సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ ప్రతినిధి : రామ్ ప్రకాశ్ ముంబై నివాసి. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. తన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌ఓ) నుంచి కొంత మొత్తాన్ని విత్ డ్రా చేయాలనుకున్నాడు. ఎవరిని సంప్రదించాలో తనకు తెలీదు. ఇంకేముంది!! గూగుల్‌లో కొట్టాడు. బాంద్రా ఈపీఎఫ్‌ఓ కాంటాక్ట్ వివరాల కోసం సెర్చ్ చేశాడు. దీపక్ శర్మ అనే ఓ పేరు... సెల్ నెంబరు ప్రత్యక్షమయ్యాయి. సరే!! గూగుల్ చెప్పింది కదా అని సంప్రదించాడు.
ఆ దీపక్ శర్మ... విత్‌డ్రాయల్ ఫారం ఆన్‌లైన్లోనే జరిగిపోతుందంటూ రామ్ ప్రకాశ్ ఫోన్ నంబరు, ఖాతా నంబరు, బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్, పాన్... ఇలా వివరాలన్నీ అడిగాడు. కొన్ని చెప్పాక రామ్‌ప్రకాశ్‌కు అనుమానం వచ్చింది. తను నేరుగా విత్‌డ్రా ఫామ్‌పై సంతకం చేయకుండా అది ఎలా జరుగుతుందనే డౌటొచ్చింది. ఫోన్ కట్ చేశాడు. తరువాత బాంద్రా ఈపీఎఫ్‌ఓ ఆఫీసుకు వెళ్లి ఎంక్వయిరీ చేశాడు. అప్పటికే చాలా మంది ఆ ఆఫీసుకొచ్చి తాము దీపక్ శర్మకు అన్ని వివరాలూ ఇచ్చామంటూ ఫిర్యాదులు చేయటాన్ని గమనించాడు. సరే!! ఎవరు ఏ వివరాలు చెప్పారో... వాటి కారణంగా ఎవరు ఏ మేరకు మోసపోయారో ఇంకా బయటకు రాలేదు. కానీ విషయం మాత్రం ఈపీఎఫ్‌ఓ అధికారులకు తెలిసింది.
ఈపీఎఫ్‌ఓ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విషయాన్ని గూగుల్‌కు కూడా తెలియజేసింది. అంతేకాకుండా స్థానికంగా అన్ని పత్రికల్లోనూ ఈ మేరకు ప్రకటనలిచ్చింది. గూగుల్‌లో తమ కాంటాక్ట్ వివరాలకు బదులు ఎవరో దీపక్ శర్మ నంబరు వస్తోందని, ఆయనకు ఫోన్ చేస్తే బ్యాంకు ఖాతా, పాన్, ఆధార్ తదితర వివరాలన్నీ అడుగుతున్నాడని తమ దృష్టికొచ్చిందని ఫిర్యాదులో పేర్కొంది. గూగుల్ ఇంకా దీనిపై స్పందించలేదు. కాకపోతే దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్లు మాత్రం ఈ టెక్ దిగ్గజం వర్గాలు తెలియజేశాయి.
గుడ్డిగా నమ్మి.. వివరాలివ్వొద్దు
ఏతా వాతా ఈ సంఘటన ద్వారా ఒకటి స్పష్టమవుతోంది. గూగుల్‌ను సైతం గుడ్డిగా నమ్మేయాల్సిన పనిలేదు. గూగుల్ సెర్చ్‌లో వచ్చింది కదా అని తనే నిజమైన వ్యక్తి అనుకుని... కీలక సమాచారాన్నంతటినీ ఇచ్చేయాల్సిన పనిలేదు. అస లు గూగుల్ సెర్చ్ పక్కనబెడితే... ఏ ఆర్థిక సంస్థ అధికారులమని చెప్పినా, ఏ బ్యాంకు ప్రతినిధులుగా పరిచయం చేసుకున్నా... ఎవరికీ వ్యక్తి గత సమాచారాన్ని ఫోన్‌లో ఇవ్వొద్దు. నేరుగా బ్యాంకుకు వెళ్లినపుడు వారు ఏదైనా ఫామ్ ఇస్తే... దాన్ని నింపేటపుడు మాత్రమే కావాల్సిన వివరాలివ్వాలి. ఏ బ్యాంకూ, ఏ ఆర్థిక సంస్థా మీ వ్యక్తిగత వివరాలు, ఓటీపీ వంటివి అడగదని మళ్లీ మళ్లీ గుర్తుంచుకోవాలి. లేదంటే దీపక్ శర్మల్లాంటి వ్యక్తులు తయారవుతూనే ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment