పీఎన్‌బీ లాభాలు 12శాతం అప్
Published Wed, Aug 2 2017 12:35 PM | Last Updated on Mon, Sep 11 2017 11:06 PM
దేశంలో నాలుగో అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు అంచనాలను మిస్ చేసింది. అంచనావేసిన దానికంటే తక్కువగానే లాభాలు పెరిగాయి. బ్యాంకు బుధవారం ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాల్లో నికర లాభం 12.09 శాతం పైకి ఎగిసి, రూ.343.40 కోట్లగా నమోదైనట్టు తెలిసింది. విశ్లేషకులు మాత్రం పీఎన్‌బీ రూ.404 కోట్ల నికరలాభాలన్ని ఆర్జిస్తుందని భావించారు. ఆశ్చర్యకరంగా బ్యాంకు మొండిబకాయిల ప్రొవిజన్లు గతేడాది కంటే 19 శాతం మేర తగ్గాయి. గతేడాది ఇదే క్వార్టర్‌లో రూ.3165.67 కోట్లగా ఉన్న మొండిబకాయిలు ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో రూ.2559.71 కోట్లగా నమోదయ్యాయి. స్థూలంగా మాత్రం మొండిబకాయిలు మార్చి క్వార్టర్‌లో 12.53 శాతముంటే, జూన్ క్వార్టర్‌కు వచ్చేసరికి 13.66 శాతానికి పెరిగాయి.
ఫలితాల ప్రకటన నేపథ్యంలో పీఎన్‌బీ షేర్లు 1.52 శాతం పైన ట్రేడవుతున్నాయి. రూ.159.95 మార్కు వద్ద ప్రారంభమైన ఈ షేర్లు రూ.162 వద్ద గరిష్ట స్థాయిని, రూ.157.80 వద్ద కనిష్ట స్థాయిని తాకాయి. ఓ వైపు స్టాక్‌మార్కెట్లు ఆర్బీఐ పాలసీ ప్రకటన నేపథ్యంలో స్తబ్దుగా ట్రేడవుతున్నాయి. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 4.22 శాతం పైకి ఎగిసి, రూ.3855.13 కోట్ల వద్ద నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈ ఆదాయం రూ.3,698.97 కోట్లగా ఉంది. కాగ, నికర ఎన్‌పీఏలు బ్యాంకువి క్వార్టర్ క్వార్టర్‌కు 8.67 శాతం పెరిగాయి.
Advertisement