ముంబయి: సుభాష్ చంద్ర... దేశీ మీడియా రంగంలో సుపరిచితమైన పేరు. జీ టెలివిజన్ చానెళ్లతో విదేశీ మీడియా సంస్థలకు దీటుగా వ్యాపారాన్ని విస్తరించారు. అయితే, హఠాత్తుగా ప్రధాన కంపెనీలో వాటాలను విక్రయించాలని నిర్ణయించడంతో మీడియాలో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది.
తన వ్యాపారానికి మూల స్తంభంలాంటి జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(జీల్) పగ్గాలను ఎందుకు వదులుకోవాలని అనుకుంటున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ మీడియా దిగ్గజాలు, టెక్నాలజీ కంపెనీలతో పాటు దేశీయంగా మీడియాలో దూసుకెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై కన్నేసినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి.
బంపర్ ఆఫర్ వచ్చిందా...
ఒక గ్లోబల్ మీడియా అగ్రగామి నుంచి భారీస్థాయిలో ఆఫర్ వచ్చిందని... ఈ నేపథ్యంలో తాము వాటా విక్రయానికి సిద్ధమైనట్లు స్వయంగా జీల్ సీఈఓ, సుభాష్ చంద్ర తనయుడు పునీత్ గోయెంకా తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రమోటర్లకు (ఎస్సెల్ హోల్డింగ్స్) జీల్‌లో 42 శాతం వాటా ఉంది. ఇందులో సగం వరకూ వాటాను విక్రయించనున్నామని... కొనుగోలుదారులు అడిగితే మరింత వాటాను విక్రయించడానికి కూడా రెడీగా ఉన్నట్లు గత వారంలో జీ ప్రమోటర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ గోల్డ్‌మన్ శాక్స్, సలహా సంస్థ లయన్ ట్రీలను కూడా నియమించుకున్నారు.
తాము వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలిగే ప్రణాళికల్లేవని పునీత్ చెబుతున్నప్పటికీ.. కంపెనీపై నియంత్రణ వదులుకోవడానికి ప్రమోటర్లు సిద్ధపడే అవకాశం ఉందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కొనుగోలు చేసేందుకు ప్రపంచస్థాయి మీడియా దిగ్గజం ఇటీవలే ప్రమోటర్లను సంప్రతించింది. దీంతో వాటా విక్రయం ప్రక్రియను మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం లభిస్తుంది’ అని గోయెంకా పేర్కొనడం విశేషం.
రేసులో ఎవరెవరు...
జీల్ కొనుగోలు రేసులో అంతర్జాతీయ మీడియా, టెక్నాలజీ దిగ్గజాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవలి ఒక మీడియా కథనం ప్రకారం కామ్‌కాస్ట్, సోనీ, చార్టర్ కమ్యూనికేషన్స్, అలీబాబా, గూగుల్, యాపిల్‌లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ జియోతో దేశీ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ కూడా జీల్‌లో మెజారిటీ వాటా కోసం పోటీపడొచ్చని వార్తలొస్తున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం దేశీ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా కంపెనీల్లో 100 శాతం వాటాను విదేశీ సంస్థలు కొనుగోలు చేసేందుకు వీలుంది. అయితే, తాము వ్యూహాత్మక భాగస్వామ్యానికే మొగ్గుచూపుతామని పునీత్ చెబుతున్నారు.
మరోపక్క, విదేశీ కంపెనీలు కూడా ఇక్కడి కంపెనీలను పూర్తి స్థాయిలో టేకోవర్ చేసేందుకు వెనకాడవచ్చనేది నిపుణుల మాట. విభిన్న భాషలు, సంక్లిష్టమైన కార్యకలాపాలతో కూడిన దేశీ ఎంటర్‌టెన్‌మెంట్ మార్కెట్‌ను నడిపించేందుకు స్థానిక భాగస్వామ్యాన్ని వారు కోరుకోవచ్చని భావిస్తున్నారు. కాగా, తాజా షేరు ధర ప్రకారం జీల్ మార్కెట్ విలువ దాదాపు రూ.42,000 కోట్లు. ఇందులో ప్రమోటర్ల వాటా సుమారు రూ.17,600 కోట్లు. అయితే, ఈ విలువకన్నా 20–25 శాతం అధిక ధరకే డీల్ కుదరవచ్చన్నది విశ్లేషకుల అంచనా. దీని ప్రకారం కంపెనీ మార్కెట్ విలువను రూ.57,800 కోట్ల నుంచి రూ. 64,500 కోట్లుగా (8–9 బిలియన్ డాలర్లు) లెక్కగట్టొచ్చని భావిస్తున్నారు.
ఈ ఏడాది జూలైలో రూపర్ట్ మర్దోక్‌కు చెందిన ట్వంటియత్ సెంచురీ ఫాక్స్ వ్యాపారాన్ని డిస్నీ ఏకంగా 71 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం తెలిసిందే. ఇందులో భారత్ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. దీనిప్రకారం స్టార్ ఇండియా విలువను ఏకంగా 15 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. గ్లోబల్ టెలికం– కంటెంట్ దిగ్గజం కామ్‌కాస్ట్ గనుక జీల్‌లో మెజారిటీ వాటాను దక్కించుకుంటే... అది దేశీ మీడియా రంగం స్వరూపాన్ని మార్చివేయొచ్చని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. రిలయన్స్ జియోపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపొచ్చనేది వారి అభిప్రాయం.
ఓటీటీలో దూసుకెళ్లేందుకేనా...
మీడియా రంగంలో ప్రస్తుతం విపరీతమైన పోటీ నెలకొంది. మరోపక్క, ఇంటర్నెట్ ఆధారిత కంటెంట్ కూడా అంతకంతకూ ప్రేక్షకులను ఆకర్షిస్తుండటం సాంప్రదాయ టెలివిజన్ చానెళ్ల ఆదాయానికి గండికొడుతోంది. ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌గా పిలుస్తున్న ఈ విభాగంలో యూజర్లు అంతకంతకూ పెరిగిపోతుండటం దీనికి నిదర్శనం. ప్రస్తుతం దేశంలో స్టార్ టీవీ గ్రూప్‌నకు చెందిన హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ఆపరేటర్ల కంటెంట్‌కు మంచి గిరాకీయే ఉంది.
ఇదే తరుణంలో సుభాష్ చంద్ర ప్రారంభించిన జీల్ అనుబంధ సంస్థ జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టెక్నాలజీ మీడియా కంపెనీగా జీల్ మార్పు చెందడం కోసమే వాటా విక్రయానికి నిర్ణయం తీసుకున్నట్లు జీ ప్రమోటర్లు చెబుతున్నారు. హాట్‌స్టార్ యూజర్ల సంఖ్య 10 కోట్లను దాటింది. జీ5 యూజర్లు కూడా 5 కోట్లకు చేరుకోనున్నారు. వాస్తవానికి జీ5లోనే వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు వాటా విక్రయించాలని భావించామని... అయితే, మాతృ సంస్థ వద్ద భారీగా కంటెంట్ ఉండటంతో జీల్‌లో వాటాకు విదేశీ ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని పునీత్ చెప్పారు.
తాము అధునాతన టెక్నాలజీతో కూడిన కంటెంట్ కంపెనీగానే కొనసాగాలని భావిస్తున్నామని వివరించారు. అంతర్జాతీయ మీడియా రంగంలో ఓటీటీ కంటెంట్‌తో పాటు టెలికం సేవలు కూడా కలగలిసిపోతు న్నాయి. అందుకే కొన్ని టెలికం, టెక్నాలజీ కంపె నీలు కూడా మీడియాలోనూ (ఓటీటీ ప్లాట్‌ఫామ్) భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. పునీత్ మాత్రం తమకు టెలికంపై ఎలాంటి ఆసక్తీ లేదని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో జీల్‌లో ప్రమోటర్ల వాటా విక్రయానికి భారీగానే విలువ (వేల్యుయేషన్) దక్కొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment