న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో తనకున్న వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించనున్నట్లు ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వెల్లడించింది. అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ గ్రూప్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ వర్డే పార్ట్‌నర్స్‌కు 2.17 కోట్ల షేర్లను (సుమారు 13 శాతం వాటాలు) విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఈ డీల్ విలువ రూ. 1,8151.6 కోట్లుగా ఉంటుందని వివరించింది. ఇందుకు సంబంధించి ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పీఎన్‌బీ పేర్కొంది. వీటి ప్రకారం.. జనరల్ అట్లాంటిక్ సంస్థకు షేరు ఒక్కింటికి రూ. 850 చొప్పున సుమారు 1.09 కోట్ల షేర్లను, వర్డే పార్ట్‌నర్స్‌కు కూడా ఇదే రేటు కింద మరో 1.09 కోట్ల షేర్లను విక్రయించనుంది.
డీల్ కింద రెండు సంస్థలు చెరి రూ. 925.80 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది డిసెంబర్ 31 ఆఖరు నాటికి పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో పీఎన్‌బీకి 32.79 శాతం వాటాలు ఉన్నాయి. విక్రయానంతరం పీఎన్‌బీ వాటాలు 19.78 శాతంగా ఉంటాయని, ప్రమోటరుగానే కొనసాగుతుందని పీఎన్‌బీహెచ్‌ఎఫ్‌ఎల్ వెల్లడించింది. ప్రాధాన్యేతర ఆస్తుల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ. 8,600 కోట్లు సమీకరించాలని పీఎన్‌బీ నిర్దేశించుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎక్స్‌పీరియన్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలో మొత్తం 42 లక్షల షేర్లను విక్రయించి రూ. 32 కోట్లు సమీకరించింది. శుక్రవారం బీఎస్‌ఈలో పీఎన్‌బీ షేరు 0.05 శాతం పెరిగి రూ. 95.40 వద్ద, పీఎన్‌బీహెచ్‌ఎఫ్ షేరు 4% పెరిగి రూ. 865.70 వద్ద క్లోజయ్యింది.
పీఎన్‌బీ హౌసింగ్‌లో పీఎన్‌బీ వాటాల విక్రయం
Published Sat, Mar 30 2019 1:30 AM | Last Updated on Sat, Mar 30 2019 1:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment