రేడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటప్పుడు ఇప్పటికీ కాస్త అధిక రాబడులే అందిస్తున్న షార్ట్ టర్మ్ ఇన్‌కమ్ ఫండ్స్, ఇన్‌కమ్ ఆపర్చ్యూనిటీ ఫండ్స్ వైపు ఇన్వెస్టర్లు దృష్టి పెట్టవచ్చు. ఈ తరహా ఫండ్స్ స్వల్పకాలికమైనవే కాబట్టి హెచ్చుతగ్గుల ప్రభావం తీవ్రంగా ఉండదు. అలాగే, 1-2 సంవత్సరాల కాలానికి ఇన్‌కమ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే అవకాశాలు కూడా పరిశీలించవచ్చు.
ఎందుకంటే ఒక్కసారి ఆర్‌బీఐ నిర్దేశించుకున్న స్థాయిలో ద్రవ్యోల్బణం స్థిరపడిన పక్షంలో దీర్ఘకాలిక బాండ్ల ఈల్డ్ మళ్లీ క్రమంగా పెరగవచ్చు. తగ్గుతున్న వడ్డీ రేట్లతో ప్రయోజనం పొందాలనుకునే వారికోసం మరికొన్ని సాధనాలు కూడా ఉన్నాయి. డైనమిక్ బాండ్ ఫండ్స్ ఆ కోవకి చెందినవే. ఈ తరహా ఫండ్స్ నిర్వహించే సంస్థలు మార్కెట్‌ను బట్టి గరిష్ట లాభాలను దక్కించుకునేందుకు ఎప్పటికప్పుడు చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా వడ్డీ రేట్లు పెరిగే క్రమంలోనే కాదు.. తగ్గుతున్న తరుణంలో కూడా ఈ తరహా సాధనాల ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు.