ప్రభుత్వ బ్యాంకులు.. కుదేలు! | Public sector banks declare huge losses | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బ్యాంకులు.. కుదేలు!

Published Thu, May 17 2018 12:50 AM | Last Updated on Thu, May 17 2018 12:50 AM

Public sector banks declare huge losses - Sakshi

ముంబై: మొండిబాకీలు, స్కాములతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటిదాకా ఫలితాలు ప్రకటించిన పది బ్యాంకుల్లో రెండింటిని మినహాయిస్తే.. మిగతావాటన్నింటి పరిస్థితీ ఇదే. మొత్తం ఎనిమిది నష్టాలు ఏకంగా రూ. 39,803 కోట్ల మేర ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిధుల కొరత నుంచి గట్టెక్కించడానికి కేంద్రం గత ఆర్థిక సంవత్సరం ఆఖర్లో అందించిన రూ. 80 వేల కోట్ల అదనపు మూలధనంలో ఇది సగానికి సమానం కావడం గమనార్హం. ఈ గణాంకాలు కేవలం ఎనిమిది బ్యాంకులవి మాత్రమే... ఇంకా పలు బ్యాంకులు ఆర్థిక ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 12,282 కోట్లు, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ రూ. 5,871 కోట్ల మేర నష్టాలు ప్రకటించాయి. విజయ బ్యాంక్‌ (రూ. 727 కోట్లు), ఇండియన్‌ బ్యాంక్‌ (రూ. 1,258 కోట్లు) మాత్రమే వార్షిక లాభాలు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకులు సజావుగా కార్యకలాపాలు సాగించేందుకు కేంద్రం కనీసం రూ. లక్ష కోట్లయినా సమకూర్చాల్సి రావొచ్చనేది విశ్లేషకుల అంచనా.  

బ్యాంకులకు పీసీఏ చిక్కులు .. 
ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మొదలైనవి ఇంకా ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఈ బ్యాంకులు ప్రస్తుతం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాల మేరకు సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) అమలు చేస్తున్నాయి. ఇప్పటికే పీసీఏ అమలు చేస్తున్న బ్యాంకులు.. మొండిబాకీల ప్రొవిజనింగ్‌పై ఆర్‌బీఐ కొత్త నిబంధనలతో మరిన్ని నష్టాలు ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకుల అంచనా. దీంతో కేంద్రం సమకూర్చిన అదనపు మూలధనంలో ఏకంగా 75–85 శాతం వాటా హరించుకుపోవచ్చని వారు చెబుతున్నారు. ప్రస్తుతం 11 పీఎస్‌యూ బ్యాంకులు పీసీఏ కింద ఉన్నాయి. వరుసగా రెండేళ్ల పాటు నష్టాలు ప్రకటించి, మొత్తం మొండిబాకీలు పది శాతం దాటేసిన పక్షంలో రిజర్వ్‌ బ్యాంక్‌ పీసీఏ అమలు చేయాలని ఆదేశిస్తుంది. పీసీఏ విధించిన పక్షంలో ఆయా బ్యాంకులు కొత్తగా మరిన్ని శాఖలు తెరవడంపైనా, సిబ్బందిని తీసుకోవడంపైనా, రిస్కు ఎక్కువగా ఉండే రుణగ్రహీతలకు రుణాలివ్వడంపైనా ఆంక్షలు అమల్లోకి వస్తాయి.  

ద్వితీయార్థంలో మెరుగ్గా పరిస్థితులు.. 
ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులు మరో రెండు త్రైమాసికాలకు మాత్రమే పరిమితం కావొచ్చని, ఆ తర్వాత నుంచి పనితీరు మెరుగుపడొచ్చని బ్యాంకర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. బినాని సిమెంట్, ఎస్సార్‌ స్టీల్, భూషణ్‌ స్టీల్‌ మొదలైన వాటి దివాలా ప్రక్రియలు మొదటి లేదా రెండో త్రైమాసికాల్లో పూర్తయిపోవచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు. వీటి నుంచి రావాల్సినది ఎంతో కొంత వచ్చినా... ఆదాయాలు మెరుగుపడటానికి ఉపయోగపడొచ్చని వారంటున్నారు.

బ్యాంకులపై నేడు కేంద్రం సమీక్ష

న్యూఢిల్లీ: మొండిబాకీల ప్రక్షాళన తదితర అంశాలకు సంబంధించి సత్వర దిద్దుబాటు చర్యలు(పీసీఏ) అమలవుతున్న 11 ప్రభుత్వ  బ్యాంకుల పనితీరుపై ఆర్థిక శాఖ గురువారం సమీక్ష నిర్వహించనుంది. వాచ్‌ లిస్ట్‌ నుంచి బయటపడేందుకు ఆయా బ్యాంకుల చర్యలను సమీక్షించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశిత పీసీఏ అమలు చేస్తున్న బ్యాంకులపై పలు నియంత్రణలుంటాయి. శాఖల విస్తరణ, రుణాల మంజూరు, సిబ్బంది నియామకాలు మొదలైన విషయాల్లో ఆంక్షలు వర్తిస్తాయి. ప్రస్తుతం కార్పొరేషన్‌ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యూకో  తదితర బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి.  

తాజా ఏడాది కనిష్టానికి 9 బ్యాంక్‌ షేర్లు..
ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు భారీ నష్టాలను ప్రకటించడం, తాజా రుణాలు జారీ చేయకుండా  ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో 9 ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లు బుధవారం తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఈ షేర్లన్నీ చివరకు 2–12 శాతం నష్టాలతో ముగిశాయి. అలహాబాద్‌ బ్యాంక్‌(రూ.38.80 ముగింపు ధర),  ఓబీసీ (రూ.78.85), పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ (రూ32.10), పీఎన్‌బీ (రూ.75.55),  దేనా బ్యాంక్‌ (రూ.16.25), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష ్ట్ర(రూ.13.12), కార్పొరేషన్‌  బ్యాంక్‌ (రూ.26), సిండికేట్‌ బ్యాంక్‌ (రూ.43.85), యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు  (రూ.11.02) ఈ జాబితాలో ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement